తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ని బీజేపీ అత్యంత కీలకంగా భావిస్తోందా? రేపు అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ అనుకుంటోందా? అందుకే ఢిల్లీ స్థాయిలో వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? గల్లీ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా రెక్కలు కట్టుకుని రాబోతున్నారా? అసలు కాషాయ దళం ప్లాన్ ఎలా ఉంది? పెద్ద నేతలు ఎవరెవరు రాబోతున్నారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలన్న టార్గెట్‌తో కమలం పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది నాయకత్వం. పట్టణ ప్రాంత ఓటర్స్ తమకు సానుకూలంగా ఉంటారనే ఆలోచనతో మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారట ముఖ్య నాయకులు. అందుకే కేడర్‌కు భరోసా ఇవ్వడంతోపాటు… మనం ఖచ్చితంగా గెలుస్తాం, సత్తా చాటుతామని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఆ దిశలో ఎవరేమనుకున్నాసరే… కాస్త ఎక్కువ హడావిడే చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈసారి కేవలం రాష్ట్ర నాయకత్వానికి వదిలేయకుండా…. కేంద్ర పార్టీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టిందట.
చిన్న పాము నైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను గుర్తు చేసుకుంటూ…. పేరుకు మున్సిపల్ ఎన్నికలైనా జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా కొట్టాలని భావిస్తున్న అధినాయకత్వం అందుకు మున్సిపల్ ఎలక్షన్స్‌ని ట్రయల్ రన్‌గా భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతల్ని ఇన్ఛార్జ్‌లుగా నియమించింది బీజేపీ అధినాయకత్వం. మహారాష్ర్ట మంత్రి, పార్టీ సీనియర్ నేత ఆశిష్ శేలార్‌ను ఈ ఎన్నికల ఇన్చార్జి గా కేంద్ర పార్టీ అపాయింట్ చేసింది. అలాగే….సహ ఇన్చార్జ్‌లుగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పార్నామి, ఎంపీ రేఖ శర్మలను పంపించింది..వాళ్ళు రాష్ట్రానికి వచ్చారు, మీటింగ్‌లు పెట్టారు. మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యే వరకు వాళ్ళంతా ఇటే ఉంటారని చెబుతున్నారు పార్టీ నేతలు. ఇక ఎన్నికల ప్రచారంలో పార్టీ నేషనల్ లీడర్స్ కూడా పాల్గొంటారట. డైరెక్ట్‌గా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కేంపెయిన్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అలాగే… కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తోంది.
దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో మరొకటి ఉంటాయని అంటున్నారు పార్టీ నేతలు. మహబూబ్ నగర్‌లో జరిగే సభకు నితిన్ నబీన్, నిర్మల్ మీటింగ్‌కు అమిత్ షా అటెండ్ అవుతారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్‌లో భారీ రోడ్డు షో లు కూడా ఉంటాయట. గత GHMC ఎన్నికల సమయంలో కూడా కమలం పార్టీ ఇదే స్ట్రాటజీని అనుసరించింది. అమిత్ షా, నడ్డా లతో పాటు కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు అప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దాంతో… అప్పుడు కేంపెయిన్ ఓ రేంజ్‌కు వెళ్ళింది. ఆ హైప్‌లో బీజేపీ అంతకు ముందు ఎప్పుడూ జీహెచ్‌ఎంసీలో గెలవనన్ని సీట్లు గెల్చుకుంది. అందుకే ఇప్పుడు కూడా అదే రేంజ్ లో హైప్ తీసుకువచ్చి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. జరిగేది లోకల్ ఎలక్షన్స్ అయినా….. విస్తృత ప్రచారంతో హోరెత్తించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.
