జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ప్రభావం ఎంత? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్ కూడా దక్కని పార్టీ… లోక్‌సభ ఎన్నికల నాటికి అనూహ్యంగా పుంజుకోవడాన్ని ఎలా చూడాలి? అసెంబ్లీకి ఒకలా, పార్లమెంట్‌కు మరోలా తీర్పునిచ్చిన ఓటర్ల మైండ్‌సెట్ ఈసారి ఎలా ఉండబోతోంది? ఆ విషయంలో కాషాయదళం ధీమా ఏంటి? జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. కానీ… ఇప్పటిదాకా ఎప్పుడూ భారీగా పోలింగ్ నమోదైన దాఖలాలు లేవు. 50 శాతానికి కాస్త అటు ఇటుగా తేలిపోతున్నాయి లెక్కలు.అయితే ఈ సారి ఉప ఎన్నిక కాబట్టి ఓటింగ్ శాతం పెరగవచ్చన్న అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో… ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైతే… గెలుపు అవకాశం ఉంటుందన్న చర్చలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ప్రధాన పోటీ… కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే అని ప్రచారం జరుగుతున్నా… బీజేపీని కూడా తక్కువ అంచనా వేయొద్దు బాబూ… అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు గత ఓటింగ్ ట్రెండ్‌ను ఉదహరిస్తున్నారు. కమలం పార్టీ పేరుకు బరిలో ఉన్నా… వాళ్ళకు పట్టుమని పది వేల ఓట్లు కూడా రావని వెటకారంగా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే… ఓ అడుగు ముందుకేసి బీజేపీ డమ్మీని అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శించారు. అందుకు కాషాయ దళం నుంచి కూడా గట్టిగానే కౌంటర్స్ పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 25 వేలపైనే ఓట్లు వచ్చాయన్న సంగతిని మర్చిపోవద్దని, ఈసారి మా దెబ్బ ఎలా ఉంటుందో కౌంటింగ్ తర్వాత తెలుస్తుందని అంటున్నారు. 2023 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అజారుద్దీన్ కూడా ఓడిపోయిన సంగతిని గుర్తుంచుకోవాలని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రస్తుతం బరిలో ఉన్న దీపక్ రెడ్డే పోటీ చేశారు. ఆయనకి 26 వేలదాకా ఓట్లు వచ్చాయి. కానీ… డిపాజిట్ దక్కక మూడో స్థానానికి పరిమితమైంది. కానీ.. ఆ తరవాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ పరిధిలో బీజేపీకి అనూహ్యంగా… 64 వేల ఓట్లు పడ్డాయి. అప్పుడు బీజేపీ రెండో స్థానానికి రాగా… బీఆర్‌ఎస్ థర్డ్ ప్లేస్‌కు పడిపోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటుకు గెల్చుకున్న బీఆర్‌ఎస్… లోక్‌సభకు వచ్చేసరికి మూడో స్థానానికి పడిపోవడం పొలిటికల్ పండిట్స్‌ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇదే ఇప్పుడు కాషాయ దళానికి కొండంత ధైర్యం ఇస్తోందట. తక్కువ అంచనా వేయొద్దు…. మేం పుంజుకున్నాం…. డిసైడ్ చేయగల కెపాసిటీ మాది అని అంటున్నారట రాష్ట్ర బీజేపీ నాయకులు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఓటర్ మొగ్గు ఎటువైపు ఉంటుందో అర్థంకావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు బీజేపీ లెక్కలు కూడా వేరేగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకమైనా… వాటిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చీల్చుకుంటాయని, అదే సమయంలోతమకు గతంలోకంటే ఎక్కువ సానుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తున్నారు కమలం నాయకులు. లోక్‌సభ ఎన్నికల నాటి ట్రెండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుందని, అదే తమ సత్తా ఏంటో చెబుతుందని ఆశాభావంతో ఉన్నారు బీజేపీ లీడర్స్.
