తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు రేగుతున్నాయా? పట్టుమని పది నెలలు కూడా గడవకుండానే… జిల్లాల కొత్త అధ్యక్షులను మార్చుకోవాల్సి వస్తోందా? ఈ అధ్యక్షుడు మాకొద్దు మహాప్రభో అని ఏయే జిల్లాల కేడర్ అంటోంది? అసలు ఇప్పుడా మార్పు చర్చ ఎందుకు మొదలైంది పార్టీలో. ఇప్పుడు తప్పు ఆ అధ్యక్షులదా? అలాంటి వాళ్ళని నియమించిన పార్టీ పెద్దలదా? వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజీనామా చేశారు. పైకి మాత్రం అది రాజీనామాలా కనిపిస్తున్నా… అధ్యక్షుడే చేశారని చెబుతున్నా… ఇన్‌సైడ్ మేటర్ వేరే ఉందట. రిజైన్ చేయలేదు, చేయాల్సి వచ్చిందన్నది పార్టీ వర్గాల టాక్. అలాంటివి ఇంకా కొన్ని పైప్‌లైన్‌లో ఉన్నాయన్న వార్తలు తెలంగాణ కాషాయ దళంలో కలకలం రేపుతున్నాయి. వికారాబాద్‌నే తీసుకుంటే… అక్కడ కొంత కాలంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డికి మధ్య పంచాయతీ నడుస్తోంది.
రాజశేఖర్‌రెడ్డిని ఎ్టటి పరిస్థితుల్లో మార్చాల్సిందేనని భీష్మించుకుని కూర్చున్నారు ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి. దాంతో… సంగతేంటో తేల్చమని ఓ కమిటీ వేసింది పార్టీ. ఆ రిపోర్ట్ వచ్చాక జిల్లా అధ్యక్షుని పిలిచి మాట్లాడారట పార్టీ పెద్దలు. ఆ సందర్భంగానే రాజీనామా చేయమని ఆదేశించినట్టు సమాచారం. దాంతో… ఇష్టం లేకున్నా రాజీనామా చేయాల్సి వచ్చిందట రాజశేఖర్‌రెడ్డి. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది తెలంగాణ కమల దళంలో. ఇది వికారాబాద్‌కే పరిమితం అవుతుందా లేక ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయట లీడర్స్‌కు. అనవసరంగా అలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే… అది అనవసరమేమీకాదు, లోపల పరిస్థితులు అలా ఉన్నాయన్నదిపార్టీ వర్గాల మాట. ఇప్పటికే.. పలు జిల్లాల అధ్యక్షులకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు పెరుగుతున్నాయట. కొందర్ని మార్చాలని ఇప్పటికే రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. వివాదాలు ఉన్న జిల్లాల్లో అధ్యక్షులకు ద్వితీయశ్రేణి నుంచి సహకారం కూడా అందడం లేదని చెప్పుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో… వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని తప్పించడంతో… ఇదే అదనుగా…. మా జిల్లా అధ్యక్షుడిని కూడా మార్చేయండన్న డిమాండ్స్ ఊపందుకుంటాయా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇంకా డిమాండ్ స్థాయికి రాలేదుగానీ… మార్చే అవకాశం ఉందా అంటూ రాష్ట్ర కార్యాలయంలో వాకబు చేసేవాళ్ళ సంఖ్య మాత్రం పెరుగుతోందట. ఎంపీ చెబితే పట్టించుకుంటారుగానీ… మా మాటను లెక్కలోకి తీసుకోరా? సమస్యలు అందరికీ ఒకటే కదా? పొజిషన్‌లో ఉన్న వాళ్ళ మాటలకే విలువ ఇచ్చి మిగతా జిల్లాల్లో వదిలేస్తే… రేపు మేం పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారా అన్న నిష్టూరాలు సైతం పెరుగుతున్నాయట. ఇప్పటికే సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ఫిర్యాదులు వచ్చాయి. నల్గొండ జిల్లా అధ్యక్షుడి విషయంలో పెద్ద పంచాయతీనే జరిగింది. గోషామహల్ జిల్లా అధ్యక్ష నియామకం విషయంలోనూ వ్యతిరేకత వ్యక్తం అయింది. అటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఇదే తరహా ఫిర్యాదులు ఉన్నాయట. దీంతో ఎవరి మీద కత్తి వేలాడుతోంది.. ఎవరు సేఫ్ అనే చర్చ జోరుగా జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం క్రమశిక్షణకు కేరాఫ్ అని ఇన్నాళ్ళు గొప్పలు చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ క్రమశిక్షణను ఏ కాకెత్తుకుని పోయిందంటూ సెటైర్స్ వేస్తున్నారు.
