ఎన్నాళ్ళు…? ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులు…? అవతలోళ్ళు దూసుకుపోతుంటే… మేం చేతులు కట్టుకుని చోద్యం చూడ్డం ఇంకెన్ని రోజులు…? ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతల మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో బీజేపీ ఎందుకు తేల్చుకోలేకపోతోంది? ఎక్కడ బ్రేక్స్ పడుతున్నాయి? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది. ప్రధాన పార్టీల.. హడావిడి మొదలైపోయింది. BRS, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి కూడా. వాళ్ళు ప్రచారం కోసం సీరియస్ ప్లాన్స్‌లో ఉన్నారు. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదలవబోతోంది. కానీ… కమలం పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని పార్టీ పెద్దల నుంచి సందేశాలు వస్తున్నా…. నియోజకవర్గ స్థాయిలో మాత్రం… ఇంకెప్పుడు? వై లేట్…? అంటూ అసహనం పెరుగుతోందట. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురితో కమిటీ వేసింది పార్టీ. ఆ కమిటీ అభిప్రాయ సేకరణ జరిపి రిపోర్ట్‌ను రాష్ట్ర అధ్యక్షుడికి అందించింది. అందులో ఐదు పేర్లు ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్య నేతలు, బీజేపీ రాష్ర్ట ఎన్నికల కమిటీ కలిసి ముగ్గురి పేర్లను కేంద్ర కమిటీకి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావు.
అయితే… రాష్ర్ట పార్టీ లిస్ట్ పంపించినా…. కేంద్ర ఎన్నికల కమిటీ వెంటనే ప్రకటిస్తుందా లేదా అనేది తెలియదని అంటున్నారు పార్టీ నేతలు. తెలంగాణతో పాటు ఇంకా 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో… వాటితో పాటే తెలంగాణ అభ్యర్థిని కూడా ప్రకటించవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. అభిప్రాయ సేకరణ కమిటీ ఇచ్చిన 5 పేర్లలో దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ, రామకృష్ణ , ఆకుల విజయ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. మరి రాష్ట్ర నాయకత్వం ఇందులో ఉన్న ఏవైనా మూడు పేర్లనే ఢిల్లీకి పంపుతుందా? లేక అడిషన్స్, డిలిషన్స్ ఉంటాయా అన్న చర్చ కూడా జరుగుతోంది బీజేపీ వర్గాల్లో.
ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆలోచన ఎలా ఉందోనని కూడా ఆరా తీస్తున్నారు కొందరు నాయకులు. అయితే… ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా… అభ్యర్థి ప్రకటన విషయాన్ని మాత్రం నాన్చవద్దని, వీలైనంత త్వరగా తేలిస్తేనే నష్టపోకుండా ఉంటామని అంటున్నారు తెలంగాణ కాషాయ నేతలు. ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించి దూసుకుపోతుంటే…తాము మాత్రం చేతులు కట్టుకుని కూర్చోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది బీజేపీ సర్కిల్స్‌లో. అందుకే వెంటనే క్లారిటీ ఇవ్వాలని, అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
