తెలంగాణ కమలం నేతలకు నివాస గండం పొంచి ఉందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా… పార్టీ పదవులు ఎందుకు రావడం లేదు? అధికార ప్రతినిధుల నియామకం ఆలస్యానికి కారణం ఏంటి? పార్టీ పోస్ట్‌లకు, నేతల నివాసాలకు లింక్ ఏంటి? కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని ప్రకటించి చాలా రోజులవుతోంది. అప్పట్లో దానిమీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అన్ని వర్గాలకు సమన్యాయం జరగలేదన్న అసంతృప్తులు కూడా వెలువడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వారికే ఎక్కువగా పదవులు ఇచ్చారు తప్ప… గ్రామీణ ప్రాంతాల్ని పట్టించుకోలేదన్నది అందులో ప్రధానమైన విమర్శ. అదసలు రాష్ట్ర కమిటీ కాదు, సిటీ కమిటీ అన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపించాయి. అయితే అదంతా నిజం కాదని, అసలు రీజన్స్ వేరే ఉన్నాయన్న వాదనలు వినిపించినా… వాటికి పెద్దగా ప్రాచుర్యం దక్కలేదు. బీజేపీలో అంతా హైదరాబాద్ వాళ్ళకేనని కేడర్‌లోకి బలంగా వెళ్ళిపోయింది. అలా ఎందుకని ఆరా తీస్తే… ఓ టెక్నికల్ రీజన్ తెలిసి షాకయ్యారట పార్టీ పెద్దలు.
పార్టీ స్టేట్ కమిటీలో వివిధ జిల్లాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. కానీ… సాంకేతికంగా చూస్తే… వాళ్ళలో ఎక్కువ శాతం హైదరాబాద్‌లో నివాసం ఉండటం, ఆధార్ కార్డులు, ఓట్లు కూడా సిటీలోనే ఉండటంతో… అంతా రాజధాని వాళ్ళేనన్న ముద్ర పడిందట. దీన్ని బేస్ చేసుకునే అధిష్టానానికి ప్రశ్నలు సంధిస్తున్నారు మిగతా నేతలు. పేరుకు ఒక జిల్లా వాసి అయినంత మాత్రాన.. ఆధార్, ఓటర్ కార్డులు లేకుండా వాళ్ళు లోకల్ ఎలా అవుతారన్నది జిల్లా నేతల ప్రశ్న. దీంతో… అలాంటి ప్రశ్నలు లేవనెత్తిన వాళ్ళకు సమాధానాలు చెప్పుకోలేక అవస్థలు పడ్డారట పార్టీ పెద్దలు. వాళ్ళు సిటీలో ఉన్నంత మాత్రాన ఇక్కడి వాళ్ళు ఎలా అవుతారంటూ ఎదురు ప్రశ్నించినా… గ్రామీణ ప్రాంత నేతలు చల్లబడలేదు, ఈ చర్చ పార్టీలో సద్దుమణగలేదు. ఈ లొల్లి ఇప్పుడు మిగతా పోస్ట్‌ల ప్రకటన మీద పడుతోందన్న ప్రచారం తాజాగా మొదలైంది బీజేపీ వర్గాల్లో. పార్టీ అధికార ప్రతినిధులతో పాటు మరి కొన్ని రాష్ట్ర స్థాయి పోస్టులను, కమిటీలను ప్రకటించాల్సి ఉంది. వీటిని రాష్ట్ర కమిటీ పడ్డ ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించేస్తారని అనుకున్నారు అంతా.
ఇవాళో, రోపోనని అప్పట్లోనే అనుకున్నా… అది మాత్రం జరగలేదు. స్టేట్ ఆఫీస్ బేరర్స్ నియామకం జరిగి రోజులు గడుస్తున్నా ఆ పోస్టుల ప్రకటన మాత్రం రావడం లేదు. అందుకు ప్రధాన కారణం హైదరాబాద్ నేటివ్ అన్నది పార్టీ వర్గాల మాట. ఇప్పుడు అధికార ప్రతినిధుల పదవులు ఆశిస్తున్నవాళ్ళలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అందుకే పార్టీ పెద్దలు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట. హైదరాబాద్ పేరుతో ఇప్పటికే లొల్లి నడుస్తోంది. ఇప్పుడు కొత్త పోస్ట్‌లను కూడా సిటీలో ఉండే వాళ్ళకే ఇస్తే… పంచాయితీ పెద్దదవుతుందన్న అభిప్రాయంతో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో భాగ్యనగర్ లో ఉండడం తమకు గండమైందని అంటున్నారు ొకందరు నేతలు. అదే సమయంలో అధికార ప్రతినిధులు హైద్రాబాద్‌లో ఉంటేనే ఎక్కువ అడ్వాంటేజ్ కదా అన్న వాదన సైతం బలంగా ఉంది. తెలంగాణ లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా… రెండు మూడు గంటలలోపే చేరుకుంటాం కదాఅన్నది కేరాఫ్ హైదరాబాద్ నేతల మాట. ఈ విషయంలో పార్టీ హై కమాండ్ ఎలా ముందుకు వెళ్తుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు.
