NTV Telugu Site icon

Off The Record: తమ వాళ్ళకే పదవులంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒత్తిడి చేశారా..?

Bjp

Bjp

Off The Record: జిల్లా అధ్యక్షుల నియామకం తెలంగాణ బీజేపీలో రచ్చ పెడుతోందా? మెజార్టీ జిల్లాల్లో ఏకాభిప్రాయం కరవైందా? సర్వేలు, అభిప్రాయ సేకరణ అంతా…ఒట్టి మాటేనా? ఎమ్మెల్యేలు, ఎంపీలు సిఫారసు చేసిన వారికి ఎక్కువగా పదవులు దక్కాయన్నది నిజమేనా? అవే లెక్కలు, సిఫారసులు కొన్ని చోట్ల పనిచేయకుండా పోయాయా? జిల్లా అధ్యక్ష పదవులు కేంద్రంగా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?

తెలంగాణ బీజేపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. జిల్లా అధ్యక్షుల నియామకం పార్టీలో అగ్గి రాజేసిందని చెప్పుకుంటున్నారు. కాషాయ పార్టీకి తెలంగాణలో సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 27 జిల్లాల అధ్యక్షుల నియామకానికి కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ రిటర్నింగ్ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి నామినేషన్స్‌ తీసుకొచ్చారు. వాటిని పరిశీలించి అధికారికంగా ప్రకటించేలోపే పలు చోట్ల నిరసనలు మొదలయ్యాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ వారికే కావాలంటూ వత్తిడి తెచ్చారట. వత్తిళ్ళు పనిచేసే పరిస్థితులు కనిపించడంతో… ఆ నిర్ణయానికి అడ్డం తిరిగారు కొందరు నాయకులు. దీంతో 27 జిల్లాలకి ప్రకటించాల్సిన చోట 19 జిల్లాల అధ్యక్షులనే ప్రకటించారు పెద్దలు. అలా ఆగిపోయిన వాటిలో తాజాగా… మరో నాలుగు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది పార్టీ. దీంతో ఇప్పటికే 23 జిల్లాలు కంప్లీట్ అయ్యాయి. మెజార్టీ పని పూర్తయిందని పార్టీ ముఖ్యులు అనుకుంటున్నా.. అధ్యక్షులను ప్రకటించిన జిల్లాల్లో చాలా చోట్ల అసంతృప్తులు పెరుగుతున్నాయట. కొన్ని జిల్లాల్లో నిరసనలు కూడా జరిగాయి.

అయితే, నల్గొండలో జరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యక్రమంలో కూడా ఆందోళన చేశారు బీజేపీ కార్యకర్తలు. కొన్ని జిల్లాల నుండి నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి తమ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారట. కొన్ని చోట్ల స్థానికంగా వచ్చిన అభిప్రాయానికి విరుద్ధంగా జిల్లా అధ్యక్షులను ప్రకటించి అభిప్రాయ సేకరణలో టాప్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళని పక్కన పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. గోల్కొండ గోషామహల్ జిల్లా అధ్యక్షుడిగా తాను వద్దన్న వ్యక్తికి నియమించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట ఎమ్మెల్యే రాజా సింగ్. నా అవసరం పార్టీ కి లేదా అన్నది ఆయన క్వశ్చన్‌. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అంటున్నారట రాజాసింగ్‌. ఇది ఉదాహరణ మాత్రమేనని, ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు ఎంత మేరకు సమన్వయం చేసుకుంటూ నెగ్గుకు వస్తారోనన్న సందేహాలు పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది.

ఇక, ప్రకటించిన చోట్ల పరిస్థితి అలా ఉంటే… పెండింగ్ జిల్లాల అధ్యక్షుల ప్రకటన ఎప్పుడంటూ ఆ జిల్లాల నేతలు ఆరా తీస్తున్నారు. ఏకాభిప్రాయం రాక పోవడం, ఆధిపత్య పోరు.. తన వారికే ఇప్పించుకోవాలన్న ఆరాటం కారణంగా 11 జిల్లాల అధ్యక్షుల ప్రకటన సందిగ్ధం లో పడిందట. మరోవైపు అన్ని వర్గాలకు అవకాశం రాలేదని, ప్రకటించిన అధ్యక్షుల్లో యాదవ్‌లు లేరని, ఎస్టీ లకి స్థానం ఇవ్వలేదని, మహిళకు సరైన ప్రాధాన్యం దక్కలేదని విమర్శలు వస్తున్నాయి. ఇలా వివిధ కోణాల్లో మొత్తంగా చూసుకుంటే… జిల్లా అధ్యక్ష ఎన్నిక కమ్‌ ఎంపిక తెలంగాణ బీజేపీలో అగ్గి రాజేస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర పార్టీ పెద్దలు దీన్ని ఎలా చల్లారుస్తారో చూడాలి.