ఆ జిల్లాలో కూటమి, వైసీపీ నేతలు ఒక అండర్ స్టాండింగ్‌కి వచ్చారా? మున్సిపల్ ఫలితాలు చూసి పరిషత్ ఎన్నికల్లో పిక్చర్ క్లియర్ చేసుకున్నారా? ఫ్యాన్ పార్టీ నాయకులు క్రియేటివ్‌గా ఆలోచిస్తే…అబ్బో ఇదేదో బాగానే ఉందంటూ కూటమి లీడర్స్ కూడా సేమ్ ఫార్ములా ఫాలో అయిపోయారా? ఇద్దరూ కలిసి నొక్కేశారంటూ ఓటర్లు బాధపడ్డారన్నది నిజమేనా? ఇంతకీ వాళ్ళు నొక్కిందేంటి? వీళ్ళకు బాధ ఎందుకు? కాకినాడ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అటు పార్టీ, ఇటు పోటీ చేసే అభ్యర్థులు కలిసి జాయింట్‌గా వైసీపీ తరఫున పోల్ మేనేజ్‌మెంట్ కోసం ఖర్చు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… అధికారంలో ఉన్నాం కదా… మనం ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు ఉండాలనుకుంటూ… కూటమి నేతలు కూడా ఓ రూపాయి అదనంగా యాడ్ చేశారట. మొత్తంగా అలా… అలా ఆ పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. కానీ… ఆ ఫలితాలు చూశాక… వెంటనే వచ్చిన పరిషత్ ఎన్నికల్లో బుర్రకి కాస్త డిఫరెంట్‌గా పదును పెట్టారట వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు.
లోకల్ ఎన్నికలంటే అధికార పార్టీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. మున్సిపల్ ఫలితాలు అదే విషయం చెప్పాయి కూడా. అలాంటప్పుడు పరిషత్ పోరులో మనం మరీ అంత అడ్వాన్స్ అయిపోవడం వల్ల ఒరిగేదేం లేదని డిసైడైనట్టు తెలిసింది. మేటర్ క్లియర్‌గా అర్ధమయ్యాక ఓటర్ తాయిలాల ఊసెందుకని కాస్త గడుసుగా ఆలోచించారట. ఆ ఊపులోనే పంపిణీ కోసంపార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చిన సొమ్మును హోల్డ్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూట్ అయిపోవాలంటూ ఒక ఫిగర్ కూడా చెప్పేసి ఇచ్చిన సొమ్ము ఫైనల్‌గా చేరాల్సిన చోటికి చేరలేదంటున్నారు. జడ్పిటిసి అభ్యర్థులైతే మండల స్థాయిలో, ఎంపీటీసీ అభ్యర్థులైతే గ్రామస్థాయిలో వైసీపీ లోకల్ లీడర్లకు ఓట్లకు తగ్గట్టు అమౌంట్ ఇచ్చేసినా… వాళ్లు మాత్రం అందులో సగం నొక్కేసి మిగతాది కింద స్థాయి క్యాడర్‌కి అప్పగించినట్టు తెలిసింది.
పైగా అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని, మనతో నడుస్తారని అనుకుంటేనే ఇవ్వండి చాలని ఉచిత సలహా కూడా ఇచ్చేసినట్టు తెలిసింది. రిజల్ట్ ముందే కనిపిస్తున్నప్పుడు ఇక పంచడాలు ఎందుకంటూ ఎవరికి వాళ్ళు సొంత జడ్జిమెంట్స్ ఇచ్చేసుకుని వాళ్ల వాటా తీసుకుని సైలెంట్ అయిపోయారు తప్ప…ఫైనల్‌గా చేరాల్సిన చోటికి మాత్రం చేరలేదని అంటున్నారు. ఇక ఇదే సమయంలో… పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వైసీపీ వాళ్ళు ఎంత ఇస్తే… అంతకు అదనంగా మనం ఇద్దామని కూటమి నేతలు సన్నాహాలు చేసుకున్నారట. జిల్లాలో మొత్తం 20 జెడ్పిటిసి, 401 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఆరు ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.
మిగతా ప్రతి చోట దాదాపు ఇదే సీన్ కనిపించిందంటున్నారు. అవతలి వాళ్ళు ఇచ్చాక మనం స్టార్ట్ చేద్దామని కూటమి నేతలు ఎదురుచూస్తుండగానే తెల్లారి పోయింది. ఆ రకంగా పోలింగ్ ముందు రోజు రాత్రి ఏదో జరుగుతుందని ఎదురు చూసిన వాళ్లకు నిరాశే మిగిలిందట. అదే సమంలో ఫ్యాన్ పార్టీ లోకల్ లీడర్లు మాత్రం… ఈసారి కొత్తగా ట్రెండ్ క్రియేట్ చేశామని, పోలింగ్ బూత్‌కు వెళ్ళే దారిలోనే ఇవ్వాల్సింది ఇచ్చేస్తామంటూ…. కబుర్లు చెప్పారట. కానీ అలాంటిదేమీ కనిపించకపోవడంతో… ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా దాని గురించే మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఎవరి స్థాయిలో వాళ్ళు పార్టీల ఏజెంట్స్‌కి ఫోన్ చేసినా స్పందన లేదట. అయినా తప్పదు కదా… అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఓటేసి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన కూటమి నాయుకు సైతం వాళ్ళు ఇవ్వనప్పుడు మనం మాత్రం ఎందుకనుకుంటూ వెనక్కి తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇవ్వకుంటే ఏమైంది, రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయికదా అనేవాళ్ళు కొందరు. దీంతో… వోవరాల్‌గా రెండు పక్షాల వాళ్ళు కలిసి మమ్మల్ని ఎండబెట్టారంటూ కొందరు సెటైరిక్‌గా మాట్లాడుతున్నారట. వాళ్ళని ఎండబెట్టిన సంగతి ఎలా ఉన్నా… పైనుంచి వచ్చిన డబ్బు పంచకుండా… పరిషత్ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని కూటమి,, వైసీపీ రెండు పక్షాల కింది స్థాయి నాయకులు బాగానే వెనకేసుకున్నారన్నది లోకల్ బాటమ్ లైన్.

