OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?

Tdp

Tdp

అక్కడ టీడీపీ గట్టిగా మైండ్‌గేమ్‌ ఆడిందా? లోకల్‌ వైసీపీ లీడర్స్‌ కూడా ఆ ట్రాప్‌లో పడిపోయారా? తాము కావాల్సిన పని చేసేసి కూడా… ప్రతిపక్షానికి ఛాన్స్‌ ఇవ్వకుండా తెలుగుదేశం ఎమ్మెల్యేలు రివర్స్‌ స్ట్రాటజీ అప్లయ్‌ చేశారన్నది నిజమేనా? ఇంతకీ… ఏంటా మైండ్‌ గేమ్‌? ఎక్కడ జరిగిందా వ్యవహారం? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డివిజన్ల పునర్విభజన, ఆ సందర్భంగా టీడీపీ వ్యవహరించిన తీరు గురించిన ఆసక్తికరమైన విశ్లేషణలు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీ తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసి కూడా… ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు రాకుండా… రివర్స్‌ స్ట్రాటజీ అప్లయ్‌ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మైండ్‌ గేమ్‌ గురించే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్ పరిధిలో… గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలున్నాయి. అంతకు ముందు డివిజన్స్‌ సంఖ్య 57కాగా…. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 76కు పెరిగాయి. అయితే… పునర్విభజనకు సంబంధించి టీడీపీ, వైసీపీ మధ్య మొదట్లోనే వివాదం మొదలయ్యింది. పెంపునకు సంబంధించి ఓ మ్యాప్ ముందుగానే లీకైంది. దాంతో… డీ లిమిటేషన్ డ్రాఫ్ట్ ఎలా లీకయిందంటూ అన్ని పార్టీల్లో చర్చ జరిగింది. ఆ చర్చలు అలా నడుస్తుండగానే… ఓ ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. కావాలనే… వ్యూహాత్మకంగా డ్రాఫ్ట్‌ను లీక్ చేశారని అప్పట్లో చెప్పుకున్నారు. లీక్ అయిన డీలిమిటేషన్ మ్యాప్ పై ప్రతిపక్షం వైసీపీలో కూడా తెగ చర్చ జరిగింది.

ఇక పది రోజుల క్రితం డీ లిమిటేషన్ డ్రాఫ్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే… ఎవ్వరూ ఊహించని విధంగా… గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి స్వరం సవరించుకుని హడావుడి చేశారు. అధికారులు రూపొందించిన వార్డుల డీ లిమిటేషన్ డ్రాఫ్ట్ అసంబద్దంగా ఉందంటూ మండిపడ్డారు. అశాస్త్రీయంగా డివిజన్లను విభజించారని కూడా ఆరోపించారు అధికార పార్టీ శాసనసభ్యులు. అంతేకాదు… రోడ్డుకు ఒకవైపున ఒక డివిజన్‌లో మరో వైపు ఇంకో డివిజన్‌లో కలపడం ఏంటంటూ మండిపడ్డారు కూడా. అసలు డీలిమిటేషన్ ఏ ప్రాతిపదికన చేశారంటూ అధికారులను నిలదీశారు శాసనసభ్యులు. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన మైండ్‌ గేమ్‌ మొదలైంది. డివిజన్ల డీలిమిటేషన్ గురించి టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత వైసీపీ నేతలు హడావుడి మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతోపాటు వైసీపీ నేతలు నూరి ఫాతిమా, బాలసాని కిరణ్, మాజీ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు లాంటి నేతలంతా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫైరైపోయారు. పునర్విభజన శాస్త్రీయంగా జరక్కపోతే ఊరుకునేదిలేదన్నారు. తప్పు జరిగిందనడానికి చెప్పడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల విమర్శలే నిదర్శం అని కూడా అన్నారు వైసీపీ నాయకులు. టీడీపీ ఎమ్మెల్యేలే అభ్యంతరాలు చెబుతున్నారంటే… ఇంకో ఆలోచన ఎందుకు? కేంద్రమంత్రి పెమ్మసాని చెప్పినట్లు అధికారులు చేసి ఉంటారంటూ రీజనింగ్ కూడా ఇచ్చారు.

కానీ… అక్కడే వైసీపీ లీడర్స్‌ పప్పులో కాలేశారన్న వాదన వినిపిస్తోంది గుంటూరులో. అసలు డివిజన్ల డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌ను అధికారులు విడుదల చేసిన వెంటనే అందులో ఎలాంటి తప్పులు ఉన్నాయో గుర్తించి మాట్లాడాల్సిన వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. కానీ… అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు అడ్వాన్స్‌ అయి విమర్శించారు. అంటే…తాము చేయాల్సింది చేసేసి ప్రతిపక్షానికి ఛాన్స్‌ ఇవ్వకుండా… టీడీపీ నేతలు రివర్స్‌లో మైండ్‌ గేమ్‌ ఆడారన్న విశ్లేషణలున్నాయి. డివిజన్ల డీలిమిటేషన్‌ మొత్తం టీడీపీ ఎమ్మెల్యేల సూచనలతోనే జరిగిందన్న ప్రచారం కార్పొరేషన్‌లో ఉంది. తమకు అనుకూలంగా ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తారన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే… వైసీపీ నుంచి ఇబ్బందులు రాకుండా…..వాళ్ల నోరు మూయించేందుకే ఇలా రివర్స్‌లో మాట్లాడి ఉంటారని గుసగుసలాడుకుంటున్నారు. డివిజన్ల డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌ను పబ్లిక్ డొమైన్ లో పెట్టామని అధికారులు చెబుతున్నారు. కానీ….
అందులో కొత్త డివిజన్లు ఎక్కడ నుంచి ఎక్కడకు ఉన్నాయో అర్ధంకాని పరిస్థితి. ఫలానా డోర్ నెంబర్ నుంచి ఫలానా డోర్ నెంబర్ వరకూ అంటూ ఇచ్చారు. కొన్ని చోట్ల అయితే… సరిహద్దులుగా సర్వే నంబర్స్‌ని ఉదహరించడంతో అవి ఎరక్కడున్నాయో రెవెన్యూ సిబ్బందికి తప్ప ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఆ సంగతి ఎలా ఉన్నా… తాము చెప్పినట్లే డీలిమిటేషన్ జరిగింది కాబట్టి వైసీపీకి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా రివర్స్ గేమ్‌ ఆడారన్నది గుంటూరు టాక్‌.