Site icon NTV Telugu

Off The Record : టీడీపీ అధిష్టానం కత్తెరకు సానపెడుతుందా…?

Tdp

Tdp

తెలుగుదేశం అధిష్టానం కత్తెరకు సాన పెడుతోందా? అక్కడక్కడా కొందరి తోకలు కత్తిరించడానికి బ్లూప్రింట్‌ రెడీ అయిందా? కొన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి సంకేతాలు వెళ్ళిపోయాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పడ్డది మేమైతే… ఇప్పుడు ఏవేవో లెక్కలు చెప్పి మా గాలి తీసేస్తామంటే ఊరుకుంటామా అంటున్న ఆ నేతలు ఎవరు? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి?

ఉమ్మడి విశాఖ జిల్లా కూటమిలో కాక రేగుతోంది. ఇక్కడ జనసేన గెలిచిన నాలుగు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నిత్య పంచాయితీలకు కారణమైంది. ఇన్ఛార్జ్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు సమన్వయ బాధ్యతలు కట్టబెట్టింది టీడీపీ. దీంతో….మిత్రపక్షం ఇన్ఛార్జ్‌లు షాడో ఎమ్మెల్యేల్లా తయారైనట్టు ఫీలవుతున్నారట నలుగురు జనసేన సిట్టింగ్‌లు. విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం ఉందట. అధికారిక కార్యక్రమాలు, సమీక్షలకు ఇంచార్జుల హోదాలో టీడీపీ సీనియర్లు హాజరు కావడం, ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తుండటంతో… ఎవరి మాట వినాలో అర్ధంగాక అధికార యంత్రాంగం కూడా గందరగోళంలో ఉందని అంటున్నారు. పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇంచార్జ్ గండి బాబ్జీకి సెట్‌ అవడంలేదు.

అనకాపల్లిలో వియ్యంకులైన సిట్టింగ్ ఎమ్మెల్యే కొణతాల, టీడీపీ మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్ మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. ఇక యలమంచిలిలో ఎమ్మెల్యే విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు సమాంతర రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, ఆరోగ్య శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శీతంరాజు సుధాకర్ కౌగిలించుకుంటూనే కత్తులు దూసుకుంటున్నారు. దీంతో వీళ్ళను సమన్వయం చేయలేక ఇన్ఛార్జ్‌ మంత్రులు, ఉన్నతాధికారులు సతమతం అవుతున్నారు. టీడీపీ నాయకులంతా ఎమ్మెల్యేలతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళే కావడంతో… ఎవరికి సర్ది చెప్పాలో కూడా అర్ధంకాని పరిస్థితి. ప్రతిసారి ప్రోటోకాల్ పేరుతో రచ్చ…రచ్చ అవుతుండటంతో ఆ ప్రభావం రెండు పార్టీల కేడర్‌ మీద కూడా పడుతోంది. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పరిణామాల గురించి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట జనసేన సిట్టింగ్‌లు. దాని ప్రభావమో… లేక మిత్ర పక్షం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ఉప్పందిందోగానీ….. ప్రస్తుతం తెలుగుదేశం అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదదలుపెట్టిందట. దాంతో జనసేన ఎమ్మెల్యేలు రిలీఫ్‌ ఫీలవుతుండగా….సొంత నేతలు ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారట.

నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల మాటే ఫైనల్ అని ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి క్లారిటీ ఇచ్చేసినట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు పార్టీకి బాధ్యులు తప్ప పరిపాలన వ్యవహారాలకు కాదని చెప్పేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు సహజంగానే ఆధిపత్య పోరాటం చేస్తున్న తెలుగుదేశం నేతలకు మింగుడుపడ్డం లేదట. నయానో….భయానో పనులు చక్క బెట్టుకుందామని భావిస్తుంటే ఇప్పుడు హైకమాండ్ మా గాలి తీసేసిందని రుసరుసలాడుతున్నారన్నది పార్టీ టాక్‌. మంత్రి నారాలోకేష్ ఇటీవల కొత్త ట్రెండ్‌ మొదలుపెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను కుటుంబాలతో సహా ఆహ్వానించి విందు ఇస్తున్నారాయన. ఏవైనా సమస్యలు ఉంటే వన్ టూ వన్ చర్చించుకునేలా శాసనసభ్యులకు అవకాశం కల్పిస్తున్నారాయన. ఇందులో భాగంగానే…. ఇటీవల అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ జరగ్గా…. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యామిలీలతో సహా హాజరయ్యారు. అయితే… తమకు ఆహ్వానం అందకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారట ఇన్ఛార్జ్‌లు. ఇదొక్కటే కాదు మార్చి మొదటి వారంలో సీఎంతో సమావేశం అయ్యేందుకు షెడ్యూల్ సిద్ధం కాగా…. అప్పుడు కూడా ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ పరిణామం సహజంగానే నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల్లో అసంతృప్తికి కారణమవుతోందంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పడ్డది, పోరాటాలు చేసింది మేమైతే… ఇప్పుడు ఇలా ప్రాధాన్యత తగ్గించడమంటే అవమానిచడం కాక మరేంటన్నది వాళ్ళ ప్రశ్న. ఈ క్రమంలో విశాఖ దక్షిణ ఇంచార్జ్ సీతం రాజు సుధాకర్ పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు పరిమితం అయ్యారు.

పీలా, గండి బాబ్జీ వంటి మాజీ ఎమ్మెల్యేలు సై అంటే సై అనడం అనివార్యంగా భావిస్తున్నారు. పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలోఈ పోరాటం తప్పదనేది వాళ్ళ అభిప్రాయం ఉంది. ఇప్పుడు తగ్గడమంటే…. నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరుల చర్యలను అంగీకరించినట్టేననీ….అది ఖచ్చితంగా తమకు అవమానకరమేనని టీడీపీ సీనియర్స్‌ మధనపడుతున్నట్టు సమాచారం. నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టత, ఎన్నికలకు సన్నద్ధతపై కీలక సమావేశం ఇటీవల అమరావతిలో జరిగింది. దీనికి హాజరైన ఇన్చార్జులు పరోక్షంగా తమ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. TTD సిఫార్సు లేఖలు, జీ రామ్ జీ పనుల కోసం ఎమ్మెల్యేలను బతిమాలుకోవాల్సిరావడం ఇబ్బందికరంగా ఉందని, టీడీపీ కేడర్ అవసరాల కోసం కొన్ని మార్పులు చేయాలని గట్టిగానే గొంతెత్తారటట సీనియర్లు. తెలుగుదేశం అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందో, దీని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయో చూడాలి.ే

Exit mobile version