Site icon NTV Telugu

Off The Record : మంత్రి అనిత, ఎమ్మెల్యే సుందరపు విజయ్ మధ్య విబేధాలు..?

Tdp

Tdp

ఇద్దరూ పొలిటికల్‌ దాయాదులే. ఒకరు మంత్రి అయితే….మరొకరు ఎమ్మెల్యే. కానీ… ఇప్పుడు ఇద్దరి మధ్య మాట పట్టింపులు, పైచేయి పాలిటిక్స్‌ మొదలయ్యాయి. లాబీయింగ్‌తో మంత్రి పంతం నెగ్గించుకుంటే…. మాటచెల్లని ఈ అడ్డరోడ్డు రాజకీయం మనకెందుకంటూ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. ఏ విషయమై కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయి? ఎవరా మినిస్టర్‌ అండ్‌ ఎమ్మెల్యే? వంగలపూడి అనిత…..ఏపీ హోం మంత్రి….కేరాఫ్ పాయకరావుపేట. సుందరపు విజయ్ కుమార్…. జనసేన ఎమ్మెల్యే……కేరాఫ్‌ యలమంచిలి. ఇద్దరూ కూటమి గూటి పక్షులే. పైగా ఇరుగు పొరుగు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్స్‌. సమకాలీన నేతలు కావడంతో ఇద్దరికీ మాట పట్టింపులు కూడా ఎక్కువేనని అంటారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి పంచాయితీనే ఒకటి నేతలిద్దరి మధ్య గ్యాప్‌ పెంచిందట. ఉమ్మడి విశాఖ రాజకీయవర్గాలు దీని గురించే తెగ మాట్లాడేసుకుంటున్నాయి. కొత్త రెవెన్యూ సబ్ డివిజన్ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సమగ్ర అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం అనకాపల్లి జిల్లాలో నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త ఆర్డీవో పని మొదలుపెట్టారు.

నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్స్‌లో వున్న ఏడు మండలాలను విడదీసి కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి తెచ్చింది సర్కార్‌. సముద్రతీర ప్రాంతం, పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా మారడం, తుఫాన్స్‌ వచ్చినప్పుడు కోస్ట్ లైన్లో యంత్రాంగం అందుబాటులో వుంటే సహాయక చర్యలు వేగవంతంగా అందించవచ్చన్న రకరకాల ఆలోచనలతో అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. ఇటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు రాజకీయ పార్టీలు సహజంగానే అడ్వాంటేజ్ కోసం ప్రయత్నిస్తుంటాయి. ప్లస్‌లు మైనస్‌లు లేవనెత్తి ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడం, ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పుకునే ప్లాన్‌లో ఉంటాయి. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. కాకుంటే… కాస్త తేడాగా, మిత్ర భేదం వచ్చేలా. రెవెన్యూ సబ్ డివిజన్ ఇచ్చినందుకు టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. హోంమంత్రి వంగలపూడి అనిత కృషి ఫలించిందంటూ… పాలాభిషేకాలు కూడా చేసేసింది.

కానీ, కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను ప్రతిపాదిస్తూ సబ్ కమిటీ చేసిన సిఫారసులపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలకు దూరాభారం అయ్యే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజల అభిప్రాయం కూడా ఇదే కావడంతో సహజంగానే ఈ పరిధిలో ఉన్న యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మీద కూడా వత్తిడి పెరిగింది. దీంతో.. పక్కనే వున్న అనకాపల్లిని వదిలేసి 50 కిలోమీటర్ల దూరంలో వున్న నక్కపల్లికి వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరమేనంటూ ప్రభుత్వ పెద్దల ద్రుష్టికి తీసుకెళ్ళారు శాసనసభ్యుడు. ఈమేరకు జిల్లా అభివ్రుద్ధి సమీక్షా సమావేశంలో కూడా పట్టుబట్టి తీర్మానం చేయించారు. అవసరమైతే…యలమంచిలి మండలాన్ని కొత్త సబ్ డివిజన్లో కలిపి, మిగిలిన మూడింటిని యథావిధిగా కొనసాగించాలని కోరారు విజయ్ కుమార్. ఐతే, మునగపాక మండలం విషయంలో పునరాలోచన చేసిన సబ్ కమిటీ… రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల విషయంలో మాత్రం తమ సిఫార్సులకే కట్టుబ డింది. ఈ పరిణామాల పట్ల ఎమ్మెల్యే విజయ్‌ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

నక్కపల్లికి బదులు ఆర్డీవో కార్యాలయాన్ని అడ్డరోడ్డులో ఏర్పాటు చేయడం కేవలం కంటి తుడుపు చర్యేనని, హోం మంత్రి పలుకుబడి ఫలించిందిగానీ… ప్రజల పక్షాన తన అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోలేదని ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే…. కొత్త ఆర్డీవో కార్యాలయం ప్రారంభోత్సవానికి సైతం హాజరు కాలేదాయన. నియోజకవర్గంలో పబ్లిక్ గ్రీవెన్సెస్ డే నిర్వహిస్తున్న కారణంగానే వెళ్ళలేకపోయారని సన్నిహితులు చెబుతున్నా… అసలు కారణం మాత్రం అసంతృప్తేనన్నది లోకల్‌ టాక్‌. ప్రజలకు ఇబ్బందికరమైనా సరే… హోం మంత్రి అనిత తన మాట నెగ్గించుకున్నారని, జనం తరపున ఆలోచించిన తాను మాత్రం తగ్గాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సుందరపు ఆవేదనగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అటు పాయకరావుపేట జనసేనలోనూ అసంత్రుప్తి పుట్టింది. సబ్ డివిజన్ వచ్చినందుకు టీడీపీ సంబరాలు చేసింది. చంద్రబాబు, అనిత ఫోటోలకు పాలాభిషేకాలు చేసింది. స్వయంగా హోంమంత్రి ఇంటి దగ్గర జరిగిన ఈ కార్యక్రమంపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మీరు మీరు పాలాభిషేకాలు చేసుకుంటే సరిపోయిందా? కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మా అధినాయకుడి ఫోటో ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు జనసైనికులు. దాంతో… ఈ అసంతృప్తి ఎంతదాకా వెళ్తుందోనన్న చర్చలు సైతం మొదలయ్యాయి. మొత్తం మీద అడ్డరోడ్డు రెవెన్యూ సబ్‌ డివిజన్‌ మాత్రం కూటమిలో కుంపటి పెట్టిందని మాట్లాడుకుంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version