ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి రాజు లేని రాజ్యంలా మారిపోయిందా? బాధ్యత తీసుకుని పార్టీని ముందుకు నడిపే నాయకులు కరవయ్యారా? పేరుకు నాయకులు ఉన్నా… జిల్లాను ఒక తాటి మీద నడిపించే స్థాయి ఉన్నవాళ్శు లేరా? అధికారంలో ఉండి కూడా ఇప్పుడెందుకు పార్టీకి అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనగానే… ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అశోక్ గజపతి రాజు. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్నారాయన. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా దశాబ్దాల పాటు ఉన్నారాయన. ఇక ఎప్పుడు అధికారం వస్తే… అప్పుడు ఆయనకు పదవి గ్యారంటీ అన్నట్టుగా ఉండేది వ్యవహారం. అందుకు తగ్గట్టే…. విజయనగరం జిల్లా నుంచి పదవి కోసం ఆయనతో పోటీ పడే మరో నాయకుడు లేకుండా పోయారు. దీంతో జిల్లా పార్టీ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్‌తో శాసించారన్నది టీడీపీ వర్గాల మాట. శాసించారని కొందరు అంటుంటే… మరి కొందరు మాత్రం మరో నాయకుడు ఎదగకుండా చేశారని విశ్లేషిస్తున్నారు. అదే ఇప్పుడు జిల్లా పార్టీకి అతి పెద్ద సమస్య అయిందంటున్నారు.
అశోక్‌గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంతో… రాజ్యాంగ నిబంధనల ప్రకారం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారాయన. ఇక ఇప్పట్లో ఆయన పొలిటికల్‌గా క్రియాశీలకం అయ్యే అవకాశం లేదు. అందుకే…. ఇక నుంచి విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు ఎవరంటే… అందరిదీ క్వశ్చన్ మార్క్ ఫేసే. ఎందుకంటే… ఇప్పటిదాకా నంబర్ టూ కోసం ఎలాంటి చర్చ జరగలేదు. మిగతా నాయకులు అంత యాక్టివ్ రోల్ తీసుకోవాలని అనుకోలేదు. అంతా బంగ్లా పాలిటిక్స్‌కు అలవాటుపడిపోయారన్నది లోకల్ టాక్. మనం రాజుగారితో బాగుంటే చాలు…. అన్నీ ఆయనేచూసుకుంటారే అన్నట్టుగా ఉండేదట వ్యవహారం. అందుకే… ఇప్పుడు ఆయన తర్వాత ఎవరన్న విషయంలో పెద్ద బ్లాంక్ కనిపిస్తోందని అంటున్నారు. జిల్లాలో ఎవరికి పార్టీ టిక్కెట్స్ ఇవ్వాలో, ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలో అన్నీ ఆయననే డిసైడ్ చేసేవారట. అశోక్ బంగ్లాలో టిక్ పడితే చాలు అంతా కూల్ అన్నట్టుగా అప్పట్లో ఫీలయ్యేవాళ్లు పార్టీ నాయకులు.
జిల్లా పార్టీ పాలిటిక్స్‌లో ఏ సమస్య వచ్చినా పంచాయితీ చివరికి రాజుగారి గదికి వెళ్ళేదట. ఇలా ఎట్నుంచి ఎటు చూసినా…. అంతా ఆయనే కావడంతో…. నాయకులకు వేరే ఆలోచన రాలేదట. ప్రస్తుతం అశోక్ కుమార్తె అదితి గజపతి రాజు విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా సరే… ఆమె తండ్రిలా అంత ప్రభావం చూపలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా… ఇప్పుడున్న పరిస్థితుల్లో జిల్లాను మేనేజ్ చేయాలంటే ఆమె అనుభవం సరిపోదన్నది విస్తృతాభిప్రాయం. నెల్లిమర్ల నాయకుడు అప్పలస్వామి మంత్రిగా, పలు దఫాలు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయన అశోక్ వెనకే ఉండిపోయారు. అలాగే కిమిడి నాగార్జున కూడా పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తల్లి మృణాళిని రాష్ట్ర మంత్రిగా పని చేశారు. కానీ… వాళ్ళు కూడా ఎప్పుడూ బంగ్లా పాలిటిక్స్‌కే ప్రాధాన్యత ఇచ్చారన్న టాక్ ఉంది. అటు బొబ్బొలి రాజులు కూడా పార్టీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గానికే పరిమితమయ్యారు తప్ప జిల్లా మీద పట్టు బిగించే ప్రయత్నం చేయలేదట. గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
అయినా సరే… ఆయన కూడా రాజకీయ అనుభవం లేక బంగ్లా చుట్టూనే ఉంటున్నారన్నది విజయనగరం వాయిస్. ఇక జిల్లాలో ఉన్న మరో సీనియర్ లీడర్ కోళ్ళ లలిత కుమారి. ప్రస్తుతం శృంగవరపు కోట ఎమ్మెల్యేగా ఉన్న లలితకుమారి కూడా అడపాదడపా వాయిస్ వినిపించేవారుగానీ…ఎప్పుడూ అశోక్ మాట దాటి పోలేదంటున్నారు. వీళ్ళంతా… జిల్లాలో పేరుకు నాయకులు అయినా… ఏదన్నా పెద్ద సమస్య వస్తే… అందరితో మాట్లాడి పరిష్కరించడం… చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలత సాధించగలిగేంత స్థాయి లేదన్నది జిల్లా రాజకీయ వర్గాల మాట. ఈ పరిస్థితుల్లో… పక్క జిల్లా నుంచి వచ్చి చీపురుపల్లిలో పోటీ చేసి గెలిచిన కళా వెంకట్రావు మాత్రమే ఇప్పుడు ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారట. ఆశోక్ తర్వాత ఇక్కడ పార్టీని ముందుకు నడిపేంత సీనియర్ జిల్లాలో లేకపోవడంతో… పొరుగు జిల్లా వ్యక్తి అయినా… ఆయన పెద్దరికం తీసుకుంటారా? అందుకు అందరూ ఓటేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మొత్తం మీద అశోక్‌గజపతి రాజు తర్వాత విజయనగరం టీడీపీ రాజు లేని రాజ్యంలా మారిపోయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగామారింది. పార్టీ పెద్దలే ఇతరులను ఇంపోర్ట్ చేస్తారా? లేక ఉన్న వాళ్లవాళ్ల నుంచి ఒకరు ఇప్పుడు ఛాన్స్ వచ్చిందికాబట్టి అంది పుచ్చుకుంటారా అన్న చూడాలి.
