Off The Record : తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్

  • తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్‌, కేడర్‌
  • అధికారంలో భాగస్వామ్యం ఉందా? లేదా? అన్న డౌట్‌
  • స్వీయ తప్పిదాలకు తోడు టీడీపీ లెక్కచేయడం లేదన్న ఆవేదన
  • టిక్కెట్‌ నిరాకరించాక పార్టీ కార్యక్రమాలకు విడివాడ దూరం
Thanuku

Thanuku

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఆ నియోజకవర్గ జనసైనికులు భావిస్తున్నారా? పట్టించుకునే దిక్కులేక ముందే అల్లాడుతుంటే… ఇప్పుడిక మిత్రపక్షం కూడా గుడ్డ కాల్చి మీదేసిందా? అంటుకున్న మరకల్ని కడగడానికి ఎన్ని సంస్కారవంతమైన సోప్‌లు కావాలిరా బాబూ… అంటూ అక్కడ గ్లాస్‌ లీడర్స్‌ ఘొల్లుమంటున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా విచిత్ర పరిస్థితి? అక్కడ టీడీపీతో వచ్చిన ఇబ్బందేంటి? ఎందుకిలా….? మాకే…. ఎందుకిలా….? ఏం పాపం చేశామని? వాళ్ళకి ఏం అన్యాయం చేశామని మమ్మల్ని భ్రష్టు పట్టించి బజారుకు ఈడుస్తున్నారు? నియోజకవర్గానికి నాయకుడు లేకున్నా, పార్టీ పెద్దలు పట్టించుకోకున్నా… ఏదో ఓ మూలనపడి… మా పాటికి మేం మాడిపోయిన మసాలా దోశ తింటుంటే… ఆ పని కూడా చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తణుకు నియోజకవర్గం జనసేన నాయకులు. రాష్ట్రంలో తమ పార్టీ పవర్‌లో భాగస్వామి అయినా….. లోకల్‌గా తమను అధికారానికి ఆమడ దూరంలో ఉంచారంటూ ఆవేదనపడుతున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు వరకు తమకు తిరుగు లేదంటూ తొడలు కొట్టిన నాయకులు సైతం ఇప్పుడు కనీస గుర్తింపు లేదని బాగా ఫీలవుతున్నారట.

 

పరిస్థితి చూస్తుంటే… అసలు మనం అధికారంలో భాగస్వాములం అన్న సంగతి కూడా మర్చిపోయేలా ఉన్నామని, చివరికి ఆటలో అరటి పండుగా చూస్తున్నారంటూ తణుకు గ్లాస్‌ లీడర్స్‌ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే నియోజకవర్గంలో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా మారిపోవడానికి స్వీయ తప్పిదాలు ఒక కారణం అయితే… మిత్రపక్షం టీడీపీ లెక్కలేనితనం మరో కారణం అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయవర్గాలు. పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన సొంతం చేసుకునే సీట్లలో తణుకు ఒకటి అంటూ 2024 ఎన్నికలకు ముందు గట్టిగా ప్రచారం జరిగింది. కానీ… కూటమి సర్దుబాట్లలో భాగంగా చివరి నిమిషంలో ఈ టిక్కెట్‌ తెలుగుదేశం పార్టీ ఖాలాలోకి వెళ్ళిపోయింది. దీంతో… అప్పటివరకు లోకల్‌ జనసేన ఇన్ఛార్జ్‌గా ఉన్న విడివాడ రామచంద్రరావు పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు.

నీకు సీటు ఇవ్వలేకపోతున్నానని కనీసం పార్టీ అధినేత పవన్‌ ఒక్క మాటైనా చెప్పలేదంటూ అప్పట్లో ఆయన హర్ట్‌ అయినట్టు చెప్పుకున్నారు. ఏళ్ళ తరబడి కష్టపడ్డా….. అట్నుంచి కనీస పలకరింపు కరువైందన్న బాధతో పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగిన విడివాడ… ఇప్పటికీ అటువైపు కన్నెత్తి చూడ్డం లేదట. దీంతో తణుకు జనసేన కేడర్‌ సరైన నాయకుడు లేక అవస్థలు పడుతోంది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు జనసైనికులు. విడివాడ రామచంద్రరావు స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. పాత ఇన్ఛార్జ్‌కు బాధ్యతలు ఇవ్వలేదు సరే…. కనీసం పార్టీ కోసం యాక్టివ్‌గా తిరిగే మరొకరిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించే విషయంలో పార్టీ పెద్దలు ఎందుకు చొరవ చూపడం లేదన్నది తణుకు కేడర్‌ క్వశ్చన్‌. అసలే ఇన్ఛార్జ్‌ లేక తమని చులకనగా చూస్తున్నారంటూ బాగా ఫీలవుతున్న జనసేన కార్యకర్తల్ని ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకుల వ్యవహారశైలి బాగా ఇబ్బంది పెడుతోందట. ఇటీవల అత్తిలి మండలం అరవెల్లికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి కోట్లు వసూలు చేశారట.

 

ఉద్యోగాల కోసం వత్తిడి రావడంతో… దాన్నుంచి బయటపడటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో సిఫారసు లేఖలు తయారు చేసే పంచిపెట్టడం లోకల్గా జనసేనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే గుర్తింపు లేదని మొత్తుకుంటుంటే… పుండు మీద కారం చల్లినట్టు కొత్తగా టీడీపీ నాయకులు వసూలు చేసి తమ అధినేత పేరు వాడటం వల్ల రాజకీయంగా ఊపిరి సలపనట్టుగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తణుకు జనసేన లీడర్స్‌. అటు పదవులు దక్కక, ఇటు గుర్తింపు లేక, చివరికి… ఏ మాత్రం సంబంధం లేకున్నా.. అవినీతి మరకలు కూడా అంటడంతో ఈ సంగతి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నట్టు తెలిసింది. నిరుద్యోగులను మోసం చేసింది ఎవరో తెలిసినా… వాళ్ళ గురించి పల్లెత్తు మాట అనలేని స్థితిలో ఉన్నారట జనసైనికులు. ఈ క్రమంలో మరోసారి తణుకులో టిడిపి జనసేన మధ్య కోల్డ్ వార్ మొదలైనట్టు సమాచారం. స్థానిక పరిస్థితుల్ని పవన్‌కు వివరించడానికి లోకల్‌ లీడర్స్‌ కొందరు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దయచేసి ఇప్పటికైనా మాకో ఇన్ఛార్జ్‌ని నియమిస్తే మా పాట్లేవో మేం పడతామన్నది తణుకు జనసేన వాయిస్‌.