ఒకప్పటి టీడీపీ కంచుకోట క్రమంగా చేజారి పోతోందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ దిశగా వార్నింగ్ బెల్ మోగిందా? ఇప్పటికైనా మేలుకోకపోతే… ఆ నియోజకవర్గం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనని స్వయంగా సైకిల్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? అత్యంత అనుకూల వాతావరణంలో కూడా… అక్కడ అధికార పార్టీ ప్రతికూలకలకు కారణాలేంటి? డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ట్యాగ్‌లైన్ ఇది. అలాగే రాజకీయాల్లో కూడా ఏదీ ఊరికే జరగదు. ప్రతి దానికీ ఓ లెక్కుంటుంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు కూడా ఆ లెక్క తప్పుతోందంటే… ఎక్కడో తేడా కొడుతున్నట్టేనని, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీ ఇప్పుడా లెక్కల్ని సరిచూసుకోవాల్సిన సమయం వచ్చిందన్న చర్చలు నడుస్తున్నాయి. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటగా ఉన్న తంబళ్ళపల్లి నియోజకవర్గం.. క్రమంగా వైసీపీకి కంచుకోటగా మారుతోందని చివరికి లోకల్ తెలుగు తమ్ముళ్ళే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి శంకర్ యాదవ్.. పార్టీ పరిస్థితిని చక్కదిద్దుతారని అంతా భావించారు.
కానీ, ఆయన పనితీరు, ముఖ్యంగా పార్టీ కేడర్‌తో ఏర్పడ్డ తీవ్రమైన గ్యాప్ కారణంగా 2019లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందంటారు. కిందిస్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం, సమన్వయ లోపంతో నాడు ఓటమిపాలైన శంకర్ యాదవ్‌ను పక్కనబెట్టి.. 2024 ఎన్నికల్లో సామాజిక సమీకరణల ప్రయోగం చేసింది టీడీపీ అధిష్టానం. నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న మురుసుకాపు సామాజిక వర్గానికి చెందిన జయచంద్రారెడ్డిని చివరి నిమిషంలో బరిలో దించింది. అప్పుడాయన తీవ్రంగా పోరాడి 85 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ, దగ్గర దగ్గర పది వేల ఓట్ల తేడాతో ఓటమి తప్పలేదు. కానీ… ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి అరెస్ట్, వెంటనే పార్టీ నుంచి సస్పెన్షన్ చకచకా జరిగిపోయాయి. ఇవన్నీ గిట్టని వాళ్ళ కుట్రలని ఆయన చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాథుడు లేకపోవడంతో.. కొందరు సీనియర్ల లాబీయింగ్, సిఫారసులతో తిరిగి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కే పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
పాత కాపు వచ్చాడు, ఇక పార్టీ గాడిన పడుతుందని కేడర్ సంబరపడినా.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయిందని తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చెప్పేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 6 జడ్పీటీసీలు ఉంటే అందులో వైసీపీ ఏకంగా 3 స్థానాలను గెల్చుకుంది. అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది, మరో సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తుంటేనే… నియోజకవర్గంలో పార్టీ పట్టు ఎంత దిగజారిందో అర్ధమవుతోందని మాట్లాడుకుంటున్నారట టీడీపీ కార్యకర్తలు. అధికారంలో ఉండి కూడా… నియోజకవర్గంలోని మెజార్టీ జడ్పీటీసీలను ప్రతిపక్షానికి సమర్పించుకోవడం ఏంటంటూ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఎంపీటీసీ లెక్కల్లోనూ అధికార పార్టీకి మింగుడుపడని ఫలితాలే ఎదురయ్యాయి. నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో ఉన్న మొత్తం 72 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 35 గెలుచుకుంటే, వైసీపీ 33 స్థానాలు సాధించి ఢీ అంటే ఢీ అన్నది. ముఖ్యంగా ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ సొంత మండలమైన పెద్దతిప్పసముద్రంలో వచ్చిన ఫలితాలే పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడున్న15 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 8 చోట్ల గెలిస్తే, వైఎస్సార్సీపీ ఆరింటిని గెల్చుకుంది. ములకలచెరువు లాంటి ఒకటి రెండు మండలాల్లో బీజేపీకి చెందిన బలమైన నేత భారీగా ఖర్చుపెట్టి సహకరించడం వల్లే కూటమికి ఈ మాత్రం స్థానాలైనా దక్కాయని, లేకపోతే పరిస్థితి మరింత దయనీయంగా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఒక్కడిగా పోరాడి సాధించిన 85 వేల ఓట్ల బలాన్ని కూడా.. నేడు స్థానిక సంస్థల్లో అధికారంలో ఉండి పార్టీ సొంతం చేసుకోలేకపోవడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. తిరిగి వచ్చాక శంకర్ యాదవ్ పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకోలేకపోతున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. జయచంద్రారెడ్డి సస్పెండ్ అయినప్పటికీ ఆయనకున్న బలమైన వర్గం శంకర్ యాదవ్‌తో కలిసి నడవడానికి ససేమిరా అంటోందని, వీరిద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్ కారణంగానే కేడర్ పూర్తిస్థాయిలో పని చేయలేదన్నది స్థానికంగా గట్టిగా వినిపిస్తున్న మాట. పరిషత్ ఎన్నికల్లో ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబం వేసిన ఎత్తుగడలను తిప్పికొట్టడంలో స్థానిక నాయకత్వం ఘోరంగా విఫలమైందని అంటున్నారు పరిశీలకులు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నాటికైనా లోటుపాట్లను సరిదిద్దుకుని, వర్గాలుగా చీలిన నాయకులను ఏకతాటిపైకి తేకపోతే తంబళ్లపల్లిలో సైకిల్ కోలుకోవడం కష్టమేనని హెచ్చరిస్తున్నారట సీనియర్లు. మరి ఈ వరుస ఎదురుదెబ్బలతోనైనా అధిష్ఠానం కళ్లు తెరిచి తగిన దిద్దుబాటు చర్యలు చేపడుతుందా.. లేక తంబళ్లపల్లిని ఇలాగే గాలికొదిలేస్తుందా అన్న భయాలు తమ్ముళ్ళను వెంటాడుతున్నాయి.

