Site icon NTV Telugu

Off The Record : కొండలకు గుండ్లు.. విచ్చలవిడిగా చెలరేగుతున్న గ్రావెల్ మాఫియా

Tdp Srik

Tdp Srik

అక్కడ ముందు రోజు కనిపించిన కొండ మరుసటి రోజుకు షేప్‌ మారిపోతోందట. రాత్రికి రాత్రే విచ్చలవిడిగా జరుపుతున్న అక్రమ తవ్వకాలతో కొన్ని కొండలకు బోడి గుండ్లు అవుతుంటే… మరికొన్ని అసలు మాయమైపోతున్నాయి. ఎవరు అలా చేస్తున్నారంటే… అన్ని వేళ్ళు కూటమి ఎమ్మెల్యేల వైపే చూపిస్తున్నాయి. ఏ జిల్లాలో జరుగుతోందా తంతు? ఏ స్థాయిలో ప్రకృతి సంపద లూటీ అవుతోంది? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొండలకు బోడిగుండ్లు అవుతున్నాయి. ప్రకృతి రమణీయతకు కేరాఫ్‌గా ఉండే ఎర్రమట్టి కొండల్ని గ్రావెల్‌ కోసం తొలిచి పారేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే… ఒకప్పుడు ఇక్కడ కొండ ఉండేదని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. గ్రావెల్‌ మాఫియాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో… చెలరేగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. వ్యవహారం మొత్తం కూటమి ఎమ్మెల్యేల ప్రధాన అనుచరుల కనుసన్ననల్లోనే జరుగుతోందన్నది లోకల్‌ టాక్‌. ఇన్నాళ్ళు ఇసుక అక్రమాలకు పాల్పడిన కింది స్థాయి నేతలు… ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నదులు నిండుగా ప్రవహిస్తుండటంతో ఆ దారి మూసుకుపోయి ఇక కొండల మీద పడ్డట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పేర్లు పైకి రాకున్నా… మండలాల్లో వాళ్ళ ముఖ్య అనుచరులు చేస్తున్న దందాలు పైకి తెలియకుండా ఉంటాయా అన్నది ఎక్కువ మంది డౌట్‌. జిల్లా ముఖద్వారం ఎచ్చెర్లతో పాటు ఆమదాలవలస, రాజాం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో గ్రావెల్ మాఫియా యధేచ్చగా చెలరేగుతోందట. అక్రమ రవాణాకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉంటున్నాయంటున్నారు.

ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు , ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వర్గాల మధ్య అయితే… అక్రమ తవ్వకాల విషయంలో నువ్వా నేనా అన్నట్టు పోటీ నడుస్తోందన్నది లోకల్‌ టాక్‌. మరోవైపు రాజాం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ అనుచరులు కూడా మేమేం తక్కువ అన్నట్టు ఉంగరాడ మెట్టను తొలి చేస్తున్నారట. ఆమదాలవలస ఎమ్మెల్యే అనుచరులు పొందూరు మండలంలోని గూడెం, కృష్ణాపురం కొండలను పిండి చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యుల కనుసన్ననల్లోనే గ్రావెల్ దందా కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. కోటబొమ్మాళిలో పలుకొండలకు బోడి గుండు చేయడంలో అచ్చన్న కుటుంబ సభ్యుల పాత్ర ఉందని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలాసలో సూది కొండను బోడి కొండ చేశారంటూ ఆందోళనలు నిర్వహించారు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గౌతు శిరీష. కానీ… నేడు మందస , పలాస , వజ్రపు కొత్తూరులో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న అక్రమం మైనింగ్‌ గురించి కనీసం ప్రశ్నించే దిక్కు లేకుండా పోయిందంటున్నారు.

ఈ రకంగా…తిలా పాపం తలాపిడికెడు అన్నట్టు కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల అనుచరులు ఆయా నియోజకవర్గాల్లో ప్రకృతి వనరుల్ని దోచేస్తున్నా… ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారన్న టాక్‌ నడుస్తోంది. అంతా అధికార పార్టీ నేతలే కావడంతో.. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్స్‌ కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారట. కొన్ని మండలాల్లో అక్రమ తవ్వకాలకు సంబంధించి అడపా దడపా నమోదైన కేసుల్ని కూడా పోలీసులు ఫ్రీజ్ లోనే ఉంచారంటే రాజకీయ వత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చన్నది పరిశీలకుల మాట. జిల్లాలో రియల్ ఎస్టేట్‌తో పాటు , పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు కోసం గ్రావెల్‌ డిమాండ్‌ భారీగా ఉంది. దీంతో ప్రభుత్వంలో పట్టున్న వాళ్ళు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నా నియంత్రించే దిక్కు లేకుండా పోతోంది.అర్ధరాత్రి , అపరాత్రి అని లేకుండా జరుపుతున్న త్రవ్వకాల్ని పట్టించుకునే వాళ్ళు కరవయ్యారు. రాత్రి సమయాల్లో అడ్డగోలు తవ్వకాలు జరుపుతుండటంతో…..తెల్లారి వాటిని చూసిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు కొందరికి ప్రత్యక్షంగా, మరికొందరికి పరోక్షంగా ఈ అక్రమ గ్రావెల్ దందాతో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్నారు.

Exit mobile version