Site icon NTV Telugu

Off The Record : జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వచ్చినా సపరేట్ మీటింగ్స్

Congress

Congress

ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతల చేతులు కలవడం లేదు. ఇక మనసులు, మాటల గురించి అయితే చెప్పే పనేలేదు. సర్ది చెప్పాల్సిన జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి కూడా ఓ వర్గాన్ని సపోర్ట్‌ చేస్తూ… అగ్గికి ఆజ్యం పోస్తున్నారట. రెండు వర్గాలు వేర్వేరుగా మీటింగ్స్‌ పెట్టుకుంటే రెండు చోట్లకు వెళ్తున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఏ జిల్లాలో, ఎందుకా పరిస్థితి వచ్చింది? సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు టిడిపి హవా కొనసాగగా… ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ గెలిచింది. 2020 ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. తిరిగి 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కారు జోరందుకుంది. కానీ…ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అడపా దడపా మినహా పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. 1983లో ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే….. తిరిగి 2009లో అప్పుడు టిడిపిలో ఉన్న దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని టిక్కెట్‌ ఇచ్చారు. నాడు ఆయన సొంత ఇమేజ్‌, వైఎస్‌ ఛరిష్మా కలిసొచ్చి సుధీర్ఘ కాలం తరువాత కాంగ్రెస్‌ గెలిచింది. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు హస్తం పార్టీ జెండా దుబ్బాకలో ఎగరనేలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున… కసిగా పనిచేసి… రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుదామని క్యాడర్ అంటుంటే…లీడర్స్‌ మాత్రం యధావిధిగా గిల్లికజ్జాలతో టైంపాస్‌ చేస్తున్నారట. ఇక్కడ చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిది ఒక వర్గం కాగా…ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రవణ్‌ కుమార్‌రెడ్డిది మరో వర్గం. 2014 నుంచే ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రతి సారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతుంటారు. అందుకే వీళ్ళు కలిసి ఉన్న సందర్భాలు బహు అరుదు.

ఈ సారి పార్టీ గెలిచాక నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రవణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను అన్నీ తానై చూసుకున్నారు శ్రీనివాసరెడ్డి. కానీ… తాజాగా శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా యాక్టివ్ అవడంతో… మళ్లీ ఇద్దరి మధ్య పోరు తారా స్థాయికి చేరింది. దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు శ్రవణ్ కుమార్ రెడ్డి. ఈ ప్రెస్ మీట్ తర్వాత ప్రత్యర్థి మీద దాడి సంగతి తర్వాత మళ్ళీ సొంత పార్టీలో గ్రూపుల గోల పెరిగిందట. గతంలో పార్టీలో ఎన్ని గ్రూపులున్నా మీటింగ్ అంటే అందరూ ఒకే వేదికను పంచుకునేవారు. కానీ… శ్రవణ్ కుమార్ ఎంటర్ అయిన తర్వాత ఎవరికి వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అది ఎంతలా అంటే… జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వచ్చినా ఎవరికి వారు సపరేట్‌ మీటింగ్స్‌ పెట్టుకొని మంత్రిని ఆహ్వానించారు. ఫ్లెక్సీల్లోనూ ఎవరి ఫోటోలు వారివే. ఈ సమావేశాలే గందరగోళానికి దారి తీశాయంటున్నారు కార్యకర్తలు.

నియోజకవర్గ స్థాయి సమావేశం రెండు చోట్ల పెట్టడం, రెండు గ్రూపులు లీడ్‌ చేయడం, రెండు సమావేశాలకు మంత్రి పోవడం ఏంటో… అస్సలు అర్ధం కావడం లేదని అంటున్నారు. స్వయంగా మంత్రే రెండు గ్రూపుల మీటింగ్స్‌కు వెళితే… ఎవర్ని అనుసరించాలో మాకు అర్ధం కావడం లేదంటోంది కేడర్‌. ఇప్పుడసలు నియోజకవర్గంలో హఠాత్తుగా శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు యాక్టివ్‌ అయ్యారు.. మంత్రి ఆయనకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. అసలే స్థానిక సంస్థల సమయం. ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య గోల పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు. తన వర్గానికి ఎక్కువ టిక్కెట్లు ఇప్పించుకోవడానికే శ్రావణ్‌కుమార్‌రెడ్డి యాక్టివ్‌ అయ్యారన్నది కొందరి అనుమానం.తన వర్గానికి చెందినవాళ్ళు ఎక్కువ మంది విజయం సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ కోసం గట్టిగా పట్టుబట్టవచ్చన్నది ఆయన ప్లాన్‌గా తెలుస్తోంది. మంత్రి వివేక్‌ శ్రవణ్ కుమార్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంపై శ్రీనివాస్‌రెడ్డి వర్గం మండిపడుతోంది. ఇలా చేస్తే పార్టీ రెండుగా చీలిపోతుందంటూ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని కాదని శ్రావణ్‌కుమార్‌రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నది స్థానిక నేతల అభిప్రాయం. అయితే… శ్రవణ్‌కుమార్‌రెడ్డి వర్గం వాదన మరోలా ఉంది. శ్రీనివాస్‌రెడ్డికి నియోజకవర్గంలో పార్టీని నడిపే సామర్థ్యం సరిపోకపోవడం వల్లే..తమ నేత యాక్టివ్‌ అయ్యారన్నది వాళ్ళ మాట. రెండు వర్గాల వాదన ఎలా ఉన్నా…. పార్టీ మాత్రం పూర్తిగా దెబ్బతింటోందని అంటున్నారు కార్యకర్తలు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే.. రేపు స్థానిక ఎన్నికల్లో బోల్తా కొట్టడం ఖాయమని అంటున్నారు.

 

Exit mobile version