అధికారం లేనప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్‌చేసిన ఆ టీడీపీ సీనియర్స్ ఇద్దరూ… పవర్‌లోకి వచ్చాక ఎందుకు కామ్ అయిపోయారు? పార్టీలోనే ఉన్నాంలే… అని చెప్పడానికా అన్నట్టు అప్పుడప్పడు గొంతు సవరించుకోవడం, మీడియా మైకుల ముందు నోరు తెరవడం తప్ప ఇంకేమీ ఎందుకు చేయడం లేదు? పార్టీ అధిష్టానం మీద వాళ్ళు అలకబూనారా? లేక ఇంకెవరి మీదన్నా కోపం ఉందా? ఎవరా సీనియర్స్? ఏంటా కామ్ కహానీ? సింహపురి రాజకీయాలు ఎప్పుడూ హై ఓల్టేజ్‌లోనే ఉంటాయి. ఆధిపత్యం కోసం అధికార, ప్రతిపక్షాలు చేసే యుద్ధం ఇక్కడ ఎప్పుడూ హీట్ పెంచుతూనే ఉంటుంది. అందులో భాగంగానే… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీ తీవ్ర వత్తిడిని ఎదుర్కొంది. ఆ క్లిష్ట పరిస్థితుల్లో జిల్లా పార్టీని అంతా తామై నడిపించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర. నేతల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు కూర్చోబెట్టి సర్ది చెప్పేవారు. లుకలుకలు ఏమున్నాసరే… లోపలే దాచి పైకి మాత్రం మేమంతా ఒక్కటేనన్నట్టు బిల్డప్ ఇచ్చేవారు. అందుకే అప్పట్లో కేడర్ కూడా చెక్కుచెదరలేదని ఇప్పటికీ చెప్పుకుంటారు. దాంతో… పార్టీ అధికారంలో రాగానే ఇద్దరూ దూకుడు పెంచుతారని భావించారు జిల్లా నాయకులు. కానీ… వాస్తవంలో సీన్ రివర్స్ అయిందట.
విపక్షంలో ఊపు చూపిన కీలక నేతలు ఇద్దరూ ఇప్పుడసలు జిల్లా వ్యవహాహాల గురించి మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రభుత్వం మీద వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నా.. జిల్లా టీడీపీ సీనియర్స్ మాత్రం మనల్ని కాదుకదా… అన్నట్టు వ్యవహరిస్తున్నారట. మాజీ సీఎం జగన్ మీద మాట్లాడేందుకు మాత్రమే సోమిరెడ్డి నోరు మెదుపుతున్నారు తప్ప.. జిల్లా వ్యవహారాలను పట్టించుకోవడం లేదట. పైగా… కార్యకర్తలకు నేతలు ఎవరూ అందుబాటులో ఉండకపోవడంతో… కష్టమొస్తే ఎన్టీఆర్ భవన్ వైపు చూసే వాళ్ళంతా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీద రవిచంద్ర చెప్పిందే వేదంగా నడిచింది. అప్పుడు కూడా మంత్రులు ఉన్నప్పటికీ.. అధికారులు మాత్రం రవిచంద్ర చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ… ఈసారి అధికారంలోకి వచ్చాక మాత్రం బీద రవిచంద్ర మౌన ముద్రలో ఉన్నారు. జిల్లాకు చెందిన ఓ మంత్రి బీద ఆధిపత్యానికి చెక్ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కొందరు అధికారులు పోస్టింగ్స్ కోసం బీద దగ్గరికి వెళ్ళడం దుమారం రేపింది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ రావడంతో… జిల్లా వ్యవహారాల్లో వేలు పెట్టడమే మానేశారట రవిచంద్ర. రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్‌గా.. ఎమ్మెల్సీగా ఆ స్థాయిలోనే తిరుగుతున్నారు తప్ప లోకల్‌గా టచ్ మీ నాట్ అంటున్నారు.
సొంత నియోజకవర్గం కావలిలో కూడా స్థానిక ఎమ్మెల్యేని కాదని బీదాకు పనులు జరగడం లేదట. దీంతో.. ఏమీ లేనప్పుడు ఎగిరెగిరి పడటం ఎందుకనుకుంటూ… ఆయన కూడా లైట్‌గానే ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రవిచంద్ర. అప్పట్లో పార్టీ వ్యవహారాలన్నిటినీ ఆయనే చూసుకోగా… ప్రభుత్వ కార్యక్రమాలను అప్పటి మంత్రులు నారాయణ, సోమిరెడ్డి సమన్వయం చేసుకునేవారు. అలా..అంతా ఒక్కటిగా ఉండి ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కునేవారు. ఒక్కరి మీద ఆరోపణలు వచ్చినా… అంతా కలిసి ఖండించేవారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు తరచుగా జరుగుతుండేవి.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. జిల్లాలో ఎవరో ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకొని వైసీపీ విమర్శిస్తుంటే…. తిట్టింది మనల్ని కాదు కదా అన్నట్టుగా ఉంటున్నారు మిగతా వాళ్ళు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో పాటు.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తున్నారు.
ఇక మిగిలిన వారెవరు రాజకీయ విమర్శలు చేయడానికి కూడా సుముఖంగా లేరట. ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న బీద రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రస్తుతం స్థానిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు అధిష్టానం సహకారం కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో… వాళ్ళు జిల్లాను పట్టించుకోవడం లేదని, మిగతా నేతలు కూడా ఆ… ఏముందిలే అన్నట్టు వ్యవహరించడం వల్ల అధికారం ఉన్నా సరే… కేడర్‌లో ఒకరకమైన నిస్తేజం ఆవహించినట్టు తెలుస్తోంది. జిల్లాలో వైసీపీ ఏదో ఒక కార్యక్రమంతో జనాల్లోకి వెళ్తుంటే.. చేసిన మంచిని కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో లోకల్ టిడిపి నేతలు ఉన్నారన్నది కేడర్ మాట. మంత్రులు రాష్ట్ర స్థాయిలో బిజీ పేరుతో.. జిల్లా వ్యవహారాలను పూర్తిగా పక్కన పెట్టేశారన్న అసంతృప్తి సైతం పెరుగుతోంది. జిల్లా రాజకీయాల్లోకి కొత్త నేతలు ఎంట్రీ ఇవ్వడంతో.. పాత వాళ్ళకు ప్రయారిటీ తగ్గిందని, అందుకే అంతకు ముందు యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కామైపోతున్నారన్నది లోకల్ కేడర్ వాయిస్. ఫలితంగా పార్టీకి గట్టి డ్యామేజ్ జరుగుతోందన్నది వాళ్ళ ఆవేదన.
