Site icon NTV Telugu

Off The Record : సిర్పూర్ బీఆర్ఎస్ లో కాక రేపుతున్న ఆ నేతలు ఎవరు?

Sirup

Sirup

ఆరు నూరైనా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని ఒకరు, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్‌… గట్టి పనేదో చేసి చూపవోయ్‌ అంటూ మరొకరు. అక్కడ కారు పార్టీలో కాక రేపుతోంది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఎక్కువ పంచాయతీలు గెల్చుకున్న ఆనందం లేకుండా బీఆర్‌ఎస్‌ పెద్దల్ని కంగారు పెడుతున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా ఇద్దరు? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు ఎక్కువ సాధించిన నియోజకవర్గాల్లో ఒకటి సిర్పూర్. ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యే లేరు. కానీ… మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటా పోటీగా పనిచేసి ఈ రిజల్ట్‌ సాధించారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ప్రత్యర్థులు. అప్పుడు బీఎస్పీ నుంచి ఆర్‌ఎస్‌ పోటీ చేయగా…. బీఆర్ఎస్ తరపున కోనప్ప బరిలో దిగారు. ఫైనల్‌గా ఇద్దరూ ఓడిపోయారు. కోనప్ప కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయి.. వెంటనే తిరిగి బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి మేలు జరిగినా….పంచాయతీ ఎన్నికలు మరోసారి వర్గపోరుకు ఆజ్యం పోశాయట. అవి పార్టీ సింబల్‌తో సంబంధం లేని ఎన్నికలు కావడంతో….కోనప్ప, ప్రవీణ్‌కుమార్‌ పోటాపోటీగా అభ్యర్థుల్ని నిలబెట్టి బలపరిచారు. ఇక్కడ బీజేపీకి ఎమ్మెల్యే హరీష్‌రావ్ ఉన్నప్పటికి పోటీ మాత్రం ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతల వర్గాల మధ్యనే జరిగింది. చివరికి కాంగ్రెస్ కూడా సిర్పూర్‌లో చతికిలపడింది. ఫైనల్‌గా కోనప్ప వర్గం 54, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ వర్గం 20 గ్రామ పంచాయతీల్ని దక్కించుకున్నాయి. అధిక స్థానాలు సాధించి కోనప్ప వర్గం ఖుషీలో ఉండగా… ఆర్ఎస్పీ అనుచరులు మాత్రం కాస్త నారాజ్‌లో ఉన్నారట. అయితే పార్టీ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ… కోనప్ప మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్‌ఎస్‌ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచామని పార్టీ అధిష్టానం ఆనందంలో ఉన్నా…ఎవరికి వారు వర్గ ముద్రలు వేసుకోవడం మాత్రం మింగుడు పడటం లేదట.

సరే… బీఫాం ఇచ్చే ఎన్నికలు కాదు కాబట్టి ఓకే అనుకున్నా….అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుందన్న చర్చ నడుస్తోంది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటిసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాంలు ఉంటాయి. వాటిని ఇచ్చే అధికారం ఆర్ఎస్పీకే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేయడమే కాదు, అలాగే జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. కానీ… ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిపించిన తమ బాస్‌కే పార్టీలో పరపతి ఉంటుందని, ఆ పవర్‌ కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం చేస్తోంది కోనప్ప వర్గం. తమ సర్పంచ్‌లతో కలిసి నేరుగా కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పాలని ఒకరు భావిస్తుండగా… మరో నేత మాత్రం తాడో పేడో తేల్చుకుందాని డిసైడ్ అయినట్టు సన్నిహితులతో అంటున్నారట. ఈ పోటా పోటీ వ్యవహారాలతో కట్టర్ బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో పడిపోతోందని అంటున్నారు. కోనప్ప రీ ఎంట్రీ సమయంలోనే అధిష్టానం ఆర్ఎస్ ప్రవీణ్ తో మాట్లాడి సెట్ చేసిందని, ఆయన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలని పార్టీ పెద్ద భావించారని, సిర్పూర్ కోనప్పకే అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ… తాజాగా సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో రెండు వర్గాలు మళ్లీ రీ యాక్టీవ్ కావడం కారులో కాక రేపుతోంది. పార్టీ అధిష్టానం ఇద్దరిలో ఎవరికి నచ్చజెపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సిర్పూర్‌ను వదిలిపెట్టే ప్రస్తకే లేదని ప్రవీణ్‌కుమార్‌ చెబుతుండగా…. మాటలు అవసరం లేదు, పనితీరే కొలమానం అంటూ కోనప్ప వర్గం సైలెంట్‌గా ఉందట. ఫైనల్‌గా అధిష్టానం ఎవరి సేవల్ని ఎక్కడ ఉపయోగించుకుంటుందోనని ఆసక్తి చూస్తోంది సిర్పూర్‌ బీఆర్‌ఎస్‌ కేడర్‌.

Exit mobile version