ఒకవైపు విమర్శల బాణాలు…. మరోవైపు నిశ్శబ్దంగా పావులు కదుపుతున్న నాయకత్వం. SIR సర్వే అంటేనే ఆందోళన చెందుతున్న వేళ…. ఆ నేత రూట్ మార్చారా? అది తనదాకా వచ్చేసరికి డ్యామేజ్ జరక్కుండా ముందు నుంచే జాగ్రత్త పడుతున్నారా? తన ఓట్ బ్యాంకుకు చిన్న గీత కూడా పడకుండా…. ఎంఐఎం అధినేత అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారా? ఏవా అస్త్రాలు? ఏంటా వ్యూహం? అసలు హైదరాబాద్ పాతబస్తీలో ఏం జరుగుతోంది….? రాగానికి తగ్గట్టే తాళం వేయాలి…. కాలానికి తగ్గట్టు వ్యూహం మార్చాలి. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారట ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…. *’సర్’* సర్వేతో తన పార్టీకి ఇబ్బందులు రాకుండా, తన ఓట్ బ్యాంక్ తగ్గకుండా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఆయన. హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్.
సర్ సర్వేలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం 11 రకాల గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. ముఖ్యంగా 1987 కంటే ముందు పుట్టిన వారికైతే తల్లిదండ్రుల వివరాలు, 2004లోపు పుట్టిన వారికైతే బర్త్ సర్టిఫికెట్స్ తప్పనిసరి అంటోంది సర్కార్. దీంతో… ఈ నిబంధనల ఉచ్చులో తమ ఓటర్లు చిక్కుకుని ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తమయ్యారట ఒవైసీ. దానికి విరుగుడు మంత్రాన్ని కూడా కనిపెట్టేసి అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఓట్లు ఒక్కటి కూడా పోకుండా ఎంఐఎం టీమ్ జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఎక్కడా ఏ చిన్న గ్యాప్ లేకుండా ‘సర్’కు ఒవైసీ మార్క్ ట్రీట్‌మెంట్ మొదటు పెట్టారంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఒకవైపు బహిరంగంగా సర్‌ను విమర్శిస్తూనే…. మరోవైపు గ్రౌండ్ లెవల్‌లో డ్యామేజ్ కంట్రోల్ దిశగా ఎంఐఎం శ్రేణులు యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్స్‌లో తమకు స్టాండర్ట్ ఓట్ బ్యాంక్ అనుకున్న అందరికీ… పాస్‌పోర్ట్, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు…. స్థానిక సంస్థలు జారీ చేసే నివాస ధ్రువీకరణ పత్రాలను కూడా సమకూర్చే పనిలో మజ్లిస్ కేడర్ బిజీ అయిపోయిందట. సర్ టీమ్ కంటే ముందే…. ఎంఐఎం కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్ చేసి సరైన ధృవీకరణ పత్రాలు లేనివాళ్ళందరికీ వాటిని సమకూర్చే పనిలో ఉన్నట్టు తెలిసింది. అటవీ హక్కుల పత్రాల నుంచి బ్యాంకులు, ఎల్‌ఐసీ జారీ చేసిన ఆధారాల దాకా…. ప్రతి ఒక్కదాన్ని పట్టి పట్టి చూస్తూ… గల్లీ గల్లీలో వెదుకుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏదో ఒక కారణంలో సరైన ధృవీకరణ పత్రం లేదని చెప్పి ఓటు తీసేయకుండా పకడ్బందీ ఏర్పాట్లలో మునిగిపోయిందట మజ్లిస్ యంత్రాంగం. ఈ సర్టిఫికెట్ డ్రైవ్ పూర్తయ్యే సరికి తమ పరిధిలోని ఏ ఒక్కరూ ధృవీకరణ పత్రాలు లేకుండా ఉండకూడదని, ఓట్లు కోల్పోయి నష్టపోయే పరిస్థితి రాకూడదన్నది ఎంఐఎం అధిష్టానం ప్లాన్ అట. ఇంత పకడ్బందీగా చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? సర్ సర్వే నిబంధనలను తట్టుకుని ఓవైసీ తన కంచుకోటను ఎంతవరకు కాపాడుకోగలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఫైనల్‌గా అడుగు ఎటువైపు పడుతుందో…. పాతబస్తీ రాజకీయాలను ఈ ‘సర్ చికిత్స’ ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.
