సిక్కోలు ఫ్యాన్ వ్యవహారం చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉందా? గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు గెలవకున్నా… సీనియర్ లీడర్స్ మధ్యవిభేదాలు ఏ మాత్రం తగ్గలేదా? కలవాల్సిందే, కలిసి పనిచేయాల్సిందేనని వైసీపీ పెద్దలు నెత్తీనోరూ బాదుకుంటున్నా క్షేత్ర స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం లేదు? మాజీ మంత్రి ధర్మాన కొడుకు తాజాగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించినవి? ఆత్మవిశ్వాసమో లేక తమ ఆధిపత్యానికి అడ్డంకులు వస్తున్నాయన్న అసహనమోగానీ…. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు రాంమనోహర్ నాయుడు చేసిన వాఖ్యలు సిక్కోలు వైసీపీలో దుమారం రేపుతున్నాయి. సొంత పార్టీ నాయకుల్ని ఉద్దేశించే రామ్‌మనోహర్ ఘాటు మాటలు మాట్లాడ్డం ఇటు రాజకీయవర్గాల్లో సైతం చర్చనీయాంశం అయింది. పక్క జిల్లాల వాళ్ల పెత్తనం మాకు అక్కరలేదంటూ…. ఎవరి తల వాళ్ళు దువ్వుకుంటే పాపిట తిన్నగా వస్తుంది, పక్కోడు దువ్వితే వంకర టింకరగా పోతుందని అనడం కొత్త సందేహాలను తెర మీదికి తెచ్చింది.
తన తండ్రి ప్రసాదరావు 2004లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, నాడు పక్క జిల్లాల వాళ్ళు గెలిపించలేదని అన్నారట ఆయన. దీంతో… సన్నాఫ్ ధర్మాన… పొరుగు జిల్లాలో ఉన్న మరో సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణను ఉద్దేశించే ఆ మాటలు అని ఉంటారన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు బొత్స. ఆ కుటుంబానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా గ్రిప్ ఉంది. ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం లోక్‌సభ సీటు పరిధిలోకి వెళ్ళిపోవడం, పాలకొండ… మన్యం జిల్లాలో భాగంగా ఉండటంతో మూడు నియోజకవర్గాలు పూర్తిగా బొత్స కుటుంబం కనుసన్ననల్లోకి వెళ్ళిపోయినట్టయిందంటున్నారు పరిశీలకులు. మరో వైపు తమకు ఏ కష్ణం వచ్చినా…. జిల్లాలోని తూర్పు కాపులు , కాళింగులతో పాటు పలు ఇతర కమ్యూనిటీల వాళ్ళు కూడా బొత్స సత్యనారాయణతోపాటు మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను వద్దకు పరుగులు పెడుతుంటారు. దీంతో పార్టీ అధికారంలో లేకున్నా… క్యాడర్ ఈ ఫ్యామిలీ విషయంలో కాస్త సానుకూలంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో… ధర్మాన రాంమనోహర్ నాయుడు సత్తిబాబు కుటుంబాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నది పరిశీలకుల అంచనా. అయితే… ఇలాంటి విభేదాలే సిక్కోలు వైసీపీని దెబ్బ తీస్తున్నాయన్నది కేడర్ వాయిస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఒక్కచోట కూడా గెలవలేదు వైసీపీ. ఇలాంటి కష్టకాలంలో రాం మనోహర్ నాయుడు అన్న మాటలు పార్టీలోని ఆధిపత్య పోరును బయట పెట్టినట్టు అయిందని అంటున్నారు పండిట్స్. తండ్రి దృష్టిలో ఉండే… ఆయన అలా అన్నారా? లేక ఇన్‌స్టంట్ రియాక్షనా అన్న సంగతి పక్కన పెడితే… ధర్మాన రామ్‌మనోహర్ నాయుడి మాటలు మాత్రం దుమారం రేపుతున్నాయి. ప్రక్కజిల్లా వారి సలహాలు , సూచనలు అవసరం లేదంటూనే… ముందు మీ జిల్లాలలోని సమస్యలు పరిష్కరించుకోవాలంటూ చురకలు వేయటం చూస్తుంటే.. టార్గెట్ బొత్స ఫ్యామిలీనే అన్న అభిప్రాయం బలపడుతోంది.
అయితే… దీనివల్ల ఆయన ఏం సాధిస్తారన్న ప్రశ్న వైసీపీ వర్గాల నుంచే వస్తోంది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లోని పరిస్థితులు, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీ వైసీపీలో విషయం వేరన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇలాంటి మాటల వల్ల పార్టీలోని గిల్లి కజ్జాలు బయటకు తెలియటం మినహా ఒరిగేదేం ఉండదన్నది సీనియర్స్ అభిప్రాయం. కార్యకర్తలతో సభల్లో కాకుండా… ఏమైనా ఇబ్బందులు ఉంటే నాలుగు గోడల మధ్య అధినేతతో మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో… ఐక్యతా రాగం వినిపించాల్సిన చోట ఇలా అంతర్గత విషయాల గురించి బయట మాటాడటం కరెక్ట్ కాదంటూ… సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారట.

