Site icon NTV Telugu

Off The Record : సామినేనికి మింగుడుపడని జగ్గయ్యపేట వ్యవహారాలు

Janasena

Janasena

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఫీలవుతున్నారా? పార్టీ మారి తప్పు చేశానా అనుకుంటున్నారా? నాలుగు సార్లు గెలిచిన సొంత నియోజకవర్గంలోనే వేలు పెట్టలేని పరిస్థితి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకి, జనసేనలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకి మధ్య ఇన్నాళ్లు జరుగుతున్న కోల్డ్‌వార్‌ ఇక ఓపెన్‌ అయిపోయిందా? ఎవరా ఇద్దరు నాయకులు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సామినేని ఉదయభాను. ఇక గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచే వైసిపి తరఫున ఉదయభాను పోటీ చేయగా…. కూటమి నుంచి టిడిపి అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య బరిలో దిగి మూడోసారి ఉదయభాను మీద గెలిచారు. ఇద్దరి మధ్య ఏళ్ళుగా రాజకీయ శత్రుత్వం ఉంది. ఇక ఎన్నికల తర్వాతి పరిణామాలతో వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు ఉదయభాను. ఆయనకు జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పదవి దక్కింది. దీంతో… మిత్రపక్షంగా టీడీపీ నాయకుల్ని కలుపుకునిపోక తప్పని పరిస్థితి.

జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఇబ్బంది లేకున్నా…. తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గయ్యపేటలో వ్యవహారాలు మాత్రం ఆయనకు మింగుడు పడ్డం లేదట. నియోజకవర్గ పరిస్థితులపై తరచూ ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జనసేన జిల్లా అధ్యక్షుడిగా…. మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు స్వాగతాలు పలుకుతున్నా, తనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా….జగ్గయ్యపేటకు వచ్చేసరికి మొత్తం రివర్స్‌లో ఉంటోందట. ఇక్కడ ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం జరిగినా….. తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, అందుకు ప్రధాన కారణం టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యేనని అసహనంగా ఉన్నారట సామినేని. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతున్నదేనన్నది ఆయన సన్నిహితుల మాట. ఇదే విషయాన్ని ఉదయభాను కూడా ఇప్పటికే రెండు మూడుసార్లు బహిరంగ వేదికలపై ప్రస్తావించారు.స్థానిక ఎమ్మెల్యే కూటమి ధర్మం ప్రకారం సహకరించటం లేదంటూ కుండబద్దలు కొట్టడం చర్చనీయాంశగా మారింది. తనను ఏ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో పాటు జనసేన నాయకులకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏ పని జరగకుండా ఎమ్మెల్యే వర్గం అడ్డుపడుతుతోందన్నది సామినేని సన్నిహితుల ఆరోపణ.

ఎమ్మెల్యే సహకరించకపోయినా జనసేన శ్రేణులకు పార్టీ తరఫున అండగా ఉంటామని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో చర్చగా మారాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం లో సామినేని వర్సెస్ శ్రీరామ్ తాతయ్య వ్యవహారం ఏళ్లుగా ఉంది. ఇప్పుడు ఇద్దరూ కూటమిలోనే ఉన్నా… పాత పగలే డామినేట్‌ చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. సామినేని ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అయితే కావచ్చుగానీ… ఆయన్ని మాత్రం జగ్గయ్యపేటలో జోక్యం చేసుకోనివ్వబోమన్నట్టుగా ఉందట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వైఖరి. అలాగే అందరు ఎమ్మెల్యేలను నేతలను ఉదయభాను కలుస్తున్నా… తమ నాయకుడిని మాత్రం కలవలేదంటూ రివర్స్‌ అటాక్‌ చేస్తోంది తాతయ్య వర్గం. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం ఒకే ఒరలో రెండు కత్తుల సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఉదయభానుకు ఛాన్స్‌ ఇచ్చి ఆయన వర్గం నియోజకవర్గంలో బలపడితే తిరిగి తమకే ఇబ్బంది అన్నది ఎమ్మెల్యే అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే జనసేన జిల్లా అధ్యక్షుడికి టీడీపీ ఎమ్మెల్యే పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మారి తప్పు చేశానా అంటూ సామినేని ఫీలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version