మాజీ మంత్రి ఆర్కే రోజా కొత్త చిక్కుల్లో పడ్డారా…? అనవసరమైన విషయాల్లో అతిగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారా…? ఎక్స్‌ట్రా మైలేజ్ కోసం ఏదేదో చేసేసి సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అయి మొదటికే మోసం వస్తోందా? ఇంతకీ రోజా ఏం చేశారు? వైసీపీ నాయకులు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? రోజా అంటే ఫ్లవరనుకుంటివా….. ఫైరు… వైల్డ్ ఫైరు….. అన్నట్టుంటారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పొలిటికల్‌గా ఆమె లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ… దాదాపు అలాగే ఉంటాయి. కానీ… ఇప్పుడు అనవసరమైన వ్యవహారంలో వేలుపెట్టి ఫ్లవర్ కాస్తా ఫైర్‌లో పడ్డట్టయిందన్న సెటైర్స్ పేలుతున్నాయి సొంత నియోజకవర్గం నగరిలో. సినిమాల్లో డబుల్ యాక్షన్ బాగానే ఉంటుంది గానీ… పొలిటికల్ స్క్రీన్ మీద అలాంటివేం కుదరవమ్మా… వెటకారం చేస్తున్నారట నగరి జనం. ఇంతకీ మేటరేంటంటే…. ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల ఎపిసోడ్‌లో రోజా వేళ్లు, కాళ్ళు పెట్టేసి కాల్చుకున్నారన్నది లోకల్‌గా విస్తృతాభిప్రాయం. ఆ పని మైలేజ్ కోసం చేశారా…? మరో కారణంతోనా అన్న సంగతి పక్కనబెడితే… తమిళనాడు ఎపిసోడ్ బూమరాంగ్ అయిపోయి… డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకోవాల్సి వస్తోందట. ఈ పరిణామంతో నగరి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా… ముందుగా డీఎంకే తరపున ప్రచారం చేశారు.
తర్వాత తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం లాంటి పరిస్థితులే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. వారు ఇక్కడ స్థిరపడ్డా…. తమిళ రాజకీయాలు, అక్కడి వివిధ పార్టీలతో ఎమోషనల్‌గా అటాచ్ అయి ఉంటారు. అందుకు అనుగుణంగానే… వాళ్ళ మధ్య స్పష్టమైన రాజకీయ విభజన ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోజా తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఆమె వ్యవహారశైలి నియోజకవర్గంలోని సొంత నేతలకే నచ్చడం లేదటా. వేలాది మంది తమిళ ఓటర్లు, వాళ్ళలో స్పష్టమైన రాజకీయ విభజన ఉన్నప్పుడు… మనం సైలెంట్ అయితే ఏ గొడవా ఉండదుగానీ…. అనవసరంగా అటు ఇటు జంప్‌చేయడం, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటి వాటితో అతి చేశామన్న అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనివల్ల మొదటికే మోసం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు రోజా. చెన్నై హార్బర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించి మరోసారి డీఎంకేను గెలిపించాలని, స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని చెప్పారు. సరిగ్గా అప్పుడే నగరి నియోజకవర్గంలో ఉన్న విజయ్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. రోజాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి హోరెత్తించారు. సరే.. ఏదో.. జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటూ… అప్పటికి ఆ గొడవ సద్దుమణిగినా…ఆ తర్వాత మాజీ మంత్రి వ్యవహారశైలి మరింత వివాదానికి దారితీసింది.
తమిళనాట ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో….. వెంటనే రూట్ మార్చిన రోజా… సీఎం విజయ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్‌కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు.. ఆయన తన ట్వీట్‌కు స్పందించారంటూ చేస్తున్న హడావిడితో ఇప్పుడు డీఎంకే అభిమానులకు మండిపోతోందట. అప్పుడు జై స్టాలిన్ అన్నారు.. ఇప్పుడు జై విజయ్ అంటున్నారు.. అసలు మీ స్టాండ్ ఏంటి? అంటూ గతంలో డీఎంకే కోసం చేసిన ప్రచారాల వీడియోలను వైరల్ చేస్తూ… సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో… ఇటు డీఎంకేకు, అటు టీవీకేకు కాకుండా పోయామని, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వాళ్ళని ఓట్లు అడగాలంటూ ఫ్యాన్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నట్టు తెలిసింది.
అసలు మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని విషయంలో వేలు పెట్టి ఇలా ఇరుక్కోవడం ఎందుకంటూ కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. లేనిపోని మైలేజీ కోసం వెంపర్లాడడం వల్ల స్థానికంగా మన పార్టీ పట్టు జారే ప్రమాదం ముంచుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన వ్యతిరేక వర్గం ఉన్నప్పుడు…. ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల రాజకీయంగా మరింత నష్టపోయే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి రెండు నాలుకల ధోరణి వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామన్న చర్చలు సైతం నడుస్తున్నాయట నగరి వైసీపీలో. నియోజకవర్గంలోని పాత పగలు, గ్రూపు రాజకీయాలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటైంలో.. ఇప్పుడీ ఈ తమిళ పాలిటిక్స్ వ్యవహారం ఇంకా ఇబ్బందికరమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలంగా ఉంది.
