మేకప్‌కు ప్యాకప్ చెప్పి….ప్రజాసేవకే క్లాప్ కొడతానన్న ఆర్కే రోజా….మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. మొన్నటి వరకు బుల్లితెరకే రీఎంట్రీ ఇచ్చిన రోజా…ఇప్పుడు ఏకంగా వెండితెరపై మళ్లీ మెరుస్తున్నారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా సినిమా సీక్వెల్ దేనికి సంకేతం? ఇక పాలిటిక్స్ కన్నా మూవీలే బెటరని ఆమె అనుకుంటున్నారా? క్యాడర్‌లో కన్‌ప్యూజన్ క్రియేట్ చేస్తున్నారా? తెలుగు రాజకీయాల్లో ఆర్కో రోజా అంటే ఫైర్..ఫైర్ అంటే రోజా. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. రెండుసార్లు గెలిచి…మంత్రిగా పనిచేసిన రోజాను.. గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తరువాత కొంత సైలెంటయ్యారు. తనకున్న వాక్చాతుర్యమే తన బలమని ఇంతకాలం నమ్ముతూ వచ్చిన రోజా…చివరకు గత ఎన్నికల్లో అదే శాపంగా మారింది. గడిచిన ఐదేళ్లు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుని రాజకీయంగా నష్టపోయారు. అలా ప్రత్యర్థులపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటాలు…రోజాను ప్రజలకు దూరం చేశాయన్న చర్చకు కారణమయ్యాయి. నలభైవేల తేడాతో టిడిపి నేత భాను ప్రకాష్ చేతిలో ఓడిపోయారు. తరువాత పూర్తిస్దాయిలో చెన్నైకి మకాం మార్చారు.
చెన్నైకి మకాం మార్చినా…ఈ మధ్యకాలంలో యాక్టివ్ అవుతూ వచ్చారు. మధ్యలో నగరిలో ఇసుక దందా అంటూ రోజా హడావిడి చేశారు. అదే స్థాయిలో రోజాకు కౌంటర్ ఇచ్చారు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. మళ్ళీ కొద్దిరోజులు మౌనం దాల్చారు. పార్టీకి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా…ప్రత్యర్థులను అటాక్ చేసే విషయంలోనూ ఇంతకుముందులా ధాటిగా మాట్లాడ్డం లేదు. అయితే ఈమధ్య కాలంలోనే మళ్ళీ బుల్లితెరపై మనసు మళ్ళించారు రోజా. గత ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్‌ను మానేస్తున్నానని ప్రకటించిన రోజా…ఇక ఎప్పుడూ బుల్లితెరపై కనిపించని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల్లో ఆమెకు ఫలితాలు రివర్స్ కావడంతో బుల్లితెరపై మళ్లీ తళుక్కుమన్నారు. ఈసారి వెండితెర వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. దీంతో ఆమె రాజకీయ ప్రస్థానంపైనే ప్రశ్నలు ఇంటర్వెల్ బ్యాంగ్‌లా ట్విస్టు క్రియేట్ చేస్తున్నాయి.
రోజా టీవీ షోల్లో రీఎంట్రీ ఇచ్చినా వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. గతంలో కూడా ఇలానే సినిమాలు, షోలు వద్దు…ప్రజాసేవ ముద్దు అంటూ బుల్లితెరకు దూరమై మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా పరిణామాలను గమనిస్తే మాత్రం ఆమె పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నారా అని అభిమానులకు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే రోజా సినిమాలు మానేసి పుష్కరకాలం గడుస్తోంది. మొన్నటి వరకు బుల్లితెరకు మాత్రమే పరిమితమవుతారు అనుకున్న రోజా సడన్‌గా 12 ఏళ్ల తర్వాత వెండితెరపై కనిపించడానికి మేకప్ వేసుకోవడం నగరిలో చర్చగా మారింది. 12 సంవత్సరాల తర్వాత ఆమె తెలుగు సినిమాలలో కాకుండా తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తమిళంలో బాలచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లెనిన్ పాండియన్” సినిమాలో “సంతానం అనే పాత్రలో రోజా నటించారు. ఇప్పుడు ఇదే….రోజా అనుచరులను, వైసిపి నేతల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉండటం, మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇవ్వడం…ఇప్పుడు ఏకంగా సినిమాల్లోనే నటించడం పలు సందేహాలకు దారి తీస్తోంది. మెల్లమెల్లగా రోజా సినీ ఇండస్ట్రీ వైపే ఆమె మనస్సు మల్లుతోందా అనే ప్రశ్నలు ఆమె ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. అయితే దానికి కారణాలు లేకపోలేదని కొద్దిమంది స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు.
జిల్లా వైసీపీ నేతలతో రోజాకు పొసగడం లేదు. సొంత నియోజకవర్గం నగరిలో పెద్దిరెడ్డి నుంచి మిగిలిన సీనియర్ నేతల వరకు ఎవ్వరితోనూ రోజాకు పడటం లేదు. ఐదేళ్లుగా ఇదే తంతు. ఆమెకు వ్యతిరేకంగా పలు గ్రూపులు ఇప్పటికీ రచ్చ చేస్తూనే వున్నాయి. వీటికి తోడు ఆడుదామా ఆంధ్ర కార్యక్రమంలో జరిగిన అవినీతిపైన సిఐడి ఓవైపు విచారణ చేస్తోంది. ఇలా ఒకదాని వెంట మరో సమస్య రోజాను సినిమాల వైపు మనసు మళ్లించేలా చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని…ఆమె ఇటు రాజకీయాలను అటు సినిమాలను ఏకకాలంలో చేస్తారని చెబుతున్నారు. ఇలా రెండు పడవల మీద రోజా ప్రయాణం చేస్తే ప్రత్యర్దుల నుంచి విమర్శలను సైతం అదే స్థాయిలో ఎదుర్కోవాల్సి ఉంటుందని నగరి వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై రోజా అనేక విమర్శలు చేశారు. ఇప్పుడేం సమాధానాలు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా నగరి నియోజకవర్గంలో ఒకసారి గెలిచినవారు వరుసగా గెలవడం ఆనవాయితీ అనే సెంటిమెంటు బలంగా ఉంది. గతంలో చెంగారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు వరుసగా ఐదారుసార్లు గెలుపొందారు. అలానే రోజా సైతం స్వల్ప ఓట్లతోనే రెండుసార్లు గెలిపొందారు. దీంతో తాజాగా ఎన్నికల్లో గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ సైతం వరుసగా గెలిచే అవకాశాలు ఉన్నాయని…ఈ ఆలోచనతో సైతం ఆమె దూర దృష్టితో ఆలోచించే ముందుగా సినీ పరిశ్రమ వైపు దృష్టిసారించారా అనే మాటలు వినపడుతున్నాయి. ఇలా సినిమాల్లో రీఎంట్రీపై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అయితే, రోజా వర్గం మాత్రం ఇవ్వన్నీ ఒట్టిమాటలేనని ఒకొట్టిపారేస్తోంది. నగరి ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని…ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే భారీ మెజారిటీతో గెలుస్తానంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. చూడాలి ఓ వైపు సినిమాలో నటిస్తూనే… మరోవైపు రాజకీయాలు చేస్తూ…రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న రోజాకు కాలం ఎలా కలిసి వస్తుందో..
