బొక్కింది కొండంత…. కక్కింది గోరంత అన్నట్టుగా తెలంగాణ రైస్ మిల్లర్స్ వ్యవహారం ఉందా? కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు అసలు పూర్తిగా వసూలయ్యే అవకాశం ఉందా? వేల కోట్లలో ఉన్న మొత్తాన్ని వసూలు చేయడానికి ప్రభుత్వ అధికారుల దగ్గర నిర్దిష్ట ప్రణాళికేం లేదా? ఆఫీసర్స్ కూడా అయిన వాళ్ళకు ఆకుల్లో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు రైస్ మిల్లు రాజకీయం ఏంటి? పెండింగ్ ఉన్న 5వేల 450 కోట్లు ఎప్పుడు వసూలవుతాయి? తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిల వ్యవహారం హాట్ హాట్‌గా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల నుంచి పౌరసరఫరాల శాఖకు రావాల్సిన బకాయిలు 6వేల 650 కోట్లకుపైగా ఉన్నట్టు తెలుస్తోంది. వాటి రికవరీ కోసం సివిల్ సప్లయిస్ శాఖ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 1,200 కోట్లు మాత్రమే వసూలు అయినట్టు సమాచారం. ఈ లెక్కన వసూలైనదానికంటే… చేయాల్సిందే ఎక్కువ కనిపిస్తోంది.
దీంతో… అసలు పూర్తిగా వసూలు చేయడమన్నది జరిగే పనేనా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా రంగంలోకి దిగి పలు మిల్లుల్లో తనిఖీలు చేసింది. నోటీసులు, విచారణలకు సరైన రెస్పాన్స్ ఇవ్వని మిల్లులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు ఒకవైపు జరుగుతున్నా…. అటు ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు మాత్రం పూర్తిస్థాయిలో సర్కార్ ఖాతాలోకి రావడం లేదని చెప్పుకుంటున్నారు.
కోట్ల రూపాయలు చెల్లించాల్సిన కొందరు మిల్లర్లు ఆ మొత్తాలను ఎగ్గొట్టి… కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాణంతో పాటు ఇతర రంగాల్లో కూడా కొందరు బడా రైస్ మిల్లుల యజమానులు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో.. బకాయిదారుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, పెట్టుబడులపై సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయన్న అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు మిల్లర్ల నుంచి బకాయిలను కఠినంగా రికవరీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన వేగం కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఒకరి విషయంలో నోటీసులు, మరొకరిపై కేసులు, ఇంకొందరితో చర్చలు… ఇలా, మిల్లర్ స్థాయిని బట్టి అధికారులు ఒక్కొక్కరితో ఒక్కోలా వ్యవహరిస్తున్నారు తప్ప… గట్టిగా వసూలు చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదన్న మాటలు సైతం వివిధ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అటు రైస్ మిల్లర్ల సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మిల్లర్లను వేధించొద్దని, కేసులు నమోదు చేయొద్దని, విజిలెన్స్ దాడులు నిలిపివేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ ఒప్పందాలు ఇరుపక్షాలకు న్యాయం జరిగేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో… ఓ వైపు మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలు వేల కోట్లలో ఉంటే …. మరోవైపు రికవరీ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితం ఇవ్వడం లేదన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికీ పెండింగ్‌లో ఉండిపోయిన 5వేల450 కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం ఎలా రికవరీ చేస్తుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ప్రజాధనానికి సంబంధించిన ఈ వ్యవహారంలో బకాయిదారుల వారీగా పూర్తి లెక్కలు బయటపెట్టి, రికవరీకి స్పష్టమైన కార్యాచరణ అమలు చేస్తేనే వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని మిగతా రైస్ మిల్లర్లు అంటున్నారు. పెద్దోళ్ళకో న్యాయం, సాధారణ మిల్లర్స్‌కి మరో న్యాయం అన్నట్టు కాకుండా… బకాయిని బకాయిగానే భావించి వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు సొమ్ము సమకూరుతుందన్నది సగటు తెలంగాణ రైస్ మిల్లర్ అభిప్రాయం.

