Site icon NTV Telugu

Off The Record : రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నారా?

Tdp

Tdp

తెలుగుదేశం పార్టీలో ఆ సీనియర్‌ లీడర్‌కి చెక్‌ పడ్డట్టేనా? ఆయన వ్యవహారశైలే మైనస్‌ అవుతోందా? పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగా ఫీలవుతోందా? ఒకప్పుడు పొలిట్‌బ్యూరో ఉన్న నేతకు ఇప్పుడు సాధారణ పదవి ఇవ్వడమే సంకేతమా? ఎవరా నాయకుడు? ఏంటా కథ? డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్… రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారం పార్టీకే తలనొప్పిగా మారుతోందట. ఆయన తీరుతో అధిష్టానం కూడా విసిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడం, మాటలతో సరిపెట్టకుండా లేఖలు రాయడం లాంటి చర్యలు నాయకత్వానికి తలపోటు అవుతున్నాయంటున్నారు. ఒక రకంగా ఇదిప్రతిపక్షం చేతికి అస్త్రం ఇచ్చినట్టేనన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి టీడీపీ నేతల్లో. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పార్టీలో రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతను తగ్గించినట్టు చెప్పుకుంటున్నారు.

ఒకప్పుడు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యునిగా ఉన్న సుబ్రహ్మణ్యంను ఇటీవల వేసిన కమిటీల్లో సాధారణ జాతీయ కార్యదర్శి పదవికి పరిమితం చేయడమే ఇందుకు నిదర్శనం అన్నది ఒక విశ్లేషణ. గత ఎన్నికల్లో రామచంద్రపురం టీడీపీ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తన కుటుంబ సభ్యురాలికైనా ఇవ్వమని కోరుతూచేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక ఎన్నికల తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం రాజకీయంగా బలహీనపడుతూ వచ్చారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. రామచంద్రపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఆయన ప్రభావం తగ్గిపోతోందని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు చేస్తూ…. టీడీపీ అధిష్టానానికి లేఖలు రాశారు మాజీ ఎమ్మెల్సీ. కోనసీమ ప్రాంతంలోని పలువురు ప్రజాప్రతినిధులపై కూడా ఆరోపణలు చేశారాయన. అయితే… పార్టీ పరంగా జరిపిన విచారణలో ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తేలింది. కోనసీమలో ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణల్ని పూర్తిగా పూర్తిగా కొట్టిపారేయలేకున్నా….. రెడ్డి సుబ్రహ్మణ్యం చేసినవి మాత్రం రాజకీయ ప్రేరేపితమేనన్న భావన పార్టీ అధిష్టానంలో బలంగా ఉందట. రెడ్డి సుబ్రహ్మణ్యం తాను ప్రాభవం కోల్పోయిన ప్రాంతాల నాయకులనే లక్ష్యంగా చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.

అయితే.. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… ఆయన ఆరోపణలతో స్థానిక టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య ఐక్యత పెరిగిందట. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి వారు ఇప్పుడు సమష్టిగా ఆయన్ని ఢీ కొట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వాళ్ళంతా త్వరలో సమావేశం నిర్వహించి రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహారంపై చర్చించాలనుకుంటున్నట్టు తెలిసింది. అటు ఆ లేఖ వెనక జనసేనకు చెందిన వేగుళ్ల లీలాకృష్ణ వ్యూహం ఉందన్న వాదన సైతం వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని వాడుకుంటున్నట్టు కోనసీమ టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ మాజీ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీ అధిష్టానం తీసుకుంటున్న చర్యలతో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రాజకీయ భవిష్యత్‌ డేంజర్‌లో పడ్డట్టేనని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన నెక్స్ట్‌ స్టెప్‌ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయవర్గాలు.

Exit mobile version