ఆ నియోజకవర్గంలో…కూటమి, వైసీపీ నేతలు కలగలిసి యుగళ గీతం పాడుతున్నారా? ప్రజలంతా ఒకవైపు, అన్ని పార్టీల నాయకులు మాత్రం మరో వైపు అన్నట్టుగా ఉందా? ఏ విషయంలో జనాన్ని కాదని పార్టీలకు అతీతంగా నాయకులు పిల్లి మొగ్గలేస్తున్నారు? ఎక్కడ ఉందా పరిస్థితి? కర్రుగాల్చి వాత పెట్టడానికి అక్కడి జనం కూడా ఎదురు చూస్తున్నారన్నది నిజమేనా? జిల్లాల పునర్విభజనలో భాగంగా… ఉమ్మడి తూర్పు గోదావరిని మూడుగా విభజించింది గత వైసీపీ ప్రభుత్వం. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా జరిగిన ఆ విభజనతో…అప్పటిదాకా ఉమ్మడి తూర్పులో ఉన్న రంపచోడవరం అల్లూరి జిల్లాలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో కొత్త వివాదాలు కూడా పుట్టుకొచ్చాయి. దాంతో… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగిన మార్పులను రివ్యూ చేయాలని నిర్ణయించి అందుకోసం మంత్రుల కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది సర్కార్. ఆ క్రమంలోనే… రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం వివాదం మాత్రం ఎటూ తేలకుండా ఉందట. ఇక్కడ ప్రజలు ఒకటి కోరుకుంటుంటే….నాయకులు మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఆ విషయంలో కూటమి, వైసీపీ అన్న తేడా లేకుండా… నాయకులంతా ఒక్కటై బృందగానం ఆలపిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేశారు అప్పుడు. అయితే… అదే నియోజకవర్గంలోని రామచంద్రపురం అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం కాకినాడకు దగ్గరగా ఉంటుంది.
అందుకే… తమను కోనసీమ జిల్లా నుంచి విడదీసి కాకినాడ జిల్లాలో కలపాలని జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నారు స్థానికులు. బంద్‌లతో నిరసనలు తెలుపుతూ తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని కోరుతున్నారు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రాపురం, కే. గంగవరం మండలాలు కోనసీమ జిల్లాలో ఉంటే కాజులూరు మండలం మాత్రం ఆల్రెడీ కాకినాడ జిల్లాలోనే ఉంది. మమ్మల్ని దగ్గరగా ఉన్న కాకినాడ జిల్లాలో కలపండి మొర్రో… అని ప్రజలంతా ఏక స్వరంతో మొత్తుకుంటున్నా… ఏ పార్టీ నాయకుడూ కిక్కురుమనడం లేదు. మామూలుగా ప్రతి విషయంలోనూ… విభేదించుకుని, మంచి చెడులతో సంబంధం లేకుండా తిట్టుకునే అధికార, ప్రతిపక్ష నాయకులంతా ఈ విషయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారట. రామచంద్రపురం నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన పిల్లి సుభాష్‌చంద్రబోస్, తోట త్రిమూర్తులు, చెల్లుబోయిన వేణుగోపాల్, సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రి సుభాష్ సైతం ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండటంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రామచంద్రపురం జనం. మీకు మీ రాజకీయ అవసరాలు తప్ప… జనం సమస్యలు పట్టవా అంటూ నిలదీస్తున్నారు. బోస్ ప్రస్తుతం ఎంపీగా, ఆయన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అటు మాజీ మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్స్‌తో వాళ్లు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ ముగ్గురూ రామచంద్రపురంలోనే ఉంటున్నారు. ఈసారి పరిస్థితులు ఎలా మారుతాయో,ఎవరు ఎక్కడ పోటీ చేస్తారోననుకుంటూ…ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపడానికి మాత్రం వైసీపీ నాయకులు ఎవరూ ఇష్టపడటం లేదట.
కాకినాడ జిల్లాలోకి వెళ్తే… పార్టీలో కూడా ఆ జిల్లా సీనియర్ నేతల హవా నడుస్తుందని, తాము నామ మాత్రంగా మిగిలిపోతామన్నది వాళ్ల భయంగా తెలుస్తోంది. అందుకే ఆ ప్రస్తావన తీసుకు రాకపోవడంతోపాటు మీరు కూడా మాట్లాడవద్దని సన్నిహితులకు చెబుతున్నట్టు సమాచారం. ప్రతిపక్షం సంగతి సరే…ఇటు మంత్రి సుభాష్ దగ్గరకు జే ఏ సి నేతలు వెళ్తే… ఆయన కూడా పొడిపొడిగా సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి, అందులో మనం చేసేది ఏముంటుందని అంటున్నారట. ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా అంటే మాత్రం నో ఆన్సర్. మంత్రి స్థాయిలో కాస్త చొరవ చూపి గట్టిగా పట్టుబడితే… పనైపోతుందని, కానీ… ఆయన కూడా పొలిటికల్ లెక్కలేసుకుంటూ ఉదాసీనంగా ఉంటున్నారన్నది లోకల్ టాక్. సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం. అది ఎస్సీ రిజర్వుడు కావడంతో గత ఎన్నికల్లో ఆయన రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మళ్లీ పరిణామాలు మారి వేరే జిల్లాలోకి వెళ్తే అక్కడ నా పరపతి ఏం ఉంటుందన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. ఆ విధంగా… తమ రాజకీయ అవసరాల కోణంలో రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో కలపడానికి ఇటు కూటమి, అటు వైసీపీ నాయకులు ఎవరూ సుముఖంగా లేరు. దీంతో రగిలిపోతున్న నియోజకవర్గ జనం మాత్రం మీ సంగతి… అలా ఉందా? అయితే వెయిట్ చేయండి రేపు స్థానిక సంస్థల ఎన్నికల రాకపోతాయా? మళ్ళీ మా దగ్గరికి రాకుండా ఉంటారా అని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
