Site icon NTV Telugu

Off The Record : కూతురు వల్లే మాజీ మంత్రికి షాక్..? కోనసీమలో కొత్త రాజకీయ ట్విస్ట్..!

Rajolu

Rajolu

సన్‌ స్ట్రోక్‌ లాగా…. ఆ మాజీ మంత్రికి డాటర్ డ్యామేడ్‌ జరుగుతోందా? ఆయన రాజకీయ వ్యవహారాలకు ఇప్పుడు కన్న కూతురే అడ్డంకిగా మారారా? కూతురుతో మీకు కష్టం సార్‌ అంటూ… వైసీపీ అధిష్టానం ఆయన్ని సైలెంట్‌గా సైడ్‌ చేసేసిందా? ఎలాంటి విభేదాలు లేవు. తండ్రి కూతుళ్ళ మధ్య మంచి అవగాహన ఉన్నా ఎక్కడ తేడా కొట్టింది? ఆ ఎక్స్‌ మినిస్టర్‌ ఇన్ఛార్జ్‌ పదవి ఎందుకు ఊడింది? అసలు ఎవరాయన? అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీలో ఇటీవల కీలక పరిణామం జరిగింది. రాజోలు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవిని నియమించింది అధిష్టానం. పార్టీ సీనియర్‌ లీడర్‌, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును తప్పించి మరీ…. రాజేశ్వరిదేవిని నియమించడం ఇప్పుడు కోనసీమ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌ అయింది. గతంలో కాంగ్రెస్‌ తరపున పి. గన్నవరం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే అయిన రాజేశ్వరి, ఆ తర్వాత జనసేనలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాత ఫ్యాన్‌ కిందకు చేరిన మాజీ ఎమ్మెల్యేని ఇప్పుడు రాజోలు ఇన్ఛార్జ్‌గా నియమించడానికి బ్యాక్‌గ్రౌండ్‌ గట్టిగానే ఉందని అంటున్నారు స్థానికంగా. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను మారుస్తున్న క్రమంలోనే రాజోలు కూడా ఛేంజ్‌ అయినట్టు పైకి చెబుతున్నా…. అసలు కథ మాత్రం వేరే ఉందట. ప్రస్తుతం గొల్లపల్లి సూర్యారావును రాజోలు బాధ్యతల నుంచి తప్పించి పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ.. దానికేమంత ప్రాధాన్యం ఉండదని, పక్కన పెట్టాలనుకున్న వాళ్లందర్నీ పీఏసీలో చేర్చి ఓమూలకు నెట్టేస్తుంటారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సూర్యారావును పీఏసీలోకి పంపడానికి కారణం ఆయన కూతురేనన్నది అంతర్గతంగా వినిపిస్తున్న మాట. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక…. సూర్యారావు కుమార్తె అమూల్యను రాజోలు ఇన్ఛార్జ్‌గా నియమించింది తెలుగుదేశం పార్టీ. ఈ పోస్ట్‌ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డా… టీడీపీ పెద్దలు అమూల్యవైపే మొగ్గు చూపారు. ఈ పరిణామంతో రాజోలులో తండ్రీ, కూతుళ్ళ మధ్య పొలిటికల్ వార్‌కు రంగం సిద్ధమైందని అనుకున్నారు చాలామంది. అయితే…. అనూహ్యంగా వైసీపీ అధిష్టానం గొల్లపల్లిని తప్పించి ఆ స్థానంలో పాముల రాజేశ్వరిని నియమించింది. తండ్రీ కూతుళ్ళు ఒకే నియోజకవర్గంలో చెరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఈక్వేషన్స్‌ సెట్‌ కావని భావించారట వైసీపీ పెద్దలు. రేపటి రోజున ఢీ అంటే ఢీ అనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూతురి కోసం సూర్యారావు వెనక్కి తగ్గితే పార్టీ నష్టపోతుందన్న లెక్కలున్నట్టు తెలిసింది. అందుకే ఆయన్ని తప్పించి మరో మహిళకే పదవి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కానీ… ఆయన అనుచరుల వెర్షన్‌ మాత్రం వేరేలా ఉంది. క్షేత్రస్థాయిలో పట్టున్న, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసిన నేతను కాదని కొత్తగా చేరిన వాళ్ళకు బాధ్యతలు ఇవ్వడం కరెక్ట్‌ కాదన్నది వాళ్ళ వాదన. ఇక పాముల రాజేశ్వరి నియామకంపై పార్టీలో కూడా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మహిళకు అవకాశం ఇచ్చామని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, గొల్లపల్లి లాంటి విధేయుడిని కూమార్తె పేరుతో పక్కన పెట్టడం సమంజసం కాదని అంటున్నారు వైసీపీలోని కొందరు. దాదాపు 40ఏళ్ళ నుంచి కోనసీమ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు గొల్లపల్లి. మంత్రిగా కూడా పనిచేశారు.

కాంగ్రెస్‌లో మొదలై టీడీపీ మీదుగా వైసీపీకి చేరారాయన. అయితే…. తన సోదరుడి కుమార్తె అయిన అమూల్యను దత్తత తీసుకోవడంతో ఈమె వారసురాలయ్యారు. ఈ కారణంగానే సూర్యారావును ఇన్ఛార్జ్‌ పదవి నుంచి తప్పించారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గం జనసేనకు కంచుకోటగా మారింది. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే.. 2029 నాటికి ఈ నియోజకవర్గ రిజర్వేషన్ మారిపోయి.. ఎస్సీ నుంచి ఓసీ అవుతుందన్న అంచనాలున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఇక్కడ వైసీపీ స్పెషల్‌గా ఫోకస్‌ చేస్తోందట. పాముల రాజేశ్వరిదేవిని తెర మీదికి తీసుకురావడం వెనక ఇలాంటి లెక్కలు కూడా ఉన్నాయంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ఇన్ఛార్జ్‌ పదవి నుంచి తప్పించడం మాత్రం గొల్లపల్లి సూర్యారావుకు బిగ్‌ షాక్‌ అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఈ షాక్‌ నుంచి కోలుకుని త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం కూడా మొదలైపోయింది. పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.

Exit mobile version