మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనమేనా? తన చర్యలతో ఆమె ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నారా? అదే నిజమైతే ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుందా? లేక ఆడా ఉంటా… ఈడా ఉంటా అన్నట్టు కుటుంబ సభ్యులంతా తలో పార్టీలో ఉంటారా? చామకూర ఫ్యామిలీ పొలిటికల్ రిథమ్ ఏంటి? మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ సాంగ్స్‌కు ఎలా హుషారుగా స్టెప్స్ వేస్తారో…. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్ కూడా అంతకంటే ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆయన పార్టీ మారతారని, కారు డోర్ తీసి రెడీగా ఉన్నారు, ఇక పక్క పార్టీ ఆఫీస్‌లో కాలు పెట్టడమే తరువాయి అంటూ చాన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. అయితే… ఆ అడుగు బీజేపీలోకా కాంగ్రెస్ వైపా అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి ఎవరికి వారు నచ్చినట్టు విశ్లేషించేసుకుంటున్నారు. కానీ… మల్లన్న మాత్రం నేను కారు దిగను, బీఆర్‌ఎస్‌ని వదలనంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయినా అనుమానపు చూపులు మాత్రం తగ్గడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి వ్యవహారశైలి గురించి రాజకీయ వర్గాలు ఇంకా ఆసక్తిరంగా మాట్లాడుకుంటున్నాయి. ఆమె యాక్టివిటీస్ మామ ఇస్తున్న క్లారిటీకి భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. తాజాగా ప్రీతిరెడ్డి బీజేపీ, rss కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడ చాలా యాక్టివ్ రోల్ పోషించడంతో పొలిటికల్ డౌట్స్ పెరిగిపోతున్నాయి. దాదాపుగా ఆమె కమలదళంలో చేరిపోయినట్టేనా అని కూడా ఆరా తీస్తున్నారు చాలా మంది.
గతంలో కూడా ఒకసారి ఏకంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికే వెళ్ళాకు ప్రీతి. అక్కడ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. అయితే… ప్రధాని మోడీ కార్యక్రమం గురించి మాట్లాడేందుకే వచ్చానని అప్పట్లో కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా తన మొగ్గు బీజేపీ వైపే అనేలా ఆమె యాక్టివిటీస్ కనిపించాయి. ఇక తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్న కార్యక్రమంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అటెండ్ అయిన మరో ప్రోగ్రామ్‌కు కూడా హాజరయ్యారు. బీజేపీ మెడికల్ సెల్ నిర్వహించిన ధన్వంతరి ఎక్సెలెన్సీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని బాగా సందడి చేశారు ప్రీతిరెడ్డి. స్టేజ్ మీద సన్మానం స్వీకరించారు. అలాగే… విశ్వ మాంగళ్య సభ నిర్వహించిన యుగానుకూల మాతృత్వం కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యారామె. ఈ కార్యక్రమంలోనే… rss చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎక్కువ హడావిడి చేశారు ప్రీతి. అక్కడికి వచ్చిన మహిళలతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. కార్యక్రమం ప్రారంభానికన్నా ముందు వచ్చి పూర్తిగా అయిపోయేవరకు అక్కడే ఉన్నారు. ప్రీతి రెడ్డి దాదాపు 3 గంటల పాటు అక్కడే గడపడం ఆసక్తికరంగా మారింది.
ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ కోడలు క్షమితా రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ప్రీతి, క్షమిత ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ఎక్కువ సేపు మాట్లాడుకోవడం, యాక్టివ్‌గా ఉండటం లాంటి వాటిని గమనిస్తున్న రాజకీయవర్గాలు… ఇక ప్రీతి కాషాయ కండువా కప్పుకోవడం లాంఛనమే అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నాయి. బీజేపీ డిల్లీ పెద్దలతో కూడా టచ్ లో ఉన్నారట మల్లారెడ్డి కోడలు. దీంతో త్వరలోనే పిక్చర్ క్లియర్ అయ్యే అవకాశం ఉందన్న చర్చలు నడుస్తున్నాయి.
