ఎప్పుడూ లేనిది… ఆ పెద్దాయన నోటి నుంచి చెప్పుతో కొట్టండి, చర్యలు తీసుకోండన్న మాటలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా, పెద్దరికానికి కేరాఫ్ అన్నట్టుగా ఉండే ఆ లీడర్ ఇప్పుడెందుకు బ్యాలన్స్ తప్పారు? ఆయన తీవ్రమైన వత్తిడిలో ఉన్నారా? వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సెంటింమెంట్ అస్త్రాల్ని బయటికి తీశారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్టోరీ? తెలంగాణ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన పోచారం.. గత ఎన్నికల్లో కూడా కారు గుర్తు మీదే బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ… తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి….ప్రస్తుతం వ్యవసాయ శాఖ సలహాదారుగా నామినేటెడ్ పోస్ట్‌లో కొనసాగుతున్నారాయన. అయితే…పార్టీ మారి తప్పు చేశారంటూ లోకల్ గులాబీ వర్గాల్లో చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోంది. నియోజకవర్గ ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం ఉందన్నది ఓ వెర్షన్. అదే సమయంలో నిన్నటి వరకు పోరాటం చేసిన పోచారంతో.. ఇప్పుడెలా కలిసి పనిచేయాలంటూ… కాంగ్రెస్‌లోని ఓ వర్గం అంటీ ముట్టనట్టుగా ఉంటోందట. ఇలా రెండు పార్టీల్లోని కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యేకి దూరం పెరిగడమే అసలైన విషాదం అంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష్మీపుత్రునిగా పిలుస్తూ.. చాలా గౌరవం ఇచ్చేవారట.
కానీ… పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడకుండా మారిపోవడాన్ని జీర్ణించుకోలేక…ఈయన విషయంలో పర్సనల్‌గా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే పోచారం టార్గెట్‌గా బీఆర్‌ఎస్ పావులు కదుపుతోందట. బాన్సువాడలో పార్టీని బలోపేతం చేసే దిశగా.. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డిని రంగంలోకి దింపారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై సీరియస్‌గా న్యాయ పోరాటం జరుగుతున్న క్రమంలో…బాన్సువాడ ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయమన్న ప్రచారానికి బాగా పదును పెట్టాయి గులాబీ శ్రేణులు. దీంతో పోచారం అనుచరగణంలో గందరగోళ పరిస్థితి పెరుగుతోందట. ఈ పరిస్థితిని తట్టుకోలేకే తాజాగా ఎమ్మెల్యే బరస్ట్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ…. నా నిర్ణయం తప్పయితే.. చెప్పుతో కొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారాయన. అభివృద్ది కోసమే సీఎంను కలిశానని, తాను తీసుకున్న నిర్ణయం తప్పయితే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తానని ప్రకటించారు. బీఆర్ఎస్ గుర్తుతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెబుతూ… స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా కుండ బద్దలు కొట్టారాయన. అయితే… ఆయన చెప్పడం వరకు బాగానే ఉన్నా…ఇప్పుడీ ఈ వాఖ్యలు ఎందుకు చేశారంటూ అటు గులాబీ, అటు కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే.. సీనియర్ ప్రజాప్రతినిధి శ్రీనివాసరెడ్డి. ఆచితూచి మాట్లాడతారని పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. ఎన్ని విమర్శలు వచ్చినా… పార్టీ మారినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫిరాయింపు పై నోరు విప్పలేదు. కానీ… ఇప్పుడు బాన్సువాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ…తప్పయితే చెప్పుతో కొట్టమనడం, నియోజకవర్గ అభివృద్ది- ప్రజల సంక్షేమం కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని వివరణ ఇవ్వడానికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ వేరే ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి పొలిటికల్ పరిశీలకులకు. ఈ క్లారిఫికేషన్ ద్వారా…తాను టెక్నికల్‌గా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ప్రజల్లో సెంటిమెంట్ రగిలిచ్చే ప్రయత్నమని కొందరు అంటుంటే… పెద్దాయనేం చిన్న చిన్న వాటికి ఇలా స్పందించే టైపు కాదు, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునే ఈ ప్రకటన చేశారన్నది ఇంకొందరి అభిప్రాయం.క్యాడర్‌లో గందరగోళానికి తెరదించి కాపాడుకునే ప్రయత్నం కూడా అయి ఉండవచ్చంటున్నారు.పార్టీ మారడంతో తనపై వచ్చిన వ్యతిరేకతను కొంత మేరకైనా తగ్గించుకునేందుకే… చెప్పుతో కొట్టండి, రాజీనామాకు సిద్దం అనే ప్రకటనలు చేసి ఉండవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. పోచారం ప్రకటనపై అటు బీఆర్ఎస్ ఘూటుగా రిప్లై ఇచ్చేందుకు రెడీ అవుతోందట. పెద్దాయన వివరణ ఎంత వరకు పాజిటివిటీ తెస్తుందో చూడాలంటున్నారు పరిశీలకులు.
