Site icon NTV Telugu

Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు

Pithapuram

Pithapuram

సమస్య కొత్తది కాదు, పరిష్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. అయినాసరే…. అన్నీ తెలిసి కూడా ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకంత రచ్చ చేస్తున్నారు? మాటి మాటికీ బరస్ట్ అయిపోతున్నారు? ఛాన్స్‌ దొరికినప్పుడు కాకుండా… దొరకబుచ్చుకుని మరీ… గిల్లికజ్జాలు పెట్టుకోవడం వెనకున్న అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనది ఉనికి కోసం ఆరాటమా? రాజకీయ పోరాటమా? ఎవరా నాయకుడు? ఆయన గురించి కూటమిలోని మరో మిత్రపక్షం ఏమంటోంది? పిఠాపురంలో పొలిటికల్‌ టెంపరేచర్‌ అంతకంతకూ పెరిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఆయనకు సంబంధంలేని చాలా వ్యవహారాలు ఇక్కడ కూటమిలో జరిగిపోతున్నాయి. స్థానిక తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మకు, జనసైనికులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కలిసి పని చేయడానికి రెండు వర్గాలు అస్సలు ఇష్టపడటం లేదు.15 ఏళ్ళు నో బ్రేక్‌ అని పై స్థాయిలో చెబుతున్నా… ఇక్కడ మాత్రం 15 నిమిషాలు కూడా కలిసి ఉండలేమన్నట్టుగా ఉంది వ్యవహారం. అసలు ముఖముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదట రెండు పార్టీల నేతలు. నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో సీఎం ఫోటో పెట్టడం లేదని ప్రతిసారి రచ్చ జరుగుతోంది. అందుకు జనసేన నుంచి కూడా అంతే రియాక్షన్ వస్తోంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ఏ నియోజకవర్గంలో లేనంత ఎక్కువ రచ్చ ఇక్కడే ఎందుకు జరుగుతోందన్న చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తరచూ ఇలాంటి గొడవలు జరుగుతుండటంతో వైసీపీకి మంచి కంటెంట్ ఇచ్చినట్టు అవుతోంది. తాజా గొడవలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వర్మ లిటరల్‌గా పరస్పరం కొట్టుకుంటారేమోనన్నంత ఉద్రిక్తంగా మారింది. దీంతో… వర్మ ఎందుకంత హంగామా చేస్తున్నారు, హైప్‌ క్రియేట్‌ చేసుకుంటున్నారన్న డిస్కషన్‌ మొదలైంది.

గత ఎన్నికల్లో పొత్తు ధర్మం ప్రకారం పిఠాపురంలో వర్మ పని చేశారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే దొరబాబు వైసీపీలో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయన గ్లాస్ పార్టీలో చేరారు. ఇక్కడే అసలు తేడా వచ్చిందట. నియోజకవర్గంలో మళ్లీ దొరబాబు డామినేషన్ పెరిగిపోతోందని, ఎవరి మీదైతే పోరాటం చేశామో… వాళ్లే మళ్ళీ నెత్తినెక్కి కూర్చుంటున్నారన్నది వర్మ ఆవేదన. అలాంటి వ్యక్తితో తాను కలిసి పనిచేయలేనని, తన పార్టీ లైన్‌లో తాను వెళతానని అంటున్నారాయన. ఎక్కడ వరకు వెళ్లాలో అక్కడ దాకా వెళ్తామని, అసలు సినిమా ముందుందంటూ హింట్ ఇస్తున్నారట ఆయన. అయితే… అదే సమయంలో ఇటు జనసేన కూడా అంతే ఘాటుగా రియాక్ట్‌ అవుతోంది. కేవలం టిడిపి పెద్దల దగ్గర మైలేజ్ కోసమే వర్మ ప్రతిసారి హడావిడి చేస్తున్నారని, అంతకు మించి మరేం లేదన్నది గ్లాస్‌ వాయిస్‌. ప్రస్తుతానికి ఆయనకు ప్రయారిటీ ఇచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో మరో పవర్ పాయింట్ వస్తే మరింత ప్రోటోకాల్ రచ్చ జరిగే అవకాశం ఉంది. అసలు ఏమీ లేకుండానే ఈ స్థాయిలో వివాదాలు క్రియేట్ అవుతున్నాయి, రేపు వర్మకు కూడా ప్రోటోకాల్‌ పోస్ట్‌ వస్తే పరిస్థితి ఏంటన్నది తాజా క్వశ్చన్. ఇలాంటి రకరకాల అనుమానాలతోనే టీడీపీ కూడా ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది ప్రత్యర్థుల మాట. అనవసరపు ప్రచారం కోసం లేనిపోని గొడవలు సృష్టించొద్దని అంటున్నారు.

అసలు వర్మ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనేంటో తెలిసిపోతుందంటూ 2024 ఎన్నికల టైంలో జరిగిన సీన్స్‌ని గుర్తు చేస్తున్నారు జనసేన నాయకులు. అప్పుడు వర్మకు సీటు రాని సమయంలో పార్టీ జెండాలు తగలబెట్టి, చంద్రబాబు ఫోటోలు ధ్వంసం చేసి, అనుచరులతో ఆయన్ని బండ బూతులు తిట్టించిన సన్నివేశాల్ని మర్చిపోతే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు. వర్మ కావాలంటే ఉనికి కోసం పోరాటం చేసుకోవచ్చు… ఇబ్బంది లేదు, పార్టీని ఒప్పించి పదవి కూడా సంపాదించుకోవచ్చు… అభ్యంతరం లేదు, అంతేగాని… అనవసరపు కామెంట్స్ చేయవద్దని అంటున్నారు జనసైనికులు. టిడిపి ముఖ్య నేతలు ఉన్న నియోజకవర్గాలలో జనసేనకు ఇచ్చే ప్రయారిటీ ఏంటో చూడమంటూ గుర్తు చేస్తున్నారు. వర్మకు నిజంగానే పార్టీ అంటే అంత కమిట్మెంట్, చంద్రబాబు మీద ప్రేమ ఉంటే…. సీటు రానప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడాలి కదా? అప్పుడు ఏకంగా పార్టీ జెండాలు తగలబెట్టించి బూతులు తిట్టించడం ఏంటని అడుగుతున్నారు. మరోవైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే మాత్రం తమ కోటా ప్రయారిటీ తమకు ఇచ్చి తీరాలని అంటున్నారు. పార్టీ మాత్రం ఇది సున్నితమైన అంశం కాబట్టి ఈ వ్యవహారాలకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. వర్మ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు కూడా సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పిఠాపురం కూటమిలో రచ్చ మాత్రం తగ్గడం లేదు.

Exit mobile version