Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?

  • సెకండ్‌ ఛాప్టర్‌లోకి ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు?
  • అరెస్టయిన పోలీస్‌ అధికారుల నుంచే అంతా రాబట్టారా?
  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరినట్టేనా?
  • 12 మంది రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి రాబోతున్నాయా?
Brs

Brs

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? ఫైనల్‌ ఛార్జ్‌ షీట్‌లో బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు ఉండబోతున్నాయా? గులాబీ ముఖ్యులు సహా…. కనీసం 12 మందిని కోర్ట్‌ బోనులో నిలబెట్టడానికి సిట్‌ సిద్ధమవుతోందా? ఆ దిశగా వినిపిస్తున్న పేర్లేవి? దాని గురించి జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సెకండ్ చాప్టర్‌లోకి ఎంటరైందట. హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మొదలైన ఈ కేసు దర్యాప్తు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు రేపుతోంది. సీపీ సజ్జనార్ సారథ్యంలోని సిట్ బృందం.. ఇంచు కూడా వదలకుండా విచారణ జరిపి ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వంటి అధికారుల నోటి నుంచే అసలు విషయాల్ని రాబట్టినట్టు పోలీస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

వోవరాల్‌గా చూసుకుంటే… కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు వచ్చిందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేవలం అధికారులకే పరిమితం అనుకున్న ఈ కేసులో.. ఇప్పుడు 12 మంది రాజకీయ ప్రముఖుల పేర్లు తెరపైకి రాబోతున్నాయన్న వార్తలు పొలిటికల్ సెన్సేషన్‌ అవుకున్నాయి. ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లో 12 మంది బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు చేర్చబోతున్నట్టు సమాచారం. ఆ 12 మందిలో రాష్ట్ర రాజకీయాలను శాసించిన పెద్దాయనతో పాటు ఆయన కుటుంబానికి సంబంధించిన ఇద్దరు, మరో 9మంది బీఆర్‌ఎస్‌ నేతలు ఉంటారని పోలీసు వర్గాల నుంచి లీక్‌లు వస్తున్నాయి.

జడ్జిలు, జర్నలిస్ట్‌లు, వ్యాపారవేత్తల వ్యక్తిగత సమాచారం చోరి అయిందన్న కోణంలో దర్యాప్తు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌….దానికి సంబంధించే మొత్తం 12 మంది రాజకీయ నేతల పేర్లను ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లో చేర్చబోతున్నట్టు తెలుస్తోంది. ఆ 12 మంది కోర్ట్‌ బోను ఎక్కడానికి సిద్ధం కావాలన్న ప్రచారంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో పొలిటికల్‌ ప్రకంపనలు పుడుతున్నాయి. మొత్తం1300 ఫోన్లను ట్యాపింగ్ చేశారని, ఇందులో అప్పటి ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నాయకులు, హైకోర్టు జడ్జిలు, బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారన్న విషయాన్ని ఛార్జ్‌షీట్‌లో పొందుపరుస్తున్నట్టు సమాచారం. ట్యాపింగ్‌తో పాటు బెదిరింపులతో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణల్ని కూడా దర్యాప్తు టీమ్‌ పరిగణనలోకి తీసుకుందట.

ఇందుకు సంబంధించిన టెక్నికల్ డేటాను చెరిపేసినా.. రికవరీ చేయగలిగిన పోలీసులు, ఆ సమాచారాన్ని సైతం ఛార్జ్‌షీట్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అది గనుక కోర్టుకు చేరితే…..కనీసం ఒక డజన్ మంది బీఆర్‌ఎస్‌ నేతలు కోర్టులకు క్యూ కట్టాల్సి వస్తుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గులాబీ అధిష్టానానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు పార్టీని కాపాడుకోవాలని చూస్తున్న టైంలో…. ఈ కేసు మెడకు చుట్టుకోవడం అధినాయకత్వానికి తలనొప్పి వ్యవహారమేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా…. ఫైనల్‌ ఛార్జ్‌షీట్‌లో ఉన్న పేర్లు చూశాక అసలు…. రాజకీయం ఎలా మారుతుందోనన్న ఆసక్తి సైతం పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. సిట్‌ ఆ 12 మంది నేతలపై పెట్టిన కేసు నిలుస్తుందో? లేదో చూడాలి మరి.