ఏవీ…. నాటి మాటల తూటాలు? ఏమైపోయింది ఆనాటి వాయిస్ బేస్? పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్…. విడమర్చి చెప్పి విడదీసి ప్రశ్నించి ప్రశ్నించే ఆ స్వరం ఇప్పుడు తొట్రు పడుతోందా? టీడీపీ నాయకుల్లో చాలామంది మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. మాట్లాడండి మంత్రిగారూ…. అంటూ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆ లీడర్ నోరు తెరవడం లేదా? ఆ స్పందనలు కూడా మునుపటిలా కాకుండా… తూతూ మంత్రంగా ఉంటున్నాయా? ఎవరా నేత? ఎందుకలా జరుగుతోంది? ప్రతిపక్షంలో ఉన్నపుడు నాటి అధికార వైసీపీ నాయకుల మీదికి ఒంటికాలిపై లేచేవారు పయ్యావుల కేశవ్. మాటల తూటాలు గట్టిగా పేలేవి. కానీ…ఇప్పుడాయన మాటల్లో ఆ ఫోర్స్ ఉండటం లేదని, వాడి తగ్గిపోయిందన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. సబ్జెక్ట్ ఏదైనాసరే…. మాట్లాడండంటూ పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఆయన రియాక్ట్ అవకపోవడానికి కారణాలేంటా అంటూ ఆరా తీస్తున్నారు టీడీపీ లీడర్స్ కొందరు. మొదట్నుంచి మాట్లాడకపోయిఉంటే ఒకలెక్క గానీ… అప్పుడలా, ఇప్పుడిలా ఎందుకంటూ చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా…. దీటైన జవాబు చెప్పగలిగిన నాయకుడు టచ్ మీ నాట్ అన్నట్టు ఎందుకు ఉంటున్నారో అర్ధంకావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం కేడర్‌లో. సీఎం చంద్రబాబు అంటే తనకు విపరీతమైన అభిమానమని, తాను చంద్రబాబు స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచి వచ్చిన స్టూడెంట్‌నని పదే పదే చెప్తుంటారు పయ్యావుల. టీడీపీకి ఉన్న హార్డ్ కోర్ లీడర్స్‌లో ఆయన కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సందర్భం ఏదైనాసరే… గతంలో పార్టీని ఓన్ చేసుకుంటూ ముందుకు వెళ్లేవారాయన. అందులోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని విమర్శించడంలో ముందుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న హార్డ్ కోర్ యాంటీ వైసీపీ నాయకుల్లో ఆయన ఒకరని కూడా చెప్పుకుంటారు. అలాంటి పయ్యావుల కేశవ్… ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్‌లో పడుతున్న సందర్భాల్లో సైతం నోరు తెరవకపోవడం కాస్త కొత్తగానే ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో.
అది అసెంబ్లీ అయినా, వేరే ఇతర ఏ సమావేశం అయినా… ఏకకాలంలో తన పార్టీని డిఫెండ్ చేసుకోవడం, అవతలి వాళ్ళ మీద విరుచుకుపడటం అన్న కాన్సెప్ట్‌లో వెళ్ళే పయ్యావుల కేశవ్ ఇప్పుడు మాత్రం ఎవరో నెడితే తప్ప ఎందుకని ముందుకు రావడం లేదన్నది సైకిల్ కేడర్ క్వశ్చన్. మంత్రి అయ్యాక ఆ పదవికి తగ్గట్టు హుందాగా ఉండాలి. దాన్ని ఎవరూ తప్పు పట్టరు, కానీ… సందర్భం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడైనా నోరు తెరవాలికదా? రాజకీయ విమర్శలకు ఆ స్థాయిలోనే సమాధానం చెప్పాలికదా..? అందుకు అడ్డుపడుతున్నవేంటి అంటూ ఆర్థిక మంత్రి గురించి రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు టీడీపీ నాయకులు.
గతంలో సంగతి ఎలా ఉన్నా….ఈసారి భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి వచ్చాక, ఫైనాన్స్ మినిస్టర్‌గా బాధ్యతలు తీసుకున్న కేశవ్…. ఈ ఏడాదిన్నరలో తనకు తానుగా స్పందించిన సందర్భాలు చాలా తక్కువని, అలా మాట్లాడిన మాటల్లో కూడా మునుపటి వాడి వేడి కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. ఆయన తీరు గతానికి, ప్రస్తుతానికి ఏ మాత్రం పొంతన లేకుండా ఉందన్నది పార్టీ లీడర్స్ ఎక్కువ మంది అభిప్రాయం. మంత్రులు స్పందిచడంలేదు, సరిగా మాట్లాడ్డంలేదు, ప్రతిక్షానికి సరైన కౌంటర్స్ ఇవ్వలేకపోతున్నారంటూ… సీఎం చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో సీరియస్ అవుతున్నారు. వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో కొంతమంది మంత్రులు ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయం కూడా ఆయనకు ఉంది.
ఆ ఫెయిల్యూర్ లిస్ట్‌లో పయ్యావుల కేశవ్ కూడా ఉన్నట్టు సమాచారం. అది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదమైనా, లేక మెడికల్ కాలేజీల పీపీపీ విధానమైనా…. పై నుంచి డైరెక్షన్ వస్తేనే…. పయ్యావుల స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. అలా ఎందుకంటే… ఒక వెర్షన్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకెందుకొచ్చిన గొడవ, రేపటి రోజున ఏ సిచ్యుయేషన్ ఎలా మారుతుందో, మనం అనవసరంగా ఎక్కువ పూసేసుకోవడం ఎందుకు, కాస్త కామ్‌గా ఉంటే పోలా అంటూ…. వ్యూహాత్మకంగా మంత్రి అలా వ్యవహరిస్తుండవచ్చన్న గుసగుసలు టీడీపీ సర్కిల్స్‌లోనే వినిపిస్తున్నాయి. లోపల ఆయన మనసులో ఏముందో మనకు తెలియదుగానీ…. మెయిన్ రీజన్ అయితే… ఇదే అయి ఉండవచ్చంటూ టీడీపీలోని ఓ వర్గం కూడా విశ్లేషిస్తోందట. ఇది కేవలం పయ్యావుల ఒక్కడికే పరిమితం కాలేదని, ఆ బాటలో ఇంకొందరు మంత్రులు కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. కీలక సమయంలో కొంతమంది మంత్రులు అలా అంటీ ముట్టనట్టుగా ఉండటం గురించి తెలుగుదేశం వర్గాల్లో హాట్ హాట్ డిస్కషన్సే నడుస్తున్నాయి.
