OTR : పట్నం మహేందర్ రెడ్డి దారెటు? పొలిటికల్ కెరీర్‌పై సస్పెన్స్!

Patnam

Patnam

నాలుగు సార్లు ఎమ్మెల్యే.. రెండు విడతలు ఎమ్మెల్సీ.. రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన అనుభవం. అలాంటి కీలకమైన నేత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్‌ ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇప్పుడు ఇరుకున పడ్డారా? మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నా…. ఉన్న పార్టీగాని, పక్కనున్న పార్టీగాని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదా? కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందా అన్న డౌట్స్‌ పెరుగుతున్న ఆ నేత ఎవరు? ఏంటా కన్ప్యూజ్‌ కహానీ? దాదాపు రెండు దశాబ్దాల పాటు తాండూరు రాజకీయాలను శాసించిన నాయకుడు పట్నం మహేందర్‌రెడ్డి. కానీ… అదంతా గతం. ఇప్పుడాయన రాజకీయ ప్రాభవం క్రమంగా తగ్గుతోందంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తన మాటకు తిరుగులేని స్థాయి రాజకీయం చేసిన పట్నం…. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో.. ఇప్పుడాయన పక్క చూపులు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు పట్నం రాజకీయ ప్రస్థానాన్ని కీలక మలుపు తిప్పాయి. అప్పుడు తాండూరు నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, మంత్రిగా కొనసాగినా.. నియోజకవర్గంలో మాత్రం గతంలో ఉన్న రాజకీయ పట్టు క్రమంగా సడలిందని చెబుతారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డి స్వయంగా పోటీ చేయకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందట. అప్పుడు బీఆర్ఎస్ నుంచి పైలట్‌ రోహిత్‌రెడ్డి బరిలో నిలవగా.. కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో మనోహర్‌రెడ్డి సీన్‌లోకి వచ్చారు. ఫైనల్‌గా మనోహర్‌రెడ్డి విజయం సాధించారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో పట్నం కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అధికార పార్టీలోకి వచ్చినప్పటికీ.. తాండూరు రాజకీయాల్లో మాత్రం ఆయన ఆశించిన స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుతం తాండూరుకు కాంగ్రెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మనోహర్‌రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం పట్నం శిబిరంలో ఆందోళన పెంచుతోందట. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మహేందర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది కీలకంగా మారింది. ఈ లెక్కలన్నీ చూసుకునే… ఆయన చీరిగి బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆయనైతే… ప్రయత్నిస్తున్నారుగానీ… అట్నుంచి మాత్రం సానుకూల స్పందన రాలేదనే ప్రచారం జరుగుతోంది. తాండూరులో ఇప్పటికే పైలట్‌ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలకంగా ఉన్నారు.

ఆయన్ని పక్కనపెట్టి పట్నం మహేందర్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం అంత ఈజీ కాదన్న మాటలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇలా… ఎటు చూసినా క్లారిటీ లేక మహేందర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతానికి సందిగ్ధంలో పడిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రాబల్యంతో తాండూరులో తిరుగులేని నేతగా ఎదిగిన ఎమ్మెల్సీ.. ఇప్పుడు అనుకూలమైన రాజకీయ వేదిక కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పట్నం అనుచరవర్గంలోనూ గతంలో ఉన్నంత ఉత్సాహం కనిపించడం లేదట. ఈ పరిస్థితుల్లో… వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ ప్రస్థానానికి అత్యంత కీలకంగా మారబోతున్నాయి. తాండూరు నుంచే మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటారా..? లేక మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా..? అసలు రెండు ఆప్షన్స్‌ కాదని ప్రత్యక్ష ఎన్నికల రాజకీయానికి దూరంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో…. పట్నం రాజకీయ ప్రస్థానం క్రమంగా ముగింపు దశకు చేరుతోందా? అన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి.