అక్కడ మరోసారి నీళ్ళ మీద నిప్పులు రాజుకుంటున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. నీటి హక్కుల పరిరక్షకులం మేమేనంటూ బిల్డప్‌లు ఇస్తున్నారు. తెలంగాణ అధికార, ప్రతిపక్షాల మధ్య తాజా వాటర్ వార్ ఏ జిల్లాలో మొదలైంది? దేన్ని బూచిగా చూపించి మొత్తం మీరే చేశారని అంటున్నారు? పాలమూరు రాజకీయం మొత్తం ఈ మధ్య కాలంలో నీళ్ల చుట్టే తిరుగుతోంది. ఈ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి బీడు భూముల్లో నీరు పారిస్తామని ఈ జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలంతా బల్లగుద్ది చెబుతున్నారు. కానీ… అదే సమయంలో జిల్లా నీటి ప్రయోజనాలను పక్క రాష్ట్రం కర్ణాటకకు తాకట్టు పెట్టారంటూ విపక్షం బీఆర్‌ఎస్ విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో…. మహబూబ్‌నగర్ గులాబీ నేతలు ప్రాజెక్టుల బాట పట్టడం చూస్తుంటే ఇక్కడ వాటర్ పాలిటిక్స్ హీటెక్కినట్టే కనిపిస్తోందని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఇటీవల ప్రాజెక్టు బాట పట్టేందుకు సిద్ధమయ్యారు గులాబీ లీడర్స్. అదే సమయంలో… పెండింగ్ ప్రాజెక్టుల అంశమే ప్రధాన అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటన చేపట్టి, సమీక్షలు నిర్వహించి పనుల్లో వేగం పెంచేలా ఆదేశాలిచ్చారు. తాము ప్రాజెక్టుల దగ్గరికి వెళితే… సర్కార్ అభాసుపాలవుతుందన్న భయంతోనే ముఖ్యమంత్రి ముందుగా మేల్కొన్నారంటూ దీన్ని తమ ఘనతగా క్లెయిమ్ చేసుకుంటోంది గులాబీ దళం. ఇక వారం కిందట జిల్లాలోని అలంపూర్ ప్రాంతానికి సాగు నీరందించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పర్యటన చేపట్టింది విపక్షం. తాగునీటి అవసరాల పేరుతో ఇక్కడి నుంచి కర్ణాటక రెండు టీఎంసీల నీటి తరలింపును తప్పు పట్టారు బీఆర్‌ఎస్ లీడర్స్. ఆర్డీఎస్ ద్వారా జిల్లాకు అందాల్సిన ప్రయోజనాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోబోమని, ఉద్యమించి నీటి వాటా సాధించుకుంటామని హెచ్చరించారు పాలమూరు బీఆర్ఎస్ నేతలు. ఇక తాజాగా కర్ణాటక- తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిపై కర్ణాటక నిర్మించిన గూగల్ బ్యారేజిని పరిశీలించారు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు.
కర్ణాటక అక్రమంగా బ్యారేజీ కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. దీని వల్ల పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతోందంటూ ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ సర్కారే ఉందని, తెలంగాణలోనూ అదే పార్టీ అధికారంలో ఉండటం కారణంగా కృష్ణ, భీమా, తుంగభద్ర నదుల నుంచి జరుగుతున్న నీటి దోపిడీ విషయంలో ఇక్కడి ప్రభుత్వ పెద్దలు కిమ్మనడం లేదని విమర్శిస్తున్నారు గూలాబీ లీడర్స్. దాని ద్వారా కర్ణాటక పేరుతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాటర్ వార్ ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక ఇదే సమయంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటీవల సియం రేవంత్ రెడ్డిని కలిసి… నల్లగొండ ప్రాంతానికి నీరిందించేందుకు చేపట్టిన డిండి ఎత్తిపోతలకు…. పాలమూరు- రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పదించడంతో పాలమూరు నీటి ప్రయోజనాలు కాపాడేది మేము , గత ప్రభుత్వంలో పాలమూరు పథకం నుంచి డిండికి నీటి తరలింపు ప్రపోజల్ పెట్టిందే అప్పటి సియం కేసీఆర్ అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు హస్తం నేతలు. పాలమూరు నీటి ప్రయోజనాల కోసం ఎంతదాకైనా పోతామంటూ ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గులాబీ నేతలకు కౌంటర్స్ వేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కనపడలేదా అని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని, ఫ్లకార్డులు పట్టుకుని డ్రామాలేయడం బంద్ చేయాలంటూ గట్టిగా మాట్లాడ్డంతో నీళ్ళలో పొలిటికల్ నిప్పులు అంటుకున్నాయి. ఇక ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తం మీద కర్ణాటక జల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోందని గులాబీ నేతలు గుండెలు బాదుకుంటుంటే…పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ బాధంతా ఎటు పోయిందంటూ హస్తం నాయకులు వేస్తున్న కౌంటర్స్‌తో పాలమూరు వాటర్ పాలిటిక్స్ రంజుగా మారుతున్నాయి.

