Site icon NTV Telugu

Off The Record : మేయర్ ఎపిసోడ్ తో సింహపురిలో పొలిటికల్ సెగలు

Nellor

Nellor

సూది మొన దూరే సందున్నా.. పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడే సింహపురిలో…. ఇప్పుడు అంతకు మించిన కథ నడుస్తోందా? మేయర్ స్రవంతి ఇటు టీడీపీకి, అటు వైసీపీకి కాకుండా పోయారా? తిరిగి వైసీపీకి దగ్గరయ్యేందుకు ఆమె సరికొత్త ఆట ఆడుతున్నారా? అందుకు వైసీపీ రియాక్షన్‌ ఏంటి? తెలుగుదేశం కౌంటర్స్‌ ఎలా ఉన్నాయి? సింహపురి పాలిటిక్స్‌ ఎప్పుడూ హాటే. అంతకు మించి ఎప్పుడు ఎవరు ఎవర్ని విమర్శిస్తారో అర్థం కాని వాతావరణం ఉంటుంది. నిన్నటిదాకా… అనుబంధాలు, ఆప్యాయతలు ఒలకబోసుకున్న వాళ్ళు… తెల్లారేసరికి కత్తులు దూసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. అలాంటి వాతావరణంలో…. ప్రస్తుతం నెల్లూరు మేయర్ స్రవంతికి వ్యతిరేకంగా టిడిపి అవిశ్వాసం నోటీసులు ఇవ్వడంతో.. చలికాలంలో కూడా పొలిటికల్‌ సెగలు పుడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న మేయర్ కూడా ఇప్పుడు అధికార పార్టీ మీద ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎలాగూ అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు కదా…. కడుపులో ఉన్నదంతా కక్కేద్దామన్నట్టుగా.. స్రవంతితో పాటు ఆమె భర్త కూడా టీడీపీ మీద అటాక్‌ మోడ్‌ ఆన్‌ చేశారట. 2021లో వైసీపీ తరపున కార్పొరేటర్ అయ్యారు స్రవంతి. మేయర్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో అప్పుడు వైసీపీ తరపునే ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆమెకు అవకాశం కల్పించారు. ఇక శ్రీధర్‌రెడ్డి పార్టీ మారిపోవడం, రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి రాజీనామా చేసి అధికార పార్టీలోని వెళ్లాలని చూశారు మేయర్‌. ఆ ఊపులో వైసీపీకి రాజీనామా అయితే చేశారుగానీ… తెలుగుదేశంలోకి లైన్‌ క్లియర్‌ అవలేదు. పార్టీలో చేరతానంటూ జిల్లాకు చెందిన మంత్రి దగ్గరికి వెళ్ళినా.. ఆయన మేయర్ దంపతులను పట్టించుకోలేదట. దాంతో తటస్థంగా ఉండి పోయారు. ఇక నిబంధనల ప్రకారం నాలుగేళ్ళ పదవీకాలం పూర్తవడంతో… గేమ్‌ మొదలుపెట్టిన టీడీపీ… స్రవంతిని పదవి నుంచి దించే ప్రయత్నాల్లో ఉంది.

ఇక అవిశ్వాస తీర్మాన ప్రకటన రావడంతో ఏం చేయాలో అర్ధంకాని మేయర్ దంపతులు… తిరిగి పార్టీలోకి వస్తామంటూ జిల్లా వైసీపీని సంప్రదించారట. కానీ… అట్నుంచి రెడ్‌ సిగ్నల్‌ వేయడంతోపాటు…మీకు మద్దతు ప్రకటించబోమని కరాఖండీగా చెప్పినట్టు తెలిసింది. కానీ.. ఒక ఫైనల్‌ ఆప్షన్‌ ఇస్తూ…మీతో పాటు తిరిగి పార్టీలోకి ఇంకో ఏడుగురు కార్పొరేటర్లను తీసుకొస్తే…. రీ ఎంట్రీ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారట వైసీపీ లీడర్స్‌. అది ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి… ఎటూ పాలుపోని మేయర్‌ కపుల్‌ టీడీపీ మీదే ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారంటూ స్వరం పెంచారు మేయర్‌. అయితే… మేయర్ స్రవంతి, ఆమె భర్త జైవర్ధన్ సానుభూతి కోసమే టీడీపీ ఎమ్మెల్యేని లక్ష్యంగా చేసుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి నెల్లూరులో. వాళ్ళు ఆ స్థాయిలో రెచ్చిపోవడం వెనక జిల్లా వైసీపీ ఉందన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఎస్టీ మహిళగా మేయర్‌ తన సామాజిక వర్గాన్ని జోడించి టీడీపీని డ్యామేజ్ చేసి….. వైసీపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారన్నది ఇంకో వెర్షన్‌.

 

పదవి ఎలాగో పోతుంది కాబట్టి…తమను వీలైనంతగా డ్యామేజ్ చేస్తే… కనీసం వైసీపీ తిరిగి దగ్గరకు తీసుకుంటుందన్నది మేయర్‌ దంపతుల ప్లాన్‌గా అంచనా వేస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి వర్గీయులు. మేయర్ పదవి కోసం రూప్ కుమార్ కుట్రలు చేస్తున్నారన్న మేయర్ భర్త జయవర్ధన్ వ్యాఖ్యలు కూడా టీడీపీలో రాజకీయ దుమారానికి కారణం అవుతున్నాయి. ఓ వైపు మేయర్ దంపతుల విమర్శలు, అందుకు ప్రతిగా కోటంరెడ్డి అనుచరుల కౌంటర్లు పేలుతున్నా వైసీపీ మాత్రం సైలెంట్‌గా తమాషా చూస్తోంది. ఎలాగూ ఆమెకు పదవీ గండం తప్పదని, పార్టీకి రాజీనామా చేసిన వ్యక్తి కోసం ఇప్పుడు మాట్లాడి చేతులు కాల్చుకోవడం అవసరమా అన్న భావనలో ఫ్యాన్ పార్టీ ఉందట. అలాగే ఎస్టీ మహిళకు అన్యాయం చేశారన్న కోణంలో టీడీపీని ఇరుకున్న పెట్టాలనే వ్యూహం కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్‌. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు… వైసీపీకి రాజీనామా చేసి తప్పు చేశామనే భావనలో మేయర్‌ దంపతులు ఉన్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో…పార్టీ సపోర్ట్ ఉంటే.. కథ వేరేలా ఉండేదని, కనీసం అవిశ్వాస తీర్మానం తర్వాత అయినా తిరిగి వైసీపీలోకి వెళ్ళాలని భావిస్తున్నారట స్రవంతి. అందుకే తమను టార్గెట్‌ చేస్తున్నారన్నది కోటంరెడ్డి వర్గం విశ్లేషణ. వోవరాల్‌గా మేయర్‌ మీద అవిశ్వాసం నోటీసులు మాత్రం నెల్లూరులో పొలిటికల్‌ సెగలు పుట్టిస్తున్నాయి.

Exit mobile version