Site icon NTV Telugu

Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

Glast

Glast

ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే … జనం ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధా…? లేక పాలనా సౌలభ్యం కోసం ఆమె నియమించుకున్న పీఏనా…? పీఏ కనుసైగలతోనే నియోజకవర్గ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయన్నది నిజమేనా? ప్రభుత్వ అధికారి అయినా, సివిల్‌ కాంట్రాక్టర్ అయినా… సార్‌కి గుడ్‌మార్నింగ్‌ చెబితేనే మనుగడా? అంత దారుణమైన పరిస్థితులు ఏ సెగ్మెంట్‌లో ఉన్నాయి? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడైనా పీఏలు ఎమ్మెల్యేల మాట వింటారు, వాళ్ల ఆదేశాల్ని పాటిస్తారు. కానీ… విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాత్రం వ్యవహారం రివర్స్‌లో ఉందట. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి బదులు ఆమె పీఏనే మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారన్నది లోకల్‌ వాయిస్‌. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, అధికారుల బదిలీలు… ఇలా ఒకటేమిటి…. పని ఏదైనా, ఎవరికి ఇవ్వాలన్నా, పీఏ సార్‌ చెబితేనే అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆఫీసుల్లో అటెండర్‌ నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరూ ఎమ్మెల్యే మాధవి పర్సనల్‌ అసిస్టెంట్‌ ఏరిచర్ల రాజు కనుసన్ననల్లోనే పని చేయాలట.

 

కాదు కూడదని ఎవరైనా కాస్త అటు ఇటు చేసినా… వెంటనే ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌ చేతిలో పడిపోతాయన్న భయం స్థానిక అధికారుల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక కాంట్రాక్టర్స్‌ సంగతి సరేసరి. వాళ్ళు ఎవరైనా పనికి ముందు సార్‌కు గుడ్‌ మార్నింగ్‌ చెప్పాల్సిందేనని అంటున్నారు. పని ఏదైనాసరే…. ముందే మాట్లాడుకుంటే ఒక లెక్క, మాట్లాడుకోకుంటే మరో లెక్క అన్నట్టుగా వ్యవహారం ఉంటుందన్న మాటలు నెల్లిమర్లలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు వచ్చే వారిని కూడా రాజు సార్‌ పూర్తిగా స్కాన్‌ చేశాకే మేడమ్‌తో అపాయింట్‌మెంట్‌ ఫిక్స్‌ చేస్తారట. ఆయనకు నచ్చని వాళ్ళు శాసనసభ్యురాలిని కలవడానికి వస్తే మాత్రం…ఏదో ఒక సాకు చెప్పి… తిప్పి తిప్పి … చుక్కలు చూపిస్తారన్నది నియోజకవర్గంలో ఉన్న విస్తృతాభిప్రాయం. స్థానికంగా రోడ్ల మరమ్మతులకు, కొత్తవి వేయడానికి కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి కారణం కూడా ఎమ్మెల్యేగారి పీఏనే అన్న ప్రచారం జరుగుతోంది. ఈయన్ని కాదని ఒకవేళ ఎవరైనా పనులు తెచ్చుకుంటే అధికారుల మీద వత్తిడి తెచ్చి మరీ… బిల్లులు ఆపేయిస్తారని చెప్పుకుంటున్నారు.

అసలు సార్…. అధికారులతో మాట్లాడే తీరు కూడా తేడాగానే ఉంటుందట. మేం ఆఫీసర్స్‌, కనీస గౌరవం ఇవ్వాలన్న స్పృహ కూడా ఉండదని ఆఫ్‌ ద రికార్డ్‌లో అధికారులే గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే పీఏ మీద ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నెల్లిమర్ల మండలం టిడ్కో ఇళ్ళ దగ్గర సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే… అక్కడి షిప్ట్ ఆపరేటర్లలో కొన్ని పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించిన రకరకాల వ్యవహారాల్లో కూడా పరిధికి మించి జోక్యం చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. నెల్లిమర్లలో ‌పనిచేస్తున్న ఒక ఆర్పీని ఇబ్బందిపెట్టారన్నది మరో ఆరోపణ. ఆమెతో ఫోన్‌లో అసభ్యకరంగా ‌మాట్లాడిన‌ వాయిస్ రికార్డ్‌ బయటికి వచ్చి ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై సదరు ఆర్పీ… నేరుగా ఎమ్మెల్యే మాధవిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇలా…. ఎట్నుంచి ఎటు చూసినా, ఏ విషయాన్ని తీసుకున్నా… ఎమ్మెల్యే మాధవి పీఏ మీద నెల్లిమర్ల నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇక మండల స్థాయిలో కూడా ఆయన తన మనుషులను నియమించుకుని ప్రత్యేక వ్యవహారాలు నడిపిస్తున్నారన్న ప్రచారం ఉంది. దీనికి సంబంధించి కూటమి నాయకులే గుసగుసలాడుకుంటూ… కొందరి పేర్లు కూడా బయటపెడుతున్నారు. ఈ రకంగా పీఏ మీద ఇన్ని ఆరోపణలు, వ్యవహారశైలి మీద అభ్యంతరాలు వస్తున్నా…. ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న వస్తోంది స్థానికంగా. చివరికి ఫలానా ఎమ్మెల్యేగారి పీఏ అని చెప్పడానికి బదులు ఫలానా పీఏ గారి ఎమ్మెల్యే అనుకోవాల్సి వస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు స్థానికంగా. పీఏ వ్యవహారాలను ఎమ్మెల్యే ఇలాగే చూసీ చూడనట్టు వదిలేస్తే…. ఫైనల్‌గా ఆమెకే డ్యామేజ్‌ తప్పదన్న హెచ్చరికలు కూటమి వర్గాల నుంచే వస్తున్నాయి.

Exit mobile version