Site icon NTV Telugu

Off The Record : సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో నువ్వా నేనా ?

Hanumantharao

Hanumantharao

ఆ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ప్రతిపక్షాలకంటే ఘోరంగా తయారయ్యారట. కార్యక్రమం ఏదైనా సరే… కుమ్ముడు కామనైపోయింది. చివరికి ఆ గొడవలు చూసి… ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి సైతం టూర్‌కి రావడానికి జంకుతున్నారట. కమాన్‌… నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం అంటూ కాలు దువ్వుతున్న ఆ కాంగ్రెస్‌ నేతలు ఏ జిల్లాలో ఉన్నారు? ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులున్నాయి? సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. గ్రూపుల గోల, కలహాల కాపురం, ఆధిపత్య పోరు, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ జిల్లాలో నేతలు విడిపోయి గొడవలను ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి..మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నెల 3న గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటనలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారుతోంది.నర్సారెడ్డి, టీపీసీసీ నేత శ్రీకాంత్ రావు వర్గాల మధ్య మొదలైన వార్ కాస్తా మైనంపల్లి గ్రూప్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టే దాకా వెళ్లింది ఈ పంచాయితీ.

ఆ కేసు వెనుక మైనంపల్లి ఉన్నారనేది నర్సారెడ్డి వర్గీయుల వాదన. జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలంటూ సొంత పార్టీ నేతలే చేస్తున్న ఆందోళనలతో గజ్వేల్‌ కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గలాటా ముగియకముందే సడన్‌గా సిద్దిపేట ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి చక్రధర్ గౌడ్ రాజీనామా చేశారు. వెళ్తూ వెళ్తూ… మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారాయన. సిద్దిపేట ముఖచిత్రం తెలియని మైనంప్లలికి ఇక్కడ ఏం పని అంటూ సెటైర్లు వేశారు. మల్కాజ్ గిరిలో ఉండాల్సిన నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. కార్లతో హంగామా చేస్తూ రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. నాకు సుడా చైర్మన్ పదవి ఇస్తామంటే మైనంపల్లే అడ్డుకున్నారని కూడా ఆరోపించారు చక్రధర్‌. పార్టీలో ఎదుగుతున్న కాంగ్రెస్ నాయకులను మైనంపల్లి హన్మంతరావు టార్గెట్ చేస్తున్నారని విమర్శించారాయన. మరోవైపు జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి బీఆర్ఎస్ కోవర్టు అని మైనంపల్లి ప్రచారం చేస్తుంటే… కాదు మైనంపల్లే బీఆర్ఎస్ కోవర్టు అంటూ నర్సారెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు.

ఈ రెండు ఎపిసోడ్స్‌లో మైనంప్లలి హన్మంతరావు పేరే తెరపైకి వచ్చింది. దీంతో సిద్దిపేట, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చిచ్చు పెడుతున్నారన్నది వ్యతిరేక వర్గాల వాదన. మల్కాజ్ గిరిలో ఉండాల్సిన నాయకుడు సిద్దిపేట జిల్లాపై పెత్తనం చెలాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానిక నేతలు. ఈ వ్యవహారశైలి వాళ్ళకు మింగుడు పడటం లేదట. గతంలో పార్టీలో విభేదాలున్నా మైనంపల్లి ఎంటర్ అయ్యాకే… ఈ రేంజ్‌లో బయటపడుతున్నాయన్నది కాంగ్రెస్‌ కేడర్‌ మాట. అయితే…. మైనంపల్లి దీన్ని ఖండిస్తున్నారు. బీఆర్ఎస్‌కు తొత్తులుగా మారినవాళ్ళే తనను విమర్శిస్తున్నారన్నారన్నది ఆయన వాదన. ఇలా పార్టీలో ఎవరికి వారు విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిందట. గొడవ ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఇలా రోడ్డుకెక్కడంతో సమస్య జఠిలమవుతోందని అంటున్నారు. మరోవైపు మల్కాజ్ గిరిని విడిచి మైనంపల్లి ఈ రెండు నియోజకవర్గాలపై ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారన్నది స్థానిక నేతలు ఎవరికీ అంతు చిక్కడం లేదట.

అటు కీలకమైన రెండు నియోజకవర్గాల్లో గొడవలు ఆ స్థాయిలోజరుగుతుంటే…ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇంచార్జ్ మంత్రి ఏం చేస్తున్నారన్నది క్వశ్చన్‌. సిద్దిపేట జిల్లాకి ఇన్ఛార్జ్‌ అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ అసలు జిల్లాకే రావడం మానేశారట. ఇక సంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు సమాచారం. ఆయన సిద్దిపేట జిల్లాపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ అయితే ఈ గ్రూపు గొడవలతో తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తే ప్రతిపక్ష నాయకులు గొడవపెట్టాల్సింది పోయి సొంతపార్టీ నేతలే వాగ్వాదానికి దిగుతుండటంతో ఏ చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారట వివేక్‌. మొత్తంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌లో ఈ కలహాల కాపురం డైలీ సీరియల్‌లో ట్విస్ట్‌లను తలపిస్తోందని అంటున్నారు. పార్టీ పెద్దలు ఎవరైనా ఈ గొడలవపై దృష్టి పెట్టాలని అడుగుతోంది కేడర్‌.

Exit mobile version