Off The Record : జగిత్యాలలో కేవీ ఏర్పాటు కోసం రాజకీయ యుద్ధం

Mp

Mp

బడి చుట్టూ బడా రాజకీయం నడుస్తోందా? ఏకంగా ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే అన్నట్టు మారిపోయిందా? స్కూల్‌ లొల్లి కాస్తా… పర్సనల్‌గా తిట్టుకునే దాకా ఎందుకు వెళ్ళింది? అసలు ఏ స్కూల్‌ కోసం ఇద్దరు ముఖ్య నేతలు పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు? ఏంటా కథ? జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం మరో జగడానికి వేదిక అయింది. నిన్న మొన్నటి వరకు జీవన్‌రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్‌గా నడిచిన వార్ సద్దుమణిగిందని అనుకునేలోపే… మరో లొల్లి మొదలైంది. ఈసారి బీజేపీ ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యేగా మాటల యుద్ధం నడుస్తోంది. నిరుడు అక్టోబర్‌లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించి ఇవ్వాలని కోరారు నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ స్పందించి జగిత్యాలను ఆనుకుని ఉన్న చల్‌గల్‌ సమీపంలోని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన స్థలాన్ని కేంద్రీయ విద్యాలయంతోపాటు.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

 

ఈ క్రమంలో… విద్యాసంవత్సరం సమీపిస్తోంది, స్థలం ఎప్పుడిస్తారంటూ ఎంపీ అర్వింద్ పలుమార్లు ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేను టార్గెట్ చేసారు.. ప్రభుత్వానికి లేఖ రాశాం.. అది ఇరిగేషన్ శాఖా స్థలం కాబట్టి ఆలస్యం అవుతోందని ఎమ్మెల్యే సమాధానాలిచ్చారు. అయితే….అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న జీవన్‌రెడ్డి మంత్రి ఉత్తమ్‌తో చెప్పి ఆ స్థలం ఎలా ఇస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు జీవన్‌రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లడం… విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం సమీపిస్తుండటంతో… మరోసారి కేంద్రీయ విద్యాలయం స్థలం కోసం ఎంపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలోనే… పది ఎకరాలు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు, రెండెకరాలు కేంద్రీయ విద్యాలయానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో ఇచ్చింది. ఇక్కడ మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది.చల్‌గల్‌లో ఉన్న స్థలం ఇరిగేషన్ శాఖది కాబట్టి వారు ఎన్‌ఓసీ ఇస్తేనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జీవో ఇచ్చే అవకాశాలుంటాయి. అందుకే ఆలస్యం అయిందని, ఇప్పుడు కేటాయింపులు జరిగాక గొడవ దేనికని అన్నారు ఎమ్మెల్యే సంజయ్. దానికి ఎంపీ సంజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.. కేంద్రీయ విద్యాలయం స్థాపించాలంటే కనీసం ఐదు ఎకరాల స్థలం అవసరం.

భూమి ఉన్నప్పటికీ… రెండు ఎకరాలే ఎలా కేటాయిస్తారంటూ ఓ రేంజ్‌లో ధ్వజమెత్తారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ… చల్‌గల్‌లో కాకుండా నర్సింగాపూర్ డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళ సమీపంలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అది కేటాయిస్తామని అన్నారు. సమస్య పరిష్కారమైందని అనుకుంటున్న టైంలో ఎంపీ అర్వింద్ మరో బాంబు పేల్చారు. నర్సింగాపూర్ స్థలం స్కూల్‌కు అనువుగా లేదని, ఆ స్థలం వద్దేవద్దు.. చల్‌గల్‌లోనే ఐదెకరాలు కావాలనడంతో మేటర్‌ మళ్లీ మొదటికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే యంగ్‌ ఇండియా స్కూల్‌కు పది ఎకరాలు ఇస్తారు… కేంద్రం ఏర్పాటు చేసే కే.వీకి రెండెకరాలే ఇస్తారా…? అంటూ.. పనిలో పనిగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌ మూర్ఖుడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు.. ఎమ్మెల్యే కావాలని కేంద్రీయ విద్యాలయానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆయన్ని ఓడించి నగ్నంగా బజారులో నిలబెడతానంటూ నిప్పులు చెరిగారు. దాంతో ఎమ్మెల్యే కూడా సీరియస్‌ అయ్యారు. తనను ఓడించేందుకు డబ్బులు పెట్టే బదులు ఆ సొమ్ముతో భూమి కొని కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చి ఎంపీ తన పేరు పెట్టుకోవాలంటూ చురకలంటించారు. స్థల సేకరణ దగ్గర స్టార్టయిన సమరం… పరుషపదజాలంతో విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లడంతో జగిత్యాల పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. డే స్కూల్‌గా నడిచే కేంద్రీయ విద్యాలయానికి రాకపోకలకు వీలుగా ఉంటూ.. రవాణా సౌకర్యం అనుకూలంగా ఉండే చల్‌గల్‌ అయితేనే బెటర్ అని అంటున్నారు బీజేపీ నేతలు… రెసిడెన్షియల్ కాని స్కూల్‌ కోసం వారు ఐదెకరాలు అడిగితే.. తాము… ఆరు ఎకరాల స్థలం , అది కూడా జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉన్న నర్సింగాపూర్‌ లో ఇస్తామని అంటున్నా… కావాలని బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం వాదన. ఇంతకాలం జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్‌ అన్నట్టుగా సాగిన పొలిటికల్ వార్.. కేంద్రీయ విద్యాలయం పుణ్యమాని ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది… మరోవైపు… ఇద్దరు నేతలు కొట్టుకోకుండా జగిత్యాల జిల్లా ప్రజలకు ఉపయోగపడే కేంద్రీయ విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు…