Site icon NTV Telugu

Off The Record : బాపట్ల ఎంపీకి సొంత పార్టీ నేతలతోనే గిల్లికజ్జాలా..?

Mp

Mp

ఆ పోలీస్‌ టర్న్‌డ్‌ పొలిటీషియన్‌కు ఇప్పటికీ పాత వాసనలు పోలేదా? నేను ఎంపీని, మీరంతా నా పరిధిలోనే ఉంటారంటూ ఎమ్మెల్యేల మీద కర్ర పెత్తనాలు చేయాలనుకుంటున్నారా? అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అనుచరగణం బాగా అతి చేస్తోందన్న విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ ఎంపీ మీద సొంత టీడీపీ ఎమ్మెల్యేలే కోపంగా ఉండటానికి కారణం ఏంటి? ఎవరాయన? ఏంటా కెలుకుడు కహానీ? అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఈ మధ్య కాలంలో మాత్రం బాపట్ల ఎంపీలకు బంపరాఫర్స్‌ తగులుతున్నాయి. వీళ్ళే వాటిని వెదుక్కుంటూ వెళ్తున్నారో, లేక అవే వీళ్ళకు అంటుకుంటున్నాయోగానీ… కేరాఫ్‌ కాంట్రవర్శీ అన్న పేరు మాత్రం స్థిరపడుతోంది. గతంలో ఇక్కడి నుంచి వైసీపీ తరపున గెలిచిన నందిగం సురేష్ వ్యవహారశైలి ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీడీపీ సిట్టింగ్‌ ఎంపీ కృష్ణప్రసాద్ కూడా… అదే రూట్లో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట ఎక్కువ మందికి. అదీకూడా సొంత పార్టీ నేతలతో కావడం ఇంకా ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి ఎంపీ అయిన ఈ మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌.. మొదట్లో బాగానే ఉన్నా… క్రమంగా చుట్టూ చేరిన కోటరీతో వివాదాల్లో ఇరుక్కుంటున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో.

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం, వాళ్ళు లోకల్‌ వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి స్థానిక ఎమ్మెల్యేల అనుచరులతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లాంటి వ్యవహారాలతో నిత్యం ఏదో ఒక వివాదం రేగుతూనే ఉందట. ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యే వర్గాలు అన్నట్టు తయారవడం పార్టీకి కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బుసక తవ్వకాల వ్యవహారంలో ఎంపీ కృష్ణప్రసాద్ అనుచరులు జోక్యం చేసుకుంటున్నారట. దాంతో… ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మతో విబేధాలు మొదలైనట్టు తెలిసింది. అలాగే…లోకల్‌గా రేషన్, లిక్కర్ వ్యవహారంలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక దశలో బాపట్ల ఎమ్మెల్యే, ఎంపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఇక మరో నియోజకవర్గంలో కూడా ఇదే తరహాలో ఎంపీ అనుచరులు జోక్యం చేసుకున్నారట. సిలికాన్ ఇసుక వ్యవహారంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఎంపీకి మొదలైన వివాదం తారాస్థాయికి చేరింది. దీంతో ఎంపీ మనుషులకు ఆ ఎమ్మెల్యే అనుచరులు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మరో రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో ఇసుక రీచ్ లు ఉన్నాయి.

అక్కడ ఇసుక అక్రమ తవ్వకాల్లో… వేలుపెట్టేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించడాన్ని గుర్తించిన అక్కడి సీనియర్ ఎమ్మెల్యేలు మొదట్లోనే చెక్ పెట్టేశారట. పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన కృష్ణప్రసాద్ వ్యవహారశైలి కూడా వివాదాలకు దారితీస్తోందంటున్నారు.ఎంపీగా గెలిచాక ఆయన అందుబాటులో ఉండడం లేదన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట.తాను ఎంపీని కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమానంగా తనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అనడం కూడా వివాదంగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. గతంలో బాపట్ల ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఎవ్వరూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకునేవారు కాదు. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉంటే ఆయా సెగ్మెంట్స్‌లో మాత్రమే, అదీకూడా కొద్దో గొప్పో జోక్యం చేసుకునేవారు. కానీ సిట్టింగ్‌ ఎంపీ మాత్రం అందుకు భిన్నంగా… ఎమ్మెల్యేలతో సమానంగా ప్రాధాన్యత కోరుకోవడంతో వివాదాలు రేగుతున్నాయన్న అభిప్రాయం బలంగా ఉంది లోకల్‌గా. మీ వ్యవహారం ఢిల్లీలో, ఇక్కడ మీకేం పని అంటే ఊరుకోవడం లేదట.

ఎంపీని, మీ అసెంబ్లీ సెగ్మెంట్స్‌ కూడా నా పరిధిలో ఉన్నాయి కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనన్నది ఆయన వాదన. కానీ… ఇలాంటి లోక్‌సభ సభ్యుడిని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ… సొంత టీడీపీ ఎమ్మెల్యేలే అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి చాలవన్నట్టు జిల్లా కేంద్రం బాపట్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో తనకోసం ఛాంబర్ ఏర్పాటు చేసుకున్నారు కృష్ణప్రసాద్‌. ఇది కూడా వివాదం అయింది. ఎంపీ అయినంత మాత్రాన గవర్నమెంట్‌ ఆఫీస్‌లో పర్సనల్‌ ఛాంబర్ ఎలా ఏర్పాటు చేసుకుంటారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ఎంపీ వ్యవహారశైలి, ఆయన అనుచరుల అతి జోక్యం టీడీపీలో వివాదాస్పదం అవడమే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య విబేధాలు పెంచుతున్నాయంటున్నారు. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్టు తాజాగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఎంపీ తీరును అధినేత దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే…. బాపట్ల ఎంపీ పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించారు. ఎంపీ పనితీరు ఎలా ఉంది… అందుబాటులో ఉన్నారా… లేదా లాంటి ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ జరిపారు. ఇదే ఇప్పుడు బాపట్లలో హాట్ టాపిక్ గా మారింది. ఆ రిపోర్ట్‌ ఆధారంగా అధిష్టానం ఎలా ముందుకు వెళ్తున్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.

 

Exit mobile version