Site icon NTV Telugu

Off The Record : తుంగతుర్తిలో ఎంపీ, ఎమ్మెల్యే వార్ డైరెక్ట్ అయ్యిందా?

Congress

Congress

ఆ నియోజకవర్గంలో కోల్డ్‌ వార్‌ ఓపెనైపోతోందా? ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యేగా అగ్గి అంటుకుందా? ఎమ్మెల్యే క్లియర్‌గా, క్లారిటీగా చెప్పిన తాజా మాటలు కేవలలం ఎంపీకేనా? లేక అక్కడ పట్టున్న కాంగ్రెస్‌ సీనియర్స్‌ అందరికీనా? ఎవరా ఇద్దరు ప్రజాప్రతినిధులు? ఏంటా ఫ్రస్ట్రేషన్‌ కహానీ? తుంగతుర్తి కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇన్నాళ్ళు భిన్న వర్గాల కార్యకర్తల మధ్యే వాగ్వాదం, ఘర్షణలు, తోపులాటలు, ఫ్లెక్సీలు చింపుకోవడాలు జరగ్గా…ఇప్పుడిక అసలు నాయకుల వంతు వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే మందుల సామేల్…, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే రచ్చ రచ్చ జరిగింది. ఎమ్మెల్యే… ఎంపీని ఉద్దేశించి పరోక్షంగా ఆయన సమక్షంలోనే చేసిన కామెంట్స్ ఇద్దరు నేతల అనుచరుల మధ్య వాదులాటకు దారితీశాయి.

స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే… భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం సామేల్‌ ఆగ్రహానికి కారణం కాగా.. చామల తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారాయన. తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నాడని, ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకే చెందిన వారని గుర్తుంచుకోవాలన్నారాయన. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి తానుగాని, తన కార్యాలయంగాని సాయం చేయకపోయినా, చెక్కులు ఇవ్వకపోయినా..,
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను నిరాకరించినా.. ఎంపీ దగ్గరికైనా, మరో నాయకుడి దగ్గరికైనా వెళ్ళవచ్చని, అలా కాకుండా… నేనుండగానే… నన్ను కాదని నేరుగా ఎంపీ దగ్గరికి కొందరు నాయకులు వెళ్లడం, వాళ్ళతో ఉన్న వాళ్ళకు ఆయన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇప్పించడం ఏంటని సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే మందుల సామేల్. నేను కాదంటే కదా… మీరు జోక్యం చేసుకోవాల్సింది అని ఎమ్మెల్యే సూటిగా ఎంపీ చామలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
నియోజకవర్గంలో కొందరు నేతల అతి జోక్యానికి ఇది పరాకాష్ట అన్న చర్చ జరుగుతోంది హస్తం సర్కిల్స్‌లో. అయితే… నేనుండగా మీరెందుకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పని చేస్తున్నారని ఎమ్మెల్యే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చానీయాంశంగా మారింది. ఈ రకంగా ఎవరికి వారి నియోజకవర్గంలోకి వచ్చి చెక్కులు ఇచ్చేసి, నామినేటెడ్ పదవులు పంపిణీ చేసేసి…ఇతర అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే.. ఇక ఎమ్మెల్యేగా నేనెందుకు ఉండటం అంటున్నారు సామేల్‌. కొందరు ముఖ్య నేతలు, సీనియర్లు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా.. ఇష్టం వచ్చినట్లు తుంగతుర్తిలో జోక్యం చేసుకోవడం వల్లే ఇక్కడ హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తం అవుతోందని అంటున్నారు శాసనసభ్యుడు. ఆ వర్గపోరే వివాదాలకు కేంద్ర బిందువు అవుతోందన్నది ఆయన వెర్షన్‌.

ఎంపీ అయినా… ఇతర నాయకులైనా… స్థానిక ఎమ్మెల్యేను కాదని నియోజకవర్గంలో వేరే వర్గాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటూ ఫైర్‌ అవుతున్నారు మందుల. నేనేం ఎన్నికలకు ముందు వచ్చిన ప్యారాచూట్ నేతను కాదు, నాకు ఉద్యమ నేపధ్యం ఉంది..ప్రజా జీవితంలో 5 దశాబ్దాలుగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. అందరు నాయకులు ప్రచారం చేసారు, ప్రజలు గెలిపించారంటూ ఘాటుగా, డీటైల్డ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు సామేల్‌. ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామినన్న విషయాన్ని గుర్తించకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారాయన. భువనగిరి యంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో సహా… తుంగతుర్తి నియోజకవర్గంపై పట్టున్న పలువురు సీనియర్ నేతలు కూడా… ఒక పద్ధతంటూ లేకుండా… ప్రోటోకాల్ పాటించకుండా ఎవరంటే వారిని ప్రోత్సహించడం వల్లే.. గ్రూప్‌ రాజకీయాలు ఇలా తగలడ్డాయంటూ మండిపడుతున్నారు మందుల. ఎమ్మెల్యే ఆగ్రహానికి, అసంత్రుప్తికి తాజా ఘటన పరాకాష్టగా చెప్పుకుంటున్నారు హస్తం నాయకులు. స్థానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్న ఈ టైంలో ఇలాంటి పరిణామాలు కరెక్ట్‌ కాదన్నది కేడర్‌ మాట. మొత్తం మీద ఇన్నాళ్లు నిరువుగప్పిన నిప్పులా ఉన్న తుంగతుర్తి హస్తం రాజకీయం ఇప్పుడిప్పుడే బ్లాస్టింగ్‌ స్టేజ్‌కు వస్తోందని,
గాంధీ భవన్ పెద్దలు వెంటనే జోక్యం చేసుకోకుంటే… దాని పరిణామాలు ఎట్నుంచి ఎటు పోతాయో చెప్పలేమంటున్నారు లోకల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు.

Exit mobile version