Site icon NTV Telugu

Off The Recrod : ఇందూర్లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్..!! తమ్ముడి పై అన్న అస్త్రం

Bjp

Bjp

ఆ కార్పొరేషన్ లో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే.. ఆయన్ను రంగంలో దింపాలని హస్తం పెద్దలు భావిస్తున్నారా..? ఆ మాజీ మేయర్‌ను మరోసారి మేయర్ చేయాలని పార్టీ పెద్దల వ్యూహమా? రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ఇందూరులో చక్రం తిప్పేలా ప్రణాళికలు వేస్తున్నారా.. ఇంతకీ ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు.. చేస్తున్న ప్లాన్ ఏంటి…ఎంపీ అర్వింద్ దూకుడుకు.. ఆయనతో చెక్ పెట్టించే స్ట్రాటజీ ఏంటి? మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు.. ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఇందూరు కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాలని హస్తం పార్టీ నేతలు ఇప్పటి నుంచే వ్యూహాం రచిస్తున్నారట. దీనికి కారణం ఉందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఎవరు ఔనన్నా.. కాదన్నా ఇందూరు కార్పొరేషన్ లో బీజేపీ బలంగా ఉందని లెక్కలేసుకుంటున్నారు. అనేక సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందని వారే మాట్లాడుకుంటున్నారు. కానీ ఓ వ్యూహం రచిస్తే.. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయవచ్చని సర్వేలో తేలిందట.

నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు, పద్మశాలి, మైనార్టీ ఓటు బ్యాంకును గంప గుత్తగా దక్కించుకుంటే మేయర్ పీఠం హస్తగతం చేసుకోవచ్చని సర్వే నివేదికలు తేల్చాయట. దీంతో హస్తం పార్టీ నేతలు ఆ దిశగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఆ వర్గాల్లో బలమైన పట్టు ఉన్న నేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి.. ముందు కెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న దివంగత నేత డీఎస్ తనయుడు మాజీ మేయర్ సంజయ్ ను పార్టీలో యాక్టివ్ చేసి.. ఆయనకు రాష్ట్ర స్దాయిలో నామినేటెడ్ పదవి లేదా మేయర్ అభ్యర్ధిగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మేయర్ గా పోటీ చేయాలని సంజయ్ తో కీలక నేతలు చర్చించారట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారట. ఐతే మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే.. జిల్లా అధ్యక్షునిగా ఉన్న ధర్మపురి సంజయ్ కి కీలక పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారట.

అటు బీజేపీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ ఎట్టి పరిస్దితుల్లో నగరపాలక సంస్ధలో పాగా వేయాలని… పకడ్బందీ ప్లాన్ వేశారట. అర్వింద్ దూకుడుకు కళ్లెం వేయాలంటే.. ధర్మపురి సంజయ్ ను పార్టీలో కీలకం చేయాలని భావిస్తున్నారట హస్తం పెద్దలు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మెన్ లు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. బీజేపీ హవా తగ్గించాలంటే మాజీ మేయర్ సంజయ్‌కు కీలక పదవి కట్టబెట్టి..మున్నూరు కాపు వర్గాలను దగ్గరికి తీసుకోవాలనే చర్చ నడుస్తోందట. ఇప్పటికే జిల్లా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన ధర్మపురి సంజయ్… మున్నూరు కాపు సంఘంలో యాక్టివ్ అయ్యారట. వరుస సమావేశాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మేయర్ పీఠం హస్తగతం చేసుకోవాలని.. ఆయన సైతం తన ప్లాన్ పార్టీ పెద్దలకు చెప్పారట. దీంతో సంజయ్ సేవలను పార్టీలో ఎలా వినియోగించుకోవాలనే సమాలోచనలు చేస్తున్నారని లోకల్‌ కేడర్‌లో డిస్కషన్ నడుస్తోంది.

ధర్మపురి సంజయ్ పార్టీలో యాక్టివ్ కాకుండా ఓ అదృశ్య శక్తి సైతం అడ్డుపడుతోందట. ఆయన యాక్టివ్ ఐతే తమకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుందని కొంత మంది కాంగ్రెస్ నేతలు మంత్రాంగం నడుపుతున్నారట. ఐతే సీఎం, ఇతర పార్టీ పెద్దలు మాత్రం.. సంజయ్ ను యాక్టివ్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆర్టీసీ ఛైర్మన్ లాంటి నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం ఓ వైపు ఉన్నా.. మేయర్ అభ్యర్ధిగా ప్రకటించే ఆలోచన సైతం చేస్తున్నారట. బీజేపీ దూకుడు తగ్గించేందుకు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్తుందో తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version