Site icon NTV Telugu

Off The Record : కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్ క్లియర్ అయినట్టేనా?

Kavitha

Kavitha

ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదానికి ఇక లైన్‌ క్లియర్‌ అయినట్టేనా? ఇన్నాళ్ళు పెండింగ్‌లో ఉన్నా… ఇప్పుడు సభ సాక్షిగా కోరినందున ఇక ఛైర్మన్‌కు కూడా తప్పదా? నిజంగానే ఆమోద ముద్ర పడితే… అది ఎవరికి లాభం? ఎవరికి లైన్‌ క్లియర్‌ అవుతుంది. ఆ నేత నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా కింద పోటీ చేయగలరా? లెట్స్‌ వాచ్‌. శాసనమండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత… అందుకు కారణాలను ఇవాళ సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు, ఉద్యమంలో పాత్ర, అధికారం వచ్చాక తనకు సొంత పార్టీలో జరిగిన అవమానాల గురించి చెబుతూ… ఒక దశలో కంటతడి పెట్టుకున్నారామె. మండలిఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే… భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని, ఆ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

అదే సమయంలో… ఒక ఎమ్మెల్సీ తన రాజీనామా గురించి నిండు సభలో ప్రస్తావించి, కారణాలను సవివరంగా చెప్పడం ఇదే మొదటి సారి. వాస్తవానికి… రాజీనామా చేసిన సభ్యులు ఎవరైనా సరే… ఛైర్మన్‌ కార్యాలయంలో రాజీనామా సమర్పిస్తారు. కారణాలకు కూడా అక్కడే వివరిస్తారు. కానీ… ఆ విషయంలో కొత్త పద్ధతికి తెర తీశారు కవిత. ఈ పరిస్థితుల్లో… పునరాలోచించుకోమని ఛైర్మన్‌ చెప్పినా… అంతిమంగా ఆమోదించడం మాత్రం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. అదే జరిగితే…ప్రస్తుతం ఏ సభ సభ్యుడు కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్న మంత్రి అజహరుద్దీన్‌కు లైన్‌ క్లియర్‌ కావచ్చని అంటున్నారు. కవిత రాజీనామా ఆమోదం పొందిన వెంటనే కౌన్సిల్‌లో ఓ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్‌కు చైర్మన్ కార్యాలయం నివేదిక పంపుతుంది. భర్తీ కోసం కొద్ది రోజుల్లోనే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.

ఆ పని వెంటనే జరిగితే… మంత్రి అజహరుద్దీన్‌కు పెద్ద ఊరట అంటున్నాయి రాజకీయవర్గాలు. ఏ సభలో స్థానం ఖాళీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు మంత్రి. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కవిత. ఇప్పుడు రాజీనామా ఆమోదం పొందితే… అజార్‌ కూడా అక్కడే పోటీ చేసి గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓటర్లు పూర్తి స్థాయిలో లేరు. మున్సిపల్ కార్పొరేటర్లు, ఎంపిటిసి, జెడ్పీటీసీ, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి… పరిషత్‌ ఎన్నికలు ముగిశాకే… ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అటు అజారుద్దీన్‌ కేబినెట్‌లో కొనసాగాలంటే…. ఇప్పటికే రాజ్‌భవన్‌లో ఉన్న లిస్ట్‌ను గవర్నర్‌ ఆమోదించాలి, లేదా కవిత ఖాళీ చేసే స్థానంలో పోటీ చేసి గెలవాలి. ఈరెండు మార్గాలే అజహరుద్దీన్ ముందున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో…. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో… అంతా అనుకున్నట్టు ఆన్‌టైమ్‌ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎమ్మెల్సీగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి రాజీనామా అజహరుద్దీన్‌కు కలిసొచ్చే అవకాశం ఉన్నా… అది ఎంతవరకు అన్న విషయంలో మాత్రం ఇంకా అనుమానాలున్నాయి.

Exit mobile version