ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్‌తో అమీతుమీకి సిద్ధమయ్యారా? సొంత పార్టీతోనే ఢీ అంటే ఢీ అనాలని డిసైడయ్యారా? ఇక అటాక్ మోడ్‌ని యాక్టివేట్ చేసినట్టేనా? ఆ దిశగా బలమైన సంకేతం పంపారా? ఇంతకీ కవిత తాజాగా ఏం చేశారు? అటాకింగ్ మొదలుపెట్టారన్న డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? పార్టీలో కవిత ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడే టైం వచ్చిందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి?
బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్ పీక్స్‌కు చేరిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. పార్టీ కూడా ఇక ఎంతో కాలం ఓపిక పట్టకపోవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఏం…ఇంతలోనే ఏమైంది? చాలా రోజుల నుంచే ఆమె ధిక్కార స్వరం వినిపిస్తున్నారు కదా…? కేసీఆర్ కూడా మిగతా నేతలకు భిన్నంగా కుమార్తె విషయంలో ఉండదల్చుకున్నట్టు చెబుతున్నారు కదా? మరిప్పుడు పీక్స్, ఎండ్ కార్డ్ లాంటి మాటలు ఎందుకొస్తున్నాయని అంటే…. జరుగుతున్న పరిణామాలన్నది రాజకీయ వర్గాల సమాధానం. కవిత పేరుకు బీఆర్ఎస్‌లో ఉన్నా….ప్రస్తుతం సొంత అజెండాతోనే ముందుకు వెళ్తున్నారు. జాగృతి వేదికగా దూకుడు పెంచుతున్నారామె. వీలైనంత వరకు తన సొంత సంస్థను బోలోపేతం చేసి జనంలోకి చొచ్చుకు వెళ్ళాలనుకుంటున్నట్టు సమాచారం. సరే… పోనీ… అంతవరకు బాగానే ఉందని అనుకున్నా…. బీఆర్‌ఎస్ ప్రోగ్రామ్‌కు పోటీగా జాగృతి కార్యక్రమం నిర్వహించడం తాజా సంచలనం. దీంతో.. ఇక డైరెక్ట్ వార్ ప్రకటించినట్టేనా అన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జాగృతి లీడర్ కార్యక్రమం నిర్వహించారు కవిత. అందులో జాగృతి క్యార్తకర్తలకు శిక్షణ తరగతులు జరిగాయి. సంస్థ బలోపేతంలో భాగంగా.. ఇప్పటికే యువతను పెద్ద ఎత్తున జాగృతిలో చేర్చుకుంటున్నారు కవిత. అచ్చు రాజకీయ పార్టీకి లాగే…. తన సంస్థకు అనుబంధంగా యువ, మహిళ, విద్యార్థి, కార్మిక విభాగాలను ఏర్పాటు చేస్తున్నారామె. అందుకు సంబంధించిన సభ్యత్వాలను కూడా చేయిస్తున్నారు. అలాంటి వాళ్ళందర్నీ భావి నాయకులుగా తీర్చి దిద్దడంలో భాగంగానే లీడర్ పేరుతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారట. అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
జాగృతి శిక్షణ తరగతులను నిర్వహించిన శనివారం రోజే.. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. హైదరాబాద్‌లోనే మరో కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మీటింగ్ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రాష్ట్రస్థాయి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొని కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఇదే అంశం ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్, ఇటు జాగృతి… రెండు సమావేశాల మీద రెండు కళ్ళు వేసి గమనించారు కొందరు. ఎవరేం మాట్లాడారు? అందులోని అర్ధాలు, అంతరార్ధాలు ఏంటని విశ్లేషించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రెండు మీటింగ్స్ కూడా… యువతకు సంబంధించినవే కావడంతో ఎవరెవరు ఎటెటు వెళ్ళారన్న ఆరాలు కూడా మొదలయ్యాయట. వాస్తవానికి ఈ రెండు మీటింగ్స్‌కు హాజరైన యువత మొత్తం బీఆర్ఎస్‌కు సంబంధించినవారే. అంతా ఒక దగ్గర హాజరైతే ఆ బలం వేరుగా కనిపిస్తుంది. కానీ…. సరిగ్గా బీఆర్‌ఎస్వీ శిక్షణా తరగతులు నిర్వహించిన రోజునే… జాగృతి శిక్షణా కార్యక్రమాల్ని కూడా పెట్టడంతో… యువత అటు ఇటు చీలిపోయారని, ఇదంతా పోటా పోటీగా జరిగినట్టు కనిపిస్తోందని అంటున్నారు కొందరు. కవిత ఓవైపు బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పుకుంటూనే… మరోవైపు జాగృతి ఆధ్వర్యంలో నాయకులను తయారు చేస్తానని ప్రకటించడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు బీఆర్‌ఎస్ కూడా జాగృతికి చెక్ పెట్టే ప్రయత్నం మొదలుపెట్టిందని, విద్యార్థి విభాగం బలోపేతంపై ఫోకస్ పెట్టడం అందులో భాగమేనని చెప్పుకుంటున్నారు. ఇలా… ఒకే రోజు హైదరాబాద్‌లోనే జాగృతి, బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు పెట్టడంతో…గులాబీ రాజకీయాలు వేడెక్కాయి. కాస్త నిశితంగా పరిశీలిస్తే….. బీఆర్‌ఎస్‌తో మానసికంగా దూరమైనప్పటి నుంచి జాగృతిని రీ యాక్టివ్ చేయడంలో బిజీ అయ్యారు కవిత. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూనే…. పార్టీ కార్యక్రమాల మీద కాకుండా… సొంత బలం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు అంటూనే…. ఇటు బీఆర్ఎస్ తప్పిదాలను సైతం చూపిస్తున్నారామె. ఈ పరిస్థితుల్లో పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు అలా నడుస్తుండగానే… పోటీగా లీడర్ ప్రోగ్రామ్ నిర్వహించడంతో… ఇక మేటర్ ముదిరిపోయినట్టేనా అన్న చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ రాజకీయవర్గాల్లో.
