తెలంగాణలో త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జోరుమీదుంది. అయితే… ఆ రెండు పార్టీలు మాత్రం అభ్యర్థుల విషయం తేల్చుకోలేకపోతున్నాయట. ఇంతలోనే ఒక కొత్త చర్చ మొదలైంది. నువ్విక్కడ… నేనక్కడ అంటూ ఆ రెండు పార్టీలు ఐక్యతా రాగం ఆలపించబోతున్నాయట. బయట పడకపోయినా… ఇంటర్నల్గా సహకరించుకోవాలనే చర్చ రెండూ పార్టీల్లోనూ నడుస్తోందట. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్గా తయారయ్యాయా..? ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార కాంగ్రెస్ దూసుకుపోతుంటే… బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం అభ్యర్థులను తేల్చుకోలేకపోతున్నాయా..? రెండు ఎమ్మెల్సీ స్థానాలు. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మాత్రం ఆశావహుల పేర్లను వడపోసి ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదించి ఆ లిస్టును అధిష్ఠానానికి పంపే పనిలో ఉందట. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఓటర్ల నమోదు, పార్టీ నాయకులతో సమన్వయం, అభ్యర్థుల ఎంపిక అంటూ ఎన్నికలకు ప్రిపేర్ అవుతోందట. అయితే, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారట. అవసరమైతే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే పోటీకి దిగొచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో మాత్రం బీజేపీకి సరైన అభ్యర్థి దొరకడంలేదన్న చర్చ నడుస్తోంది. అందుకే అభ్యర్థి విషయంలో ఆ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది. అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలోకి దిగిన బీఆర్ఎస్ ఇప్పటిదాకా అభ్యర్ధులను ప్రకటించలేదు. అయితే, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి మళ్లీ బరిలో ఉంటాడని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఆ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల సమయంలో కూడా ఈ స్థానంలో బీజేపీ కేడర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతు తెలిపిందని తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. అయినప్పటికీ బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కోల్పోయింది. ఈసారి కూడా అదే అభ్యర్థి ఫైనల్ అవుతారని ప్రచారం జరుగుతుండటంతో మరోసారి బీజేపీ ఇంటర్నల్గా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకోసమే నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో బీజేపీ అభ్యర్థిని తేల్చకుండా తాత్సారం చేస్తోందనే చర్చ జరుగుతోందట. ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో అభ్యర్థి విషయంలో బీఆర్ఎస్లో ఎలాంటి క్లారిటీ లేదట. కానీ ఇదే స్థానం నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందనే ప్రచారం మొదలైందట. ఒకవేళ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని పెట్టేట్టు అయితే… బలహీనమైన వ్యక్తిని బరిలోకి దించుతారా..? అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో బీజేపీ మద్దతు తీసుకునేట్టు అయితే… హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన ఉంటుందని తమ నాయకులకు బీఆర్ఎస్ ఇంటర్నల్గా చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే… గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీలు ముందస్తుగానే సమన్వయం చేసుకుంటున్నాయనడానికి ప్రధానమైన కారణం ఇప్పటిదాకా గులాబీ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడమేనట. అయితే దసరా తర్వాత బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులనూ ప్రకటించే అవకాశాలున్నాయట. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఓసీ అభ్యర్థిని రంగంలోకి దింపితే… హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే… రెండు స్థానాలపై దృష్టిపెట్టి ఏదీ గెలవకుండా బలహీనపడే కంటే… ఒక స్థానంపై గట్టిగా ఫోకస్ చేసి ఎలాగైనా గెలుచుకోవాలనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలు ఇంటర్నల్గా ఏకం కాబోతున్నాయా..? లేదా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

