Site icon NTV Telugu

Off The Record : భవిష్యత్ మంత్రి పదవి కోసం తోట త్రిమూర్తులు అడ్వాన్స్ బుకింగ్

Ycp

Ycp

ఆ ఎమ్మెల్సీ రూట్‌ మార్చేశారా? గత అనుభవాలన్నిటినీ మిక్స్‌ చేసి మిక్సీలో వేసేసి…. ఇప్పుడో సరికొత్త ఫార్ములాను తయారు చేశారా? దాని ప్రకారమే 2029 ఎన్నికల కోసం ఇప్పట్నుంచే పకడ్బందీగా స్కెచ్‌ వేస్తున్నారా? కూటమి పార్టీల్లోకి ఎంట్రీ లేదని తెలుసుకుని వైసీపీలోనే పకడ్బందీగా పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్సీ ఎవరు? గతానికి భిన్నంగా ఇప్పుడాయన లెక్కలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తోట త్రిమూర్తులు. అయితే… ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం 2027 జూన్ వరకు ఉంది. ఆ తర్వాత కూడా రాజకీయంగా వెనుబడకుండా ఇప్పట్నుంచే చాలా పకడ్బందీగా పావులు కదుపుతున్నారట. ప్రత్యేకించి ఈసారి తన క్యాస్ట్‌ కార్డ్‌ను గతానికి భిన్నంగా, కాస్త డిఫరెంట్‌గా వాడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

రామచంద్రపురం ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచారు తోట త్రిమూర్తులు. కానీ… మొదట్నుంచి ఒక పార్టీలో కుదురుగా ఉండే అలవాటు లేదు ఆయనకు. ఇండిపెండెంట్‌గా, టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ…. ఇలా సీజన్‌ను బట్టి, అవకాశాలకు అనుగుణంగా కండువాలు మారుస్తుంటారన్న అభిప్రాయం ఉంది రాజకీయవర్గాల్లో. 2019లో టీడీపీ తరఫున రామచంద్రపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తోట వెంటనే వైసీపీ గూటికి చేరారు. ఇక 24 ఎన్నికల టైం వచ్చేసరికి కూటమి పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరడానికి గట్టిగానే ప్రయత్నించినట్టు చెప్పుకున్నారు. అయితే…. అవతల నుంచి సరైన సమాధానం రాక సైలెంట్ అయిపోయారన్నది ఒక వెర్షన్‌. జనసేనలో చేరడానికి తన బంధువు సామినేని ఉదయభాను ద్వారా, బీజేపీలోకి వెళ్ళేందుకు పాత పరిచయాల ద్వారా ప్రయత్నించినా… ఎక్కడా వర్కౌట్‌ అవలేదన్నది పొలిటికల్‌ వాయిస్‌.

అలాంటి రకరకాల కారణాలతో… ఎన్నికల తర్వాత మ్యూట్‌మోడ్‌లోకి వెళ్ళిపోయిన తోట త్రిమూర్తులు ప్రస్తుతం గేర్‌ మార్చారట. సరే… కూటమిలోకి రానివ్వలేదు, ఇక వాళ్ళని వదిలేసి ఉన్నచోటే మనమేంటో నిరూపించుకుందాం…. ప్రస్తుతానికైతే జంపింగ్‌ ఆలోచనలకు ఫుల్‌స్టాప్‌ పెడదామని అనుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కదలికలన్నీ…. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే భిన్నంగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిలకడలేని కారణంగా….తోట త్రిమూర్తులుకు మంత్రి పదవి దక్కలేదన్న అభిప్రాయం బలంగా ఉంది. సామాజిక వర్గం కోటాలో కూడా అవకాశాలు రాకపోవడానికి అది కూడా ఒక కారణం అంటున్నారు. కొన్ని సార్లు ఆయన పేరు పరిగణనలోకి తీసుకున్నా….కాంపిటేషన్ ఎక్కువగా ఉండటం, పార్టీలో నిలకడగా ఉన్నవాళ్ళకే అవకాశం ఇద్దామన్న కారణాలతో పక్కన పెట్టేసేవారట.మరోవైపు పార్టీ కంటే కులమే ఎక్కువని చాలాసార్లు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా కొంత ఇబ్బంది అయ్యేది. అందుకే ఇప్పుడు అదే పాయింట్‌ని బేస్ చేసుకుని వెనక్కి తగ్గకుండా క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ తానే ముందు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట ఆయన.

కులమే నాకు ముఖ్యమని ఎలాగూ ప్రకటించాను కాబట్టి… ఇక ఆ విషయంలో వెనక్కి తగ్గడం ఎందుకు? గట్టిగా ముందడుగు వేద్దామనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి కాపు కోటాలో మంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్న లెక్కలు తీస్తే… టాప్‌ ప్రయారిటీలో తానే ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక వైసీపీ పరంగా కాపు కులానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే….. ఎవరైనా తన తర్వాతే ఉండేలా చూసుకోవాలన్నది ఎమ్మెల్సీ ప్లాన్‌గా చెప్పుకుంటున్నారు. అందుకే కాపులు అంశం తెరమీదకి వచ్చినప్పుడల్లా పార్టీ నుంచి బ్రీఫింగ్‌ లేకున్నా సరే…. సొంతగా స్పీడ్ అయిపోతున్నారట. రేపు కాపు క్యాండిడేట్స్‌ రేసులో తానే ఫస్ట్ ఉండాలని తోట తాపత్రయపడుతున్నారని జిల్లాలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ప్రస్తుతం పొలిటికల్‌ పావులు కదుపుతున్నారన్నది లోకల్‌ టాక్‌. మొత్తం మీద ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్నాసరే…… రేపటి రోజున పవర్‌ వస్తే వెనకబడకుండా తోట త్రిమూర్తులు మంత్రి పదవిని అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అపోజిషన్ ఎమ్మెల్సీ కాలిక్యులేషన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.

Exit mobile version