Off The Record : పోలీస్ శాఖపై జుక్కల్ ఎమ్మెల్యే హాట్ హాట్ కామెంట్స్

Otr

Otr

ఆ ఎమ్మెల్యే పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ని ఎందుకు టార్గెట్‌ చేశారు? ఓపెన్‌గానే నెగెటివ్‌ కామెంట్స్‌ ఎందుకు చేశారు? అదీకూడా… అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండి పోలీస్‌ మాఫియా లాంటి ఘాటు పదజాలాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎక్కడ తేడా కొట్టింది? ఎవరా ఎమ్మెల్యే? కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బాన్సువాడలో ఇటీవల పోలీస్ శాఖను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రాష్ట్రస్దాయిలో చర్చకు దారి తీశాయి. జిల్లా స్థాయి అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు ప్రభుత్వ అనుమతితో ఇసుక తీసుకువెళ్తుంటే… ఆ ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే.. ఎమ్మెల్యే లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఇసుక ట్రాక్టర్లను వదిలి పెట్టాలని ఆదేశించారట. అందుకు అట్నుంచి మాకు ఎస్పీ ఆదేశాలు ఉన్నాయంటూ సమాధానం వచ్చింది. దాంతో లక్ష్మీకాంతరావు నేరుగా జిల్లా ఎస్పీకి కాల్ చేశారట. కానీ అప్పటికే కేసు బుక్‌ అయిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీసుకువెళ్తుంటే కేసులు పెడుతున్న పోలీసులు.. మహారాష్ట్రకు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పట్టించుకోవడం లేదని అన్నారు. మహారాష్ట్రకు ఇసుక తరలిస్తుండగా.. స్వయంగా తానే ఎస్పీకి ఫోన్ చేసి.. జీపీఎస్ తో సహా లొకేషన్ పెడితే పట్టుకోలేదని ఆరోపించారు. 400 మీటర్ల దూరంలో ఉండి సమాచారం ఇస్తే పట్టుకోలేకపోయారంటూ చురకలు అంటించారు. పేదలపై ప్రతాపం చూపి పెద్దలను వదిలేస్తే .. తన నియోజకవర్గంలో నడవదంటూ ఓ దశలో హెచ్చరించారట ఎమ్మెల్యే. పోలీస్ శాఖ మాఫియాలా మారిపోయిందని ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మంట పెడుతున్నాయి.

జుక్కల్ ఎమ్మెల్యే సాధారణంగా వివాదాలకు దూరం అన్న అభిప్రాయం పార్టీలో ఉంది.కానీ ఇసుక విషయంలో ఓ అడుగు ముందుకేసి డైరెక్ట్‌గా పోలీస్ శాఖకు చురకలంటించడం వెనుక అసలు ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ళ ఇసుక ట్రాక్టర్లను విడిచిపెట్టాలని స్వయంగా తానే ఫోన్ చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ఆయన ఈగో హర్ట్ అయ్యిందట. అధికారులు ఎమ్మెల్యేల మాట పట్టించుకోకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, లేదంటే డీజీపీకి ఫిర్యాదు చేస్తారు.. కానీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాత్రం.. ఏకంగా సభలో పోలీసుల తీరుపై రుసరుసలాడారంటే ఈగో హర్ట్‌ అవడమే కారణమన్నది ఆయన సన్నిహితుల మాట. పేదలకు సపోర్ట్‌గా తాను ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆయన తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం సహా… డిపార్ట్‌మెంట్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట ఎమ్మెల్యే. ఈ వివాదం కాస్తా.. ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో ఖద్దర్ వర్సెస్ ఖాకీలా మారింది. ప్రస్తుతం జుక్కల్‌లో ఈ వ్యవహారం బయటపడ్డా… కామారెడ్డి జిల్లాలో అధికారులు ఎమ్మెల్యేల మాట వినడం లేదన్న చర్చలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇప్పుడు రచ్చ అయింది గనుక ప్రభుత్వ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు