Off The Record : మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి కోవర్ట్ల భయం

  • మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డికి కోవర్ట్‌ల భయం
  • సొంత నేతల్ని చూసి కూడా మాజీ ఎమ్మెల్యే భయపడుతున్నారా?
  • ఎన్నికలకు ముందు నల్లపురెడ్డి అనుచరులు చాలామంది టీడీపీలోకి
  • ప్రసన్నకు మద్దతుగా కౌంటర్స్‌ ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న నేతలు
Mla

Mla

ఆ మాజీ ఎమ్మెల్యే తన పక్కన ఉండే వాళ్ళని చూసి కూడా ఉలిక్కి పడుతున్నారా? అడుగు తీసి అడుగేయాలంటే భయపడుతున్నారా? ఆ అడుగుల చప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులకు వినిపిస్తున్నట్టు ఫీలవుతున్నారా? తాను ఎవరితో ఏం మాట్లాడినా… క్షణాల్లో అవతలి వాళ్ళకు చేరిపోతోందని భయపడుతున్న ఆ వైసీపీ లీడర్ ఎవరు? ఏంటా స్పెషల్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌? నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ నుంచి ఎక్కువ సార్లు గెలిచిన, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు సొంతోళ్ళని చూసినా భయపడి పోతున్నారట. ఎవరి ముందు నోరు తెరవాలో అర్థంగాక హడలిపోతున్నారట. ఎవరు మనోళ్ళు.. ఎవరు పగోళ్ళో అర్థంగాక ఆయన సతమతం అవుతున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. కోవూరు నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యేని ఇప్పుడు సొంత పార్టీ నాయకులే భయపెడుతున్నట్టు తెలుస్తోంది. 2024లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు నేను పని చేస్తుంటే…. నా ప్రతి కదలికను వెంటనే ప్రత్యర్థులకు చేరవేస్తున్నారన్నది ఆయన బాధ. 2019లో కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి అప్పట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ.. నిరాశే మిగిలింది. నాడు ఆయనకు పదవి కాకున్నా…. పార్టీ అధికారంలో ఉన్నందున ఆపేరును అడ్డం పెట్టుకుని అనుచరగణం, పార్టీ ఇతర నేతలు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక 2024కు వచ్చేసరికి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేశారు. ఆర్థిక బలం మెండుగా ఉన్న ప్రశాంతి రెడ్డి.. ఎన్నికలకు ముందు నుంచే సత్తా చూపించారు. దాంతో నియోజకవర్గ ముఖ్య నాయకుల్లో చాలామంది ఒక్కొక్కరుగా టీడీపీ గూటికి చేరిపోయారు. దీంతో ఎన్నికలకు ముందే ప్రసన్న శిబిరంలోని కీలక నేతలందరూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పేసుకున్నారు. ఇక ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేసే పనిలోపడ్డారట ప్రసన్నకుమార్ రెడ్డి. ఈ క్రమంలో ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయంటున్నారు.

తాను ఏం చేయాలనుకుంటున్నానో ముందే తెలుసుకుని సొంతోళ్ళే ప్రత్యర్థులకు సమాచారం ఇస్తూ… వెన్నుపోటు పొడుస్తున్నారన్నది ప్రసన్నకుమార్‌రెడ్డి బాధగా చెప్పుకుంటున్నారు. ఇటీవల బుచ్చిలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రసన్నకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దానికి కౌంటర్ ఇవ్వడానికి కూడా స్థానిక వైసిపి నేతలు ప్రయత్నించలేదట. స్వయంగా మాజీ ఎమ్మెల్యే చెప్పినాసరే…. లోకల్ గా ఉండే వైసీపీ నేతలు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ముందుకు రాలేదని తెలిసింది. ఈ వ్యవహారం జరుగుతున్న సమయంలోనే….నల్లపురెడ్డి చుట్టూ ఉండేవాళ్ళలో ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీకి టచ్‌లోకి వెళ్ళారన్న ప్రచారం జరుగుతోంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల తన కారులో మరో వ్యక్తితో జరిపిన సంభాషణను సైతం మొబైల్‌లో రికార్డు చేసి టీడీపీ ముఖ్య నేతకు పంపారట. ఆ దెబ్బకు ప్రసన్నకుమార్‌రెడ్డి ఉలిక్కి పడ్డట్టు సమాచారం. ఇక ఆయన కుడి భుజంగా ఉంటున్న వీరి చలపతి అరెస్ట్‌ వెనక కూడా సొంతోళ్ళ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులకు సమాచారం ఇచ్చింది పార్టీలోని కోవర్ట్ లేనని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు.

కొందరు పగలంతా వైసీపీతో ఉంటూ….. చీకటి పడేసరికి తెలుగుదేశం పార్టీ నేతలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న మాటలు కోవూరు ఫ్యాన్‌ శిబిరంలో వినిపిస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే ప్రతి విషయాన్ని అధికార పార్టీ నేతలకు చేరవేస్తున్నారనేది ఆయన శిబిరం అనుమానం. ఇటీవల ఇందుకూరుపేట మండలం మైపాడు సమీపంలోని ఓ లేఔట్ వ్యవహారంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి అధికార పార్టీ నేతలతో చేతులు కలిపారట. ప్రసన్న వ్యూహాలను ముందుగానే లే అవుట్ నిర్వాహకులకు చేరవేసినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో అప్రపత్తమైన ప్రసన్న కుమార్ రెడ్డి సదరు నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు ఈ రెండేళ్ల కాలంలో చాలానే జరిగాయని వైసిపి నేతలు చర్చించుకుంటున్నారు.. పార్టీలో పదవులు తీసుకుని.. అంతర్గత విషయాలను ప్రత్యర్థులకు చేరవేసే వారిపై చర్యలు తీసుకోవాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. మరోపక్క కార్యకర్తలకు, ప్రసన్నకుమార్ రెడ్డికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసేందుకు కూడా ఓ వర్గం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. కోవర్ట్‌ల విషయంలో ప్రసన్న వేగంగా స్పందించకపోతే..ఆయనకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.