Site icon NTV Telugu

Off The Record : ఎమ్మెల్యే మాధవి పార్టీతో పని లేకుండా సొంత రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారా?

Mla Madhav

Mla Madhav

అక్కడ అంతా మేడమ్‌ ఇష్టమేనా? నేను మోనార్క్‌ని…. గిల్లితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలని అంటున్నారా? పార్టీ నిర్ణయాలతో పని లేకుండా… తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… నేను చెప్పిన వాళ్ళే కార్పొరేటర్స్ అవుతారని అంటున్న ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు? ఆమె దూకుడుతో ఎఫెక్ట్‌ అవుతున్నదెవరు? దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి కడప గడ్డ మీద టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలో పాగా వేయగలిగినా… ప్రస్తుతం కడప సెగ్మెంట్‌లో పార్టీ పరిస్థితి అయోమయంగా మారిందట. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి సైకిల్‌ గుర్తు మీద విజయం సాధించారు రెడ్డప్పగారి మాధవి. నాడు ఆమె గెలుపు కోసం కృషి.. నానా తంటాలు పడ్డ డివిజన్ ఇన్ఛార్జ్‌ల్లో ఎక్కువ మంది ఇప్పుడు ఎమ్మెల్యేకు శత్రువులుగా మారినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కష్టించి పని చేసిన తమను కాదని, మాధవి కొత్త వ్యక్తులకు ఇన్ఛార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ మండిపడుతున్నారట డివిజన్‌ నాయకులు. ఎన్నికలకు ముందు కడప నగర అధ్యక్షుడితో పాటు పలు డివిజన్స్‌కు ఇన్చార్జ్‌లను నియమించింది టీడీపీ. కానీ… మాధవి ఎమ్మెల్యే అయ్యాక మొత్తం మేటర్‌ మారిపోయిందట. గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా తనకు అనుకూలమైన వారిని మాత్రమే ఇన్ఛార్జ్‌ పోస్టుల్లో నియమించినట్టు చెప్పుకుంటున్నారు. అదే ఇప్పుడు కేడర్‌లో అయోమయానికి ప్రధాన కారణమైందట. మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ పార్టీ జెండా ఎగరేసినా… తమకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన ఉన్నట్టు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తమను కాదని కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారట. నిన్న మొన్నటి వరకు కుర్చీ గోలతో వివాదాల్లోకి ఎక్కిన కడప ఎమ్మెల్యే… ఇప్పుడు మరో విషయంలో నేను మోనార్క్‌ని అంటున్నట్టు సమాచారం. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో…తాను చెప్పిన వ్యక్తులే కడప కార్పొరేటర్లుగా పోటీ చేస్తారని ఆమె బహిరంగంగా అంటున్నారట. ఆ స్టేట్‌మెంట్స్‌ కారణంగా…టీడీపీలో వర్గ విభేదాలు పెరుగుతున్నాయంటున్నారు. అంతా ఆమె ఇష్టమేనా? పార్టీకంటూ ఒక నిర్ణయం ఉంటుంది కదా.. అంటూ స్థానిక తెలుగుదేశం నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై సీనియర్ నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. కడప కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న రెండు కార్పొరేటర్ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణ కోసం ఇక ఎప్పుడైనా… నోటిఫికేషన్ రావచ్చనుకుంటున్న టైంలో… ఎమ్మెల్యే వైఖరి చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మాధవితో పాటు ఆమె భర్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు వాసు నగరంలోని పలు డివిజన్స్‌లో పర్యటన చేస్తూ అప్పుడే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశారట. వాస్తవానికి మున్సిపల్‌ పాలక మండలికి ఇంకా ఏడు నెలల గడువుంది. ఆలోపే… రెండు కార్పొరేటర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంతో… అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. అదే సమయంలో మాధవి కూడా తాను చెప్పిన వ్యక్తులే అభ్యర్థులుగా ఉంటారని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అలాగైతే…ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పనిచేసిన తమ పరిస్థితి ఏంటన్నది పలువురు సీనియర్స్‌ క్వశ్చన్‌. పార్టీ ఆదేశాలు పాటించకుండా… తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ద్వితీయ శ్రేణి టిడిపి నాయకులు భావిస్తున్నారట. కడప టీడీపీ హడావిడి, వర్గపోరుకు పార్టీ పెద్దలు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తారో చూడాలి.

Exit mobile version