విజయనగరం జిల్లాలో మైనింగ్ మాఫియా…అసిస్టెంట్ జియాలజిస్ట్‌ను కాపాడుతోందా ? ప్రభుత్వాలు మారినా…సదరు అధికారి మారడం లేదా ? కుర్చికీ ఫెవికల్ వేసుకొని…కదలనని అంటున్నారా ? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా…ఫలితం లేకుండా పోతోందా ? అంతలా అసిస్టెట్ జియాలజిస్ట్ పరపతి ఉపయోగిస్తున్నారా ?
ఏపీలో మైనింగ్ మాఫియా ప్రభావం రోజురోజుకీ పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డబ్బు కట్టలు విసురుతూ, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని, అధికారులను ప్రభావితం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. తమ అక్రమ కార్యకలాపాల కోసం అనూకూల అధికారులను దగ్గర పెట్టుకుంటూ.. వారి బాగోగులు చూసుకుంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్ అంటే కోట్లలో వ్యాపారం.. సక్రమంగా నడిపితే మిగులే కానీ తగులన్న ప్రశ్నే లేదు. ఇక అక్రమంగా చేస్తే తిరిగే లేదు. ఇందుకోసం మాఫియా మైనింగ్ శాఖలో…ఓ అధికారిని కోవర్టుగా పెట్టుకుంటుందన్న టాక్ నడుస్తోంది. పరిమితిని మించి మైనింగ్ జరిగినా, అధికారులు దాన్ని కనిపెట్టినా పట్టించుకోకుండా ఉండేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. మైనింగ్ డేటా రికార్డులను మార్చేయడం…గనుల పరిశీలనపై ముందుగానే సమాచారం ఇవ్వడం…మాఫియాను అప్రమత్తం చేయడం వంటివి సదరు అధికారి చేస్తున్నారట. పర్యావరణ శాఖ మైనింగ్ అనుమతించేలా వ్యవహరించడంలో ఆయనే కీలకపాత్ర పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది. విజయనగరం మైనింగ్ శాఖలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌ను మాఫియా పడగలా కాపాడుతోందని ఆ శాఖలోని ఉద్యోగులు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వాలు మారినప్పటికీ…ఆ అధికారి మాత్రం మారలేదట. మైనింగ్ మాఫియా అండతో సదరు అధికారి 11 ఏళ్లుగా విజయనగరంలోనే 11 ఏళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నారు.
నాడు వైసిపి హయాంలో…నేడు కూటమి హయాంలోనూ ఆ ఉద్యోగే చక్రం తిప్పుతిన్నాడన్నది టాక్. మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు రాకుండా…ఒకసారి విజయనగరం బయటకు వెళ్లి ఓ 9 నెలలు ఉన్నాడు. అది కూడా విశాఖపట్నంలో ఉంటున్నట్లుగా ఒక రికార్డు సృష్టించాడు. ఈ 11 ఏళ్లల్లో రెండుసార్లు అలా వెళ్లి…ఇలా వచ్చి ఆ సీట్లో ఫెవికాల్ రాసుకొని కూర్చున్నాడని చర్చించుకుంటున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్‌లో టాప్ టు బాటమ్ ఎంతగా మేనేజ్ చేస్తాడంటే…పే రోల్‌లో మాత్రం విజయవాడ సెక్రటేరియట్‌లో పని చేస్తున్నట్లు ఉంటుంది. అక్కడి నుంచి మంత్లీ శాలరీ కూడా పడుతుంది. కానీ ఆయన విజయనగరంలోనే ఉండి పని చేస్తారు. అదే కుర్చీలో కూర్చొని అన్ని ప్రమోషన్లు పొందాడు. ఉత్తరాంధ్ర పరిధిలోని మైనింగ్ విజిలెన్స్ మొత్తం అయ్యగారి చేతుల్లోనే ఉండటంతో…మైనింగ్ మాఫియా ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సొంత శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఈ అధికారి వ్యవహారంపై స్థానిక టీడీపీ నాయకులే మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సదరు మంత్రి దగ్గర పెద్ద పంచాయితీ నడిచింది. కానీ ఆ అసిస్టెంట్ జియాలజిస్ట్‌ని అంగుళం కూడా కూడా కలపలేకపోయారట. దీనికి మాఫియా ప్రభావమే కారణమనే చర్చ నడుస్తోంది.
విజయనగరం జిల్లా దేవాడ మైనింగ్ బ్లాక్‌లో అనుమతికి మించి…నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుగుతున్నాయి. దీనిపై ఇటీవల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు వెళ్లింది. దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినా…ఇప్పటికి గాని బయటికి రాలేదు. విజయనగరంలోనే ఉండి నివేదికలు వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారట. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం కార్యాలయానికి తెలిసినా కూడా…ఈ విజిలెన్స్ అధికారిని అక్కడి నుంచి కదపలేకపోయారట. ప్రభుత్వాలు మారుతున్నా ఆ అధికారిని ఎందుకు కదపలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కిందటి ప్రభుత్వంలో నేతలతో అంట కాగిన అధికారికి ఈ ప్రభుత్వంలోనూ పగ్గాలిచ్చారు. ఇంతగా ఆధికారిని కాపాడటంలో…అక్రమ మైనింగ్ రిపోర్ట్ లు వెళ్లకుండా ఆగడంలో మైనింగ్ మాఫియా హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
