Site icon NTV Telugu

Off The Record : జిల్లాలోని మూడు సెగ్మెంట్స్ లో రెండింటికి మంత్రి దూరం

Venkataswamy Otr

Venkataswamy Otr

Off The Record : సొంత జిల్లాలో ఆ మంత్రి ఒంటరి అయ్యారా? తనకు రావాల్సిన అవకాశాన్ని తన్నుకుపోయారని ఒకరు, సీనియర్‌ అయిన నన్ను వదిలేసి జూనియర్‌కు ఛాన్స్‌ ఇచ్చారన్న అక్కసుతో మరొకరు మంత్రిని దూరం పెడుతున్నారా? ఆ రెండు నియోజకవర్గాల్లో ఆయన అడుగు పెట్టడానికి పర్మిషన్‌ లేదా? ఎవరా మంత్రి? ఆయన్ని నియంత్రిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు ఛాన్స్‌ దక్కింది. అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ కూడా మంత్రి పదవి మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకే అవకాశం వస్తుందని ఎదురు చూసినా నిరాశే మిగిలింది. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి చెన్నూర్ నుంచి పోటీ చేసి గెలిచిన వివేక్‌కే అవకాశం దక్కింది. ఇక అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు ప్రేమ్ సాగర్ రావ్. పైగా నా నియోజకవర్గానికి నేనే బాస్, ఎవ్వరు మంత్రి అయినా నా దగ్గర సాగదని అన్నారు. అంతేకాదు…. వివేక్ మంత్రి అయ్యాక ఆ హోదాలో కనీసం తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వడం లేదట.ఆయన అనుచరులు అయితే… అడుగు పెడితే గొడవే అన్నట్లుగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని లక్సెట్టి పేట, దండేపల్లి మండలాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, దామోదర రాజనరసింహ పర్యటించారు. కానీ… వివేక్ మాత్రం దూరంగానే ఉన్నారు. అధికారిక కార్యక్రమం కాబట్టి జిల్లా అధికారులు వివేక్‌కు ప్రొటోకాల్ ప్రకారం సమాచారం ఇచ్చినా… నియోజకవర్గ ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం లేదు కాబట్టి ఆయన వెళ్ళలేదని సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి మంత్రులు వచ్చినా … హాజరయ్యే వివేక్,,, మంచిర్యాలకు నలుగురు మంత్రులు వచ్చినా వెళ్ళకుండా వేరే జిల్లాలో కార్యక్రమాలకు హాజరయ్యారట.

అటు తాజాగా ఆయన సోదరుడు వినోద్ సైతం ఓ కార్యక్రమంలో తమ్ముడు వివేక్‌ను టార్గెట్ చేస్తూ అన్న మాటలు పెనుదుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు రాజకీయ అవకాశాలుపోతున్నాయనే బాధలో ఉన్న ప్రేమ్‌ సాగర్ రావ్ విభేదించాడుకుంటే… ఇప్పుడు సొంత అన్నసైతం వివేక్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడం ప్రారంభించారా అనే చర్చ తెరపైకి వచ్చింది. వన మహోత్సవం కార్యక్రమంలో అటవీశాఖ అధికారులతో మాట్లాడిన వినోద్… వివేక్‌కు ఒక రూల్, నాకో రూలా…ఇదెక్కడి న్యాయం అంటూ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రి అయితే ఏంటీ…నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందిపెడితే అటవీశాఖ అధికారులను బదిలీ చేయిస్తా..అవసరం అయితే సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అంటే.. ఆయనకు కూడా మంత్రి పదవి రాలేదన్న బాధ మనసులో ఉందా? జూనియర్ అయిన తన తమ్ముడికి పదవి ఇచ్చారని ఫీలవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది జిల్లాలో. సొంత అన్నసైతం మంత్రి వివేక్ ను వ్యతిరేకిస్తున్నారా అన్నది తాజా డౌట్‌ అట. వాస్తవానికి వివేక్ మంత్రి అయ్యాక… మంచిర్యాలకే కాదు తన అన్న ఎమ్మెల్యేగా ఉన్న బెల్లంపల్లిలో సైతం అధికార కార్యక్రమం నిర్వహించలేదు. మంత్రి అయ్యాక హైదరాబాద్‌లో అన్నవదినల ఆశీర్వాదం తీసుకున్నా… నియోజకవర్గానికి మాత్రం మంత్రి హోదాలో వెళ్ళలేదు. మంచిర్యాల జిల్లాలో చెన్నూర్ ,బెల్లంపల్లి,మంచిర్యాల నియోజకవర్గాలుండగా కేవలం చెన్నూర్ తప్ప సొంత జిల్లాలోని మిగతా రెండు నియోజకవర్గాల్లో మంత్రి అడుగుపెట్టలేకపోవడం, వివేక్‌కు ఇబ్బందికరమేనంటున్నారు. సొంత జిల్లాలో మంత్రి ఏకాకి అయ్యారని, అన్న కూడా ఆయనే లక్ష్యంగా వ్యాఖ్యలు చేయడంతో వివేక్‌ ఒంటరి అయ్యారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో.

 

 

Exit mobile version