సంక్రాంతి సీజన్‌లో కోడి పందేలకంటే ఎక్కువగా…. ఆ ఇద్దరు నేతల మధ్య పగలు రగులుతున్నాయా? నీ నియోజకవర్గానికి నువ్వేం చేశావో చెప్పమని ఒకరు సవాల్ చేస్తే… మరి నీ సంగతేంటంటూ మరొకరు రివర్స్‌లో వేలు చూపిస్తున్నారు. పందెం కోళ్లలా కాలు దువ్వుతున్న ఆ మహిళా నేతలు ఎవరు? ఎక్కడ పేలుతున్నాయి ఆ మాటల తూటాలు? రాయలసీమలో పొలిటికల్ పౌరుషాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిల మధ్య నిత్య యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరు మహిళా నేతల వంతొచ్చింది. పెతాపం నీదా? నాదా? మీ ఊరా, మా ఊరా…? రా… తేల్చుకుందాం అంటూ.. సవాళ్ళు విసురుకుంటున్నారు. ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీని గురించే హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ మధ్య పేలుతున్న మాటల తూటాలు ఎటు పోతాయోనన్న ఆందోళన సైతం పెరుగుతోంది రెండు వర్గాల్లో. ఈ ఇద్దరు నేతల మధ్య పాత పగలు లేవు. కుటుంబ గొడవలు అంతకంటే లేవు. కేవలం రెండేళ్ల నుంచే వివాదాలు మొదలయ్యాయి. అది కూడా రాజకీయ గొడవలే. కానీ…. దాన్ని ఇద్దరూ పర్సనల్‌గా తీసుకుంటున్నారట. అందుకే నిత్యం ఏదో ఒక అంశం మీద కయ్యానికి దిగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పరస్పరం అంటున్న మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అయితే… ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… ఇద్దరూ లోకల్ గొడవల్ని తీసుకెళ్లి.. ప్రత్యర్థి పార్టీ అధినేతలపై చిందులు తొక్కుతున్నారు . జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.. ఆయన్ని నుంచి మేము కాపాడామని అంటున్నారు మంత్రి సవిత….. అదే సమయంలో ఇటు ఉష శ్రీచరణ్‌ని ప్రశ్నిస్తే.. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
రోటీన్ గా సాగే వీరి మాటల యుద్ధం తాజాగా మరింత పీక్ స్టేజ్ కి వెళ్లింది. నువ్వు పెనుకొండకు ఏం చేశావో చెప్పాలంటూ మంత్రి సవితను మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ డిమాండ్ చేయగా.. అందుకు మినిస్టర్ చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పటిలానే జగన్ నుంచి మొదలుపెట్టి.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, కొంతమంది వలస పక్షులు, వారి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రజలను రప్పా రప్పా అంటూ రెచ్చగొడుతున్నారని కామెంట్ చేశారు. జగన్ అయినా, ఉష అయినా అభివృద్ధి చేస్తుంటే సహకరించక పోగా ఓర్చుకోలేకపోతున్నారంటూ విమర్శించారు మంత్రి. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఉష శ్రీచరణ్ ఐదేళ్ళలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన18 నెలల్లో పెనుకొండ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెప్తానని.. కళ్యాణదుర్గానికి నువ్వు చేసింది చెప్పాలంటూ మాజీమంత్రిని సవాల్ చేశారు మినిస్టర్. అందుకు ఉష శ్రీచరణ్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు .మంత్రి సవితను పెనుకొండ నియోజకవర్గానికి చేశావో చెప్పమంటే జగన్ గురించి ఎందుకు మాట్లాడుతుంటారంటూ ఫైర్ అయ్యారు. జగన్ 2.0లో ఫస్ట్ టార్గెట్ నవ్వేనంటూ ఉషాశ్రీ వార్నింగ్ ఇచ్చారు..మొత్తం మీద ఈ మహిళా నేతల మధ్య మాటల యుద్ధం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
